Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ముంబయి ఇండియన్స్‌తో ఢీ
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
షార్జా (యుఏఈ)
ఐపీఎల్ 2020లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌లు రెండో సారి తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు జట్లు రెండో మ్యాచ్‌కు రెఢీ అవుతుండగా.. ప్లే ఆఫ్స్ రేసుపై అప్పుడే ఓ స్పష్టత వచ్చేసింది. సీజన్ తొలి మ్యాచ్‌లో నెగ్గిన చెన్నై సూపర్‌కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలువగా.. సీజన్ తొలి పోరులో ఓడిన ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌లో స్థానం సాధించనున్న తొలి జట్టుగా నిలువనుంది. ఏడు ఓటములతో చెన్నై దిగ్గజ కెప్టెన్ ఎం.ఎస్ ధోని విమర్శలు ఎదుర్కొంటుండగా.. ముంబయి ఇండియన్స్ లీగ్ దశ చివరి మ్యాచుల్లో కీలక ఆటగాళ్లను విశ్రాంతినిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తోంది. యువ క్రికెటర్లు ఎన్.జగదీశన్, రుతురాజ్ గైక్వాడ్‌లు నేడు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇక గాయంతో దూరమైన డ్వేన్ బ్రావో స్థానంలో పేసర్ జోశ్ హెజిల్‌వుడ్‌ను కాదని స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ సీజన్లో తొలిసారి బంతి అందుకోనున్నాడు. కెప్టెన్ ధోని స్వతహాగా బ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నాడు. కేదార్ జాదవ్ ఫామ్ సైతం చెన్నైకి మరింత ఇరకాటంలో పడేస్తుంది. ప్లే ఆఫ్స్‌కు తొలిసారి దూరమైన చెన్నై.. తరువాతి మ్యాచుల్లో వరుస మ్యాచ్‌లో మెరుపు విజయాలపై కన్నేసింది. గణితశాస్త్ర గణాంకాల ప్రకారం చెన్నై ఇంకా రేసులోనే ఉండటంతో ఆ జట్టును అంత సులువుగా తీసుకునే అవకాశం లేదు. ఇక ముంబయి ఇండియన్స్ వరుస ఐదు విజయాల జైత్రయాత్రకు పంజాబ్ డబుల్ సూపర్ ఓవర్లలో చెక్ పెట్టింది. ఉత్కంఠ మ్యాచుల్లో అనూహ్య ఓటమి చవిచూసిన ముంబయి నేడు మళ్లీ గెలుపు పట్టేందుకు చూస్తోంది. చిన్న బౌండరీల షార్జాలో పిచ్ బౌలర్లకు సహకరిస్తున్నా.. హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్య, డికాక్, రోహిత శర్మలు కీలకం కానున్నారు.
తుది జట్లు (అంచనా) :
చెన్నై సూపర్‌కింగ్స్ : డుప్లెసిస్, షేన్ వాట్సన్, ఎన్.జగదీశన్/రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, ఎం.ఎస్ ధోని, శామ్ కరన్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, షార్దుల్ ఠాకూర్, కరన్ శర్మ, ఇమ్రాన్ తాహీర్.
ముంబయి ఇండియన్స్ : క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్య, నాథన్ కౌల్టర్ నైల్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జశ్‌ప్రీత్ బుమ్రా.