Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో సూపర్ ఓవర్లో ముంబయిపై గెలుపు
- ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన పంజాబ్
పంజాబ్ నిలిచింది.. చేజేతులా మరో మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకు తెచ్చుకున్న రాహుల్ జట్టు.. ఈసారి అంత సులువుగా వదిలిపెట్టలేదు. రెండు సూపర్ ఓవర్లకు దారితీసిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై ఉత్కంఠ విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో ఆశలు సజీవంగా నిలుపుకుంది. 177 పరుగుల ఛేదనలో కెప్టెన్ కెఎల్ రాహుల్ (77, 51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగాడు. క్రిస్ గేల్ (24), నికోలస్ పూరన్ (24) సహా దీపక్ హుడా (23 నాటౌట్), క్రిస్ జోర్డాన్ (13) రాణించటంతో పంజాబ్ విజయానికి దగ్గరైంది. ఆఖరు ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. బౌల్ట్ 8 పరుగులే ఇచ్చాడు. ఆఖరు బంతికి రెండో పరుగుకు జోర్డాన్ రనౌట్ కావటంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. పంజాబ్ 176/6, ముంబయి 176/5 స్కోర్లు నిర్ణీత ఓవర్లలో సమం అయ్యాయి. సూపర్ ఓవర్లో బుమ్రా పంజాబ్‌ను పడగొట్టాడు. కెఎల్ రాహుల్, పూరన్, దీపక్ హుడాలకు ఐదు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆరు పరుగుల లక్ష్యాన్ని మహ్మద్ షమి సూపర్ బౌలింగ్‌లో కాపాడాడు. ఆరు బంతుల్లో ఐదు పరుగులే ఇచ్చి మరో సూపర్ ఓవర్‌కు మ్యాచ్‌ను తీసుకెళ్లాడు. రోహిత్ శర్మ, డికాక్‌లను షమి నిలువరించాడు. రెండో సూపర్ ఓవర్లో క్రిస్ జోర్డాన్‌పై ముంబయి 11/1 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్య (1), కీరన్ పొలార్డ్ ఓ ఫోర్ కొట్టగా.. ఆఖరు బంతి సిక్సర్ కాకుండా మయాంక్ కండ్లుచెదిరే ఫీల్డింగ్ చేశాడు. 12 పరు గుల ఛేదనలో బౌల్ట్పై క్రిస్ గేల్ ఓ సిక్సర్, మయాంక్ అగర్వాల్ రెండు ఫోర్లు బాది పంజాబ్‌కు సూపర్ సూపర్ విజయాన్ని కట్టబెట్టారు. నిబంధనల ప్రకారం తొలి సూపర్ ఓవర్లో బౌలింగ్, బ్యాటింగ్ చేసిన క్రికెటర్లు రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్, బౌలింగ్ చేయడానికి వీల్లేదు.
ఆఖర్లో ధనాధన్
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్‌కు పవర్ ప్లేలో బ్రేక్‌లు వేశాడు సీమర్ అర్షదీప్ సింగ్ (2/35). రోహిత్ శర్మ (9), ఇషాన్ కిషన్ (7)లను అవుట్ చేసి ముంబయి జోరుకు బ్రేక్‌లు వేశాడు. సూర్యకుమార్ యాదవ్ (0)లను మహ్మద్ షమి డకౌట్ చేయటంతో స్కోరు వేగం మందగించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (53, 43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) నిలిచినా.. వేగంగా పరుగులు చేయలేకపోయాడు. కృనాల్ పాండ్య (34, 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) మెరిసినా రన్‌రేట్ పెరుగలేదు. హార్దిక్ పాండ్య (8)ను షమి తెలివిగా తప్పించటంతో మొదలైన పొలార్డ్ విధ్వంసం ఆఖరు బంతి వరకు కొనసాగింది. అర్షదీప్‌పై వరుస సిక్సర్లు బాదిన పొలార్డ్ ఆఖరు ఓవర్లోనూ అదే జోరు చూపించాడు. 12 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 34 పరుగులు పిండుకున్నాడు. కౌల్టర్ నైల్ (24 నాటౌట్, 12 బంతుల్లో 4 ఫోర్లు) భారీ షాట్లతో మెప్పించాడు.