Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వార్నర్ నిలిచినా.. తప్పని ఓటమి
- సూపర్ ఓవర్లో కోల్‌కత విజయం
- నిప్పులు చెరిగిన లాకీ ఫెర్గుసన్
ఆఖరు ఓవర్లో 18 పరుగులు అవసరం. క్రీజులో ప్రమాదకర డెవిడ్ వార్నర్, తోడుగా హిట్టర్ రషీద్ ఖాన్. బంతి ఫిట్నెస్ లేని రసెల్ చేతికిచ్చాడు మోర్గాన్. బంతి రసెల్ చేతికి అందగానే హైదరాబాద్ పని సగం పూర్తయ్యింది. ఇక లాంఛనం ముగించటమే తరువాయి అనిపించింది. రసెల్‌పై హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన వార్నర్.. ఆఖరు బంతికి రెండు పరుగులు కావాల్సిన తరుణంలో ఒక్క పరుగే తీశాడు. దీంతో హైదరాబాద్‌ది అనుకున్న మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. చేజారిన మ్యాచ్‌ను అద్భుత రీతిలో సూపర్ ఓవర్లో దక్కించుకున్న కోల్‌కత సీజన్లో ఐదో విజయం నమోదు చేసింది. సీమర్ లాకీ ఫెర్గుసన్ (3/15) కోల్‌కత విజయంలో ముఖ్య భూమిక వహించాడు.
సన్‌రైజర్స్‌కు సూపర్ షాక్. సొంతమైందనుకున్న మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసి.. దూరమైంది. సూపర్ ఓవర్లో లాకీ ఫెర్గుసన్ నిప్పులు చెరగటంతో హైదరాబాద్ 2/2కు పరిమితం కాగా.. కోల్‌కత 3/0తో అలవోక విజయం నమోదు చేసింది. ఇక 164 పరుగుల ఛేదనలో డెవిడ్ వార్నర్ (47 నాటౌట్, 33 బంతుల్లో 5 ఫోర్లు), ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (36, 28 బంతుల్లో 7 ఫోర్లు) రాణించటంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 163/6 పరుగులు చేసింది. కోల్‌కత నైట్‌రైడర్స్ తరఫున శుభ్‌మన్ గిల్ (36, 37 బంతుల్లో 5 ఫోర్లు), ఇయాన్ మోర్గాన్ (34, 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (29 నాటౌట్, 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరవటంతో ఆ జట్టు 163/5 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కత, హైదరాబాద్ స్కోర్లు సమం అయ్యాయి. దీంతో విజేతను సూపర్ ఓవర్ ద్వారా తేల్చారు.
వార్నర్ మెరిసినా..
హైదరాబాద్ లక్ష్యం 164 పరుగులు. ముగ్గురు విదేశీ బ్యాట్స్‌మెన్ టాప్ ఆర్డర్లో వరుసగా వస్తుండటంతో వార్నర్ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేశాడు. జానీ బెయిర్‌స్టోకు తోడుగా కేన్ విలియమ్సన్ ఓపెనర్‌గా రాగా.. యువ ఆటగాడు ప్రియమ్ గార్గ్‌కు నం.3 పొజిషన్‌కు ప్రమోషన్ లభించింది. ఈ మార్పులు హైదరాబాద్‌కు సక్సెస్ ఇచ్చినట్టే ఇచ్చి షాకిచ్చింది. జానీ బెయిర్‌స్టో (36, 28 బంతుల్లో 7 ఫోర్లు), కేన్ విలియమ్సన్ (29, 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) పవర్ ప్లేలో దూకుడుగా ఆడారు. తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించిన విలియమన్సన్, బెయిర్‌స్టో జోడీ పవర్ ప్లేలో వికెట్ నిలుపుకుంది. ఏడో ఓవర్లో బంతి అందుకున్న కివీస్ పేసర్ లాకీ ఫెర్గుసన్ (3/15) హైదరాబాద్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. క్రీజులో నిలదొక్కుకున్న కేన్ విలియమ్సన్తో పాటు యువ బ్యాట్స్‌మన్ ప్రియమ్ గార్గ్ (4), మనీశ్ పాండే (6)లను వెనక్కి పంపాడు. జానీ బెయిర్‌స్టో సైతం భారీ షాట్‌కు వెళ్లి వికెట్ కోల్పోయాడు. ఈ గడ్డు పరిస్థితుల్లో డెవిడ్ వార్నర్ (47, 33 బంతుల్లో 5 ఫోర్లు) టెయిలెండర్లు తోడుగా లక్ష్యం దిశగా సాగాడు. విజరు శంకర్ (7) సైతం విఫలమైనా.. అబ్దుల్ సమద్ (23, 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) వార్నర్‌కు సహకరించాడు. కానీ రీలే క్యాచ్‌తో సమద్‌ను సాగనంపిన కోల్‌కత.. వార్నర్‌పై ఒత్తిడి పెంచింది.
ఆఖరు ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా.. హ్యాట్రిక్ ఫోర్లతో వార్నర్ 17 పరుగులు పిండుకున్నాడు. ఆఖరు బంతికి ఒక్క పరుగు మాత్రమే రావటంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. నిర్ణీత ఓవర్ల మ్యాచ్‌లో హైదరాబాద్‌ను దెబ్బకొట్టిన లాకీ ఫెర్గుసన్.. సూపర్ ఓవర్లోనూ చెలరేగాడు. రెండు వికెట్లు తీసి సూపర్ ఓవర్లో హైదరాబాద్ ఆరు బంతులు ఆడే అవకాశం నిరాకరించాడు.
మోర్గాన్, కార్తీక్ ధనాధన్
హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కోల్‌కత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. కానీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (34, 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (29 నాటౌట్, 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆఖరు నాలుగు ఓవర్లలో 59 పరుగులు పిండుకున్నారు. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు 163 పరుగుల స్కోరు అందించారు. పిచ్ బౌలర్లకు సహకరించటంతో టాప్ ఆర్డర్లో ఎవరూ స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించలేదు.
శుభ్‌మన్ గిల్ (36, 37 బంతుల్లో 5 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (23, 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) పవర్‌ప్లేలో తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. నితీశ్ రానా (29, 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మెరిశాడు. అండ్రీ రసెల్ (9, 11 బంతుల్లో 1 ఫోర్) మళ్లీ నిరాశపరిచాడు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టగా.. బసిల్ తంపీ, విజరు శంకర్, రషీద్ ఖాన్లు తలా ఓ వికెట్ తీసుకున్నారు.
స్కోరు వివరాలు
కోల్‌కత ఇన్నింగ్స్ : శుభ్‌మన్ గిల్ (సి) ప్రియమ్ గార్గ్ (బి) రషీద్ ఖాన్ 36, రాహుల్ త్రిపాఠి (బి) నటరాజన్ 23, నితీశ్ రానా (సి) ప్రియమ్ గార్గ్ (బి) విజరు శంకర్ 29, అండ్రీ రసెల్ (సి) విజరు శంకర్ (బి) నటరాజన్ 9, ఇయాన్ మోర్గాన్ (సి) మనీశ్ పాండే (బి) బసిల్ తంపీ 34, దినేశ్ కార్తీక్ నాటౌట్ 29, ఎక్స్‌ట్రాలు : 03, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163.
వికెట్ల పతనం : 1-48, 2-87, 3-88, 4-105, 5-163.
బౌలింగ్ : సందీప్ శర్మ 4-0-27-0, బసిల్ తంపీ 4-0-46-1, నటరాజన్ 4-0-40-2, విజరు శంకర్ 4-0-20-1, రషీద్ ఖాన్ 4-0-28-1.
హైదరాబాద్ ఇన్నింగ్స్ : జానీ బెయిర్‌స్టో (సి) రసెల్ (బి) చక్రవర్తి 36, కేన్ విలియమ్సన్ (సి) నితీశ్ రానా (బి) లాకీ ఫెర్గుసన్ 29, ప్రియమ్ గార్గ్ (బి) లాకీ ఫెర్గుసన్ 4, డెవిడ్ వార్నర్ నాటౌట్ 47, మనీశ్ పాండే (బి) లాకీ ఫెర్గుసన్ 6, విజరు శంకర్ (సి) శుభ్‌మన్ గిల్ (బి) కమిన్స్ 7, అబ్దుల్ సమద్ (సి) శుభ్‌మన్ గిల్ (బి) శివం మావి 23, రషీద్ ఖాన్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 163.
వికెట్ల పతనం : 1-57, 2-70, 3-70, 4-82, 5-109, 6-146.
బౌలింగ్ : పాట్ కమిన్స్ 4-0-28-1, శివం మావి 3-0-34-1, వరుణ్ చక్రవర్తి 4-0-32-1, అండ్రీ రసెల్ 2-0-29-0, లాకీ ఫెర్గుసన్ 4-0-15-3, కుల్దీప్ యాదవ్ 3-0-18-0.