Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాహా ధనాధన్
- వార్నర్, రషీద్ మ్యాజిక్
దుబాయ్ (యుఏఈ)
హైదరాబాద్ అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 220 పరుగుల భారీ ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 131 పరుగులకే కుప్పకూలింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (3/7)తో మాయజాలం ప్రదర్శించగా.. ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం ఢిల్లీ క్యాపిటల్స్ నిరీక్షణ కొనసాగనుంది. శిఖర్ ధావన్ (0) మళ్లీ డకౌట్ కాగా.. మార్కస్ స్టోయినిస్ (5), షిమ్రోన్ హెట్మయర్ (16), శ్రేయాష్ అయ్యర్ (7), అక్షర్ పటేల్ (1)లు విఫలమయ్యారు. అజింక్య రహానె (26), రిషబ్ పంత్ (36) కాసేపు నిలిచినా.. అవసరానికి తగినట్టు పరుగులు చేయటంలో విఫలమయ్యారు. నాలుగు ఓవర్లలో మూడు వికెట్లతో మ్యాచ్‌ను శాసించిన రషీద్ ఖాన్.. ఢిల్లీని కోలుకోనివ్వలేదు. ఆఖర్లో తుషార్ దేశ్‌పాండే (20 నాటౌట్) ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు మూడు బౌండరీలు సాధించాడు. అంతకముందు, వృద్దిమాన్ సాహా ఓపెనర్‌గా సూపర్ హిట్ కొట్టాడు. వృద్దిమాన్ సాహా (87, 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), డెవిడ్ వార్నర్ (66, 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. బలమైన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ దళంపై దండయాత్ర చేసిన వార్నర్, సాహా, మనీశ్ పాండే (44 నాటౌట్, 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)లు హైదరాబాద్‌కు భారీ స్కోరు అందించారు. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 219 పరుగులు చేసింది. వరుసగా 25 టీ20ల్లో వికెట్ల వేట సాగించిన కగిసో రబాడ.. ఆరెంజ్ ఆర్మీ దెబ్బకు ఈ మ్యాచ్‌లో 0/54తో నిరాశపరిచాడు. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో హైదరాబాద్ ఆశలు నిలుపుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ నిరీక్షణ కొనసాగనుంది.
సాహా సర్ప్రైజ్ : టాస్ నెగ్గి ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుని ఆశ్చర్యపరచగా.. సక్సెస్ఫుల్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టోను బెంచ్‌కు పరిమితం చేసి హైదరాబాద్ షాక్ ఇచ్చింది. కీలక మ్యాచ్‌లో వృద్దిమాన్ సాహాను ఓపెనింగ్ జోడీగా ఎంచుకున్న డెవిడ్ వార్నర్ ఢిల్లీపై మెరుపు దాడి చేశాడు. ఆరంభంలో ఎన్రిచ్ నోర్జె, కగిసో రబాడలను ప్రయోగించినా.. వార్నర్, సాహాలు వారిని ఉతికారేశారు. పవర్ ప్లేలో 77 పరుగులు చేసిన హైదరాబాద్.. అదే జోరు కొనసాగించింది. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో వార్నర్ అర్థ సెంచరీ సాధించాడు. బెయిర్‌స్టో తోడుగా నెమ్మదిగా ఆడిన వార్నర్ ఢిల్లీపై ఆది నుంచీ ఎదురుదాడే చేశాడు. 8 ఫోర్లతో 27 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన సాహా.. తర్వాత నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో కదం తొక్కాడు. వార్నర్, సాహా నిష్క్రమించినా హైదరాబాద్ జోరు తగ్గలేదు. ఓవర్‌కు 11-12 రన్‌రేట్‌తో పరుగుల వరద పారించింది. ఆఖర్లో మనీశ్ పాండే (44 నాటౌట్), కేన్ విలియమ్సన్ (10 నాటౌట్)లు భారీ స్కోరు అందించారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జె, అశ్విన్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. రబాడ, అక్షర్ పటేల్, తుషార్ దేశ్‌పాండే, మార్కస్ స్టోయినిస్‌లకు వికెట్ దక్కలేదు.
స్కోరు వివరాలు :
హైదరాబాద్ ఇన్నింగ్స్ : 219/2 ( వృద్దిమాన్ సాహా 87, డెవిడ్ వార్నర్ 66, మనీశ్ పాండే 44, అశ్విన్ 1/35)
ఢిల్లీ ఇన్నింగ్స్ : 131/10 ( రిషబ్ పంత్ 36, రహానె 26, రషీద్ ఖాన్ 3/7, నటరాజన్ 2/26)