Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు వికెట్లతో మెరిసిన వరుణ్
- రానా, నరైన్ మెరుపు అర్థ సెంచరీలు
- ఢిల్లీపై కోల్‌కత అదిరే విజయం
అబుదాబి (యుఏఈ)
బెంగళూర్ పై మ్యాచ్‌లో 84/8 పరుగులే చేసిన కోల్‌కత.. ఢిల్లీతో మ్యాచ్‌లో 7.2 ఓవర్లలో 42/3తో నిలిచింది. రసెల్ లేని వేళ కోల్‌కత మళ్లీ స్వల్ప స్కోరుకే పరిమితం కాకతప్పదేమో అనిపించింది. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన నితీశ్ రానా (81, 53 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) సర్ప్రైజ్గా చితక్కొట్టాడు. పించ్ హిట్టర్ నరైన్ (64, 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరువగా ఆ జట్టు 194/6 భారీ స్కోరు చేసింది. ఇక బంతితోనూ నైట్‌రైడర్స్ ఆశ్చర్యపరిచింది. ఢిల్లీ నాలుగు ఓవర్లే వేసిన స్పిన్‌తోనే కోల్‌కత విక్టరీ కొట్టింది. లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/20) ఐదు వికెట్ల మ్యాజిక్‌తో మ్యాచ్‌ను కోల్‌కత వశం చేశాడు. వరుణ్ మాయాజాలంతో కోల్‌కత 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కోల్‌కత నైట్‌రైడర్స్ గొప్పగా పుంజుకుంది. టాప్-4లో కొనసాగుతున్నా ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న నైట్‌రైడర్స్ బెంగళూర్ చేతిలో దారుణ ఓటమి నుంచి వేగంగా కోలుకుంది. ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం ఓ విజయం దూరంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను 59 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/20) కండ్లుచెదిరే మాయాజాలంతో 195 పరుగుల ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 135/9 పరుగులే చేసింది. శ్రేయాష్ అయ్యర్ (47, 38 బంతుల్లో 5 ఫోర్లు), రిషబ్ పంత్ (27, 33 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యం క్యాపిటల్స్‌లో ఆశలు రేపినా.. వరుణ్ ఆవిరి చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్ 194 పరుగుల భారీ స్కోరు చేసింది. నితీశ్ రానా (81, 53 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్), సునీల్ నరైన్ (64, 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో కోల్‌కత ముందంజలో నిలువగా.. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకునేందుకు మరో మ్యాచ్ వరకు వేచి చూడక తప్పదు. అబుదాబిలో ఐదు వికెట్ల మాయాజాలం చేసిన వరుణ్ చక్రవర్తి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
ఔరా చక్రవర్తి..! : కోల్‌కత నైట్‌రైడర్స్ వ్యూహాత్మకంగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై పైచేయి సాధించింది. సీజన్లో నాణ్యమైన స్పిన్నర్లున్న ఢిల్లీ ఈ పిచ్‌పై నాలుగు ఓవర్లే స్పిన్ వేసింది. అశ్విన్ మూడు ఓవర్లలోనే 45 పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్ ఒకే ఒక్క ఓవర్ వేశాడు. కోల్‌కత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వరుణ్ చక్రవర్తితో అద్భుతం చేశాడు. భిన్నమైన లెంగ్త్‌తో బంతులేసిన చక్రవర్తి ఢిల్లీని వణికించాడు. శ్రేయాష్ అయ్యర్ (47), రిషబ్ పంత్ (27) క్రీజులో ఉండగా ఢిల్లీకి మ్యాచ్‌పై ఆశలు ఉన్నాయి. 54 బంతుల్లో 119 పరుగులు చేయాల్సిన దశలో మొదలైన వరుణ్ మ్యాజిక్.. ఐదు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. పవర్ ప్లేలో పాట్ కమిన్స్ ఓపెనర్లు అజింక్య రహానె (0), బ్యాక్ టు బ్యాక్ శతక హీరో శిఖర్ ధావన్ (6)లను అవుట్ చేశాడు. మిడిల్ ఆర్డర్ సంగతి వరుణ్ చూసుకున్నాడు. 135/9 పరుగులకే పరిమితమైన ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ దశ ఆఖర్లో దారుణ పరాజయం చవిచూసింది. ఈ విజయంతో కోల్‌కత నైట్‌రైడర్స్ నెట్ రన్‌రేట్‌గా మెరుగుపర్చుకుంది.
నితీశ్, నరైన్ మెరుపుల్ : 9, 2, 9, 5, 29, 0.. ఇవీ వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో నితీశ్ రానా చేసిన పరుగులు. ఈ సీజన్లో సునీల్ నరైన్ అత్యధిక స్కోరు 17. బెంగళూర్ చేతిలో చెత్తగా ఓడి.. క్యాపిటల్స్ బౌలింగ్ లైనప్‌పై మళ్లీ టాప్ ఆర్డర్‌ను కోల్పోయిన కోల్కత్ను ఈ ఇద్దరు ఆదుకుంటారని ఎవరూ ఊహించలేదు. కానీ ఐపీఎల్లో అద్భుతాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. క్యాపిటల్స్ బౌలర్లను స్వేచ్ఛగా బాదేసిన నితీశ్ రానా, సునీల్ నరైన్‌లు ధనాధన్ ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో రానా 35 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా.. సునీల్ నరైన్ మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 24 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. 56 బంతుల్లో 115 పరుగులు జోడించిన ఈ జోడీ కోల్‌కతకు భారీ స్కోరు అందించింది. ఇయాన్ మోర్గాన్ (17) కంటే ముందుగానే బ్యాటింగ్‌కు వచ్చి ఆశ్చర్యపరిచిన నరైన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఔరా అనిపించాడు. అశ్విన్‌పై విరుచుకుపడిన నరైన్ ధారాళంగా పరుగులు పిండుకున్నాడు. శుభ్‌మన్ గిల్ (9), రాహుల్ త్రిపాఠి (13), దినేశ్ కార్తీక్ (3)లు స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యారు. గాయం కారణంగా అండ్రీ రసెల్ ఈ మ్యాచ్‌కూ అందుబాటులో లేడు. క్యాపిటల్స్ బౌలర్లలో ఎన్రిచ్ నోర్జె, కగిసో రబాడ, మార్కస్ స్టోయినిస్‌లు తలా రెండు వికెట్లు తీసుకున్నారు.
స్కోరు వివరాలు :
కోల్‌కత ఇన్నింగ్స్ : శుభ్‌మన్ గిల్ (సి) అక్షర్ పటేల్ (బి) ఎన్రిచ్ నోర్జె 9, నితీశ్ రానా (సి) తుషార్ దేశ్‌పాండే (బి) స్టోయినిస్ 81, రాహుల్ త్రిపాఠి (బి) ఎన్రిచ్ నోర్జె 13, దినేశ్ కార్తీక్ (సి) రిషబ్ పంత్ (బి) కగిసో రబాడ 3, సునీల్ నరైన్ (సి) రహానె (బి) కగిసో రబాడ 64, ఇయాన్ మోర్గాన్ (సి) రబాడ (బి) స్టోయినిస్ 17, పాట్ కమిన్స్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 194.
వికెట్ల పతనం : 1-11, 2-35, 3-42, 4-157, 5-194, 6-194.
బౌలింగ్ : తుషార్ దేశ్‌పాండే 4-0-40-0, ఎన్రిచ్ నోర్జె 4-0-27-2, కగిసో రబాడ 4-0-33-2, అక్షర్ పటేల్ 1-0-7-0, మార్కస్ స్టోయినిస్ 4-0-41-2, అశ్విన్ 3-0-45-0.
ఢిల్లీ ఇన్నింగ్స్ : అజింక్య రహానె (ఎల్బీ) పాట్ కమిన్స్ 0, శిఖర్ ధావన్ (బి) పాట్ కమిన్స్ 6, శ్రేయాష్ అయ్యర్ (సి) కమలేశ్ (బి) చక్రవర్తి 47, రిషబ్ పంత్ (సి) శుభ్‌మన్ (బి) చక్రవర్తి 27, షిమ్రోన్ హెట్మయర్ (సి) త్రిపాఠి (బి) చక్రవర్తి 10, మార్కస్ స్టోయినిస్ (సి) త్రిపాఠి (బి) చక్రవర్తి 6, అక్షర్ పటేల్ (బి) చక్రవర్తి 9, కగిసో రబాడ (సి) త్రిపాఠి (బి) కమిన్స్ 9, అశ్విన్ నాటౌట్ 14, తుషార్ దేశ్‌పాండే (సి) మోర్గాన్ (బి) ఫెర్గుసన్ 1, ఎన్రిచ్ నోర్జె నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 06, మొత్తం :(20 ఓవర్లలో 9 వికెట్లకు) 135.
వికెట్ల పతనం : 1-0, 2-13, 3-76, 4-95, 5-95, 6-110, 7-112, 8-132, 9-135.
బౌలింగ్ : పాట్ కమిన్స్ 4-0-17-3, ప్రసిద్ కృష్ణ 2-0-19-0, కమలేశ్ నాగర్కోటి 2-0-11-0, లాకీ ఫెర్గుసన్ 4-0-30-1, సునీల్ నరైన్ 4-0-37-0, వరుణ్ చక్రవర్తి 4-0-20-5.
ఐపీఎల్ నేటి మ్యాచ్
బెంగళూర్ X చెన్నై
దుబాయ్ లో మధ్యాహ్నాం 3.30 నుంచి..
ముంబయి X రాజస్థాన్
అబుదాబిలో రాత్రి 7.30 నుంచి..
స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం..