Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3/8తో నిప్పులు చెరిగిన పేసర్
- బెంగళూర్ చేతిలో కోల్‌కత చిత్తు
అబుదాబి (యుఏఈ)
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (3/8) నిప్పులు చెరిగాడు. అబుదాబిలో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన సిరాజ్ దిగ్గజ బౌలర్లకు సాధ్యం కాని గణాంకాలను నమోదు చేశాడు. కోల్‌కత నైట్‌రైడర్స్‌పై రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన సిరాజ్ మూడు వికెట్లతో చెలరేగాడు. మహ్మద్ సిరాజ్‌కు తోడు స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ (2/15) రాణించటంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ చేతిలో కోల్‌కత నైట్‌రైడర్స్ చిత్తుగా ఓడింది. బెంగళూర్ బౌలర్ల దెబ్బకు తొలుత నిర్ణీత ఓవర్లలో 84 పరుగులే చేసిన కోల్‌కత.. బంతితో ఆ జట్టును ఏమాత్రం ఆపలేకపోయింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (30, 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), లాకీ ఫెర్గుసన్ (19 నాటౌట్, 16 బంతుల్లో 1 ఫోర్)లు కోల్‌కత పరువు నిలిపారు. 85 పరుగుల ఛేదనను బెంగళూర్ ఆడుతూ పాడుతూ ఊదేసింది. ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్ (25), అరోన్ ఫించ్ (16)లు తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించగా.. విరాట్ కోహ్లి(17 నాటౌట్), గుర్కీరత్ మన్ (21 నాటౌట్) మరో 39 బంతులు ఉండగానే లాంఛనం ముగించారు. 8 వికెట్ల తేడాతో బెంగళూర్ ఘన విజయం సాధించింది.
నిప్పులు చెరిగాడు : బెంచ్ కు పరిమితమై కోల్కతతో మ్యాచ్‌కు వచ్చిన మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కూల్చిన సిరాజ్ కోల్‌కత ఇన్నింగ్స్‌ను శాసించాడు. రాహుల్ త్రిపాఠి (1), నితీశ్ రానా (0) సహా టామ్ బాంటన్ (10)లను అవుట్ చేసిన సిరాజ్ కోల్‌కతను కోలుకోలేని దెబ్బతీశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఓ మ్యాచ్‌లో రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్ గా సిరాజ్ నిలిచాడు. బెంగళూర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయటంతో.. కోల్‌కత ఏ దశలోనూ దూకుడుగా ఆడలేకపోయింది. దినేశ్ కార్తీక్ (4), పాట్ కమిన్స్ (4)లను చాహల్ వెనక్కి పంపగా కోల్‌కత స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ ఇయాన్ మోర్గాన్ (30) ఓ ఎండ్‌లో నిలిచాడు. ఆఖర్లో కుల్దీప్ యాదవ్ (12), ఫెర్గుసన్ (19) కోల్‌కత స్కోరును 80 పైచిలుకు తీసుకెళ్లారు. ఆలౌట్ కాకుండా ఓ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు కావటం గమనార్హం.
ఐపీఎల్ నేటి మ్యాచ్
హైదరాబాద్ X రాజస్థాన్
వేదిక : దుబాయ్, సమయం : రాత్రి.7,30
స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..