Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బూమ్ బూమ్ బౌల్ట్
- 4/18తో చెలరేగిన పేసర్
- ఛేదనలో డికాక్, కిషన్ ధనాధన్
షార్జా (యుఏఈ)
ముంబయి పేసర్ల మెరుపులతో షార్జాలో సిక్సర్ల వర్షం స్థానంలో వికెట్ల వేట కనిపించింది. మానసికంగా కుంగిపోయిన చెన్నై సూపర్‌కింగ్స్‌పై ముంబయి పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (4/18), జశ్‌ప్రీత్ బుమ్రా (2/25), స్పిన్నర్ రాహుల్ చాహర్ (2/22) విరుచుకుపడ్డారు.తొలుత చెన్నై సూపర్‌కింగ్స్‌ను 114 పరుగులకే కట్టడి చేసిన ముంబయి.. స్వల్ప ఛేదనలో చెలరేగింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (46 నాటౌట్, 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (68 నాటౌట్, 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌లతో కదం తొక్కారు. ముంబయి 12.2 ఓవర్లలోనే 115 పరుగుల లక్ష్యాన్ని ఊదేసింది. దీంతో ముంబయి ఇండియన్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పవర్ ప్లేలో బుమ్రా, బౌల్ట్ వాడి వేడి ముందు చెన్నై టాప్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. టాప్ టాప్-4 బ్యాట్స్‌మెన్ సంయుక్తంగా మూడు పరుగులే చేశారు. డుప్లెసిస్ (1), రాయుడు (2), రుతురాజ్ (0), జగదీశన్ (0)లు బ్యాట్లేత్తేశారు. ఎం.ఎస్ ధోని (16) మెరుపులూ త్వరగా ముగియటంతో శామ్ కరన్ (52, 47 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెన్నైకి ఆదుకున్నాడు. కరన్ రాణించటంతో సూపర్‌కింగ్స్ తొలుత 114/9 పరుగులు చేసింది. చెన్నైకి ఇది ఎనిమిదో ఓటమి కాగా.. ముంబయికి ఇది ఏడో విజయం.
బౌల్ట్, బుమ్రా బూమ్!
చిన్న బౌండరీల షార్జా. స్వేచ్ఛ ఆడే అవకాశం చిక్కిన చెన్నై. ప్రియ ప్రత్యర్థి ముంబయిపై ఆ జట్టు ధనాధన్ ఖాయమే అనుకుంటే.. ముంబయి పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (4/18), జశ్‌ప్రీత్ బుమ్రా (2/25) క్రీజులో సూపర్‌కింగ్స్ కష్టాన్ని పెంచారు. బౌల్ట్ పవర్‌ప్లేలో వేసిన మూడు ఓవర్లలో మూడు వికెట్లు కూల్చగా.. బుమ్రా తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లేలోనే ఐదు వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్‌కింగ్స్ కనీసం 50 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ (0), జగదీశన్ (0)లు డకౌట్ కాగా.. డుప్లెసిస్ (1), అంబటి రాయుడు (2)లు ఖాతా మాత్రమే తెరిచారు. పవర్‌ప్లేలోనే బ్యాటింగ్‌కు వచ్చిన ఎం.ఎస్ ధోని (16, 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) బౌండరీలతో ఊపుమీద కనిపించాడు. కానీ స్పిన్నర్ రాహుల్ చాహర్ బంతికి మహి నిష్క్రమించక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో యువ ఆల్‌రౌండర్ శామ్ కరన్ (52, 47 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఆదుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌తో టెయిలెండర్లూ పెవిలియన్‌కు చేరుకుంటున్నా.. ఓ ఎండ్‌లో కరన్ పోరాడాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్థ సెంచరీ సాధించాడు. షార్దుల్ ఠాకూర్ (11), ఇమ్రాన్ తాహీర్ (13 నాటౌట్) కరన్‌కు సహకరించారు. కరన్ ఒంటరి పోరాటంతో చెన్నై సూపర్‌కింగ్స్ 114 పరుగులు చేయగల్గింది. తొడ కండరాల గాయంతో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కీరన్ పొలార్డ్ ముంబయి నాయకత్వ పగ్గాలు అందుకున్నాడు.
స్కోరు వివరాలు
చెన్నై ఇన్నింగ్స్ : 114/9 (శామ్ కరన్ 52, ఎం.ఎస్ ధోని 16, బౌల్ట్ 4/18, రాహుల్ చాహర్ 2/22)
ముంబయి ఇన్నింగ్స్ : 116/0 (ఇషాన్ కిషన్ 68 నాటౌట్, క్వింటన్ డికాక్ 46 నాటౌట్, తాహీర్ 0/22)