Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుమ్రా 3 వికెట్ల మ్యాజిక్
- రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 164/6
అబుదాబి (యుఏఈ)
డెత్ ఓవర్లలో (16-20)లో రెండో అత్యుత్తమ రన్‌రేట్‌తో పరుగులు సాధించిన రికార్డు.. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ వరుసగా రెండో మ్యాచ్‌లో కొనసాగించలేదు. చెన్నైతో మ్యాచ్‌లో చివరి ఐదు ఓవర్లలో 44/4 పరుగులు చేసిన కోహ్లిసేన.. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మరీ దారుణంగా ఆడింది. చివరి 30 బంతుల్లో బెంగళూర్ నాలుగు వికెట్లు కోల్పోయి 35 పరుగులే చేసింది. దీంతో ఓ దశలో 200 పైచిలుకు స్కోరు దిశగా సాగిన బెంగళూర్.. చివరకు 164 పరుగులతోనే సరిపెట్టుకుంది. యువ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ (74, 45 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో చెలరేగాడు. విరాట్ కోహ్లి (9), ఏబీ డివిలియర్స్ (15) నిరాశపరిచారు. జశ్‌ప్రీత్ బుమ్రా (3/14)తో బెంగళూర్ భారీ స్కోరు ఆశలపై నీళ్లు చల్లాడు.
ఆరంభ శూరత్వం! : టాస్ నెగ్గిన ముంబయి తొలుత బెంగళూర్‌కు బ్యాటింగ్ అవకాశం ఇచ్చింది. అరోన్ ఫించ్ స్థానంలో జోశ్ పిలిప్ (33, 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) తోడుగా దేవ్‌దత్ పడిక్కల్ (74) అద్భుతంగా ఆడాడు. పవర్ ప్లేలో బౌల్ట్, బుమ్రా, పాటిన్సన్లను ఎదుర్కొని ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 7.5 ఓవర్లలో 71 పరుగులు జోడించారు. పడిక్కల్ 30 బంతుల్లో పది ఫోర్లతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్ల మెరుపులతో బెంగళూర్ భారీ స్కోరు దిశగా సాగింది. డికాక్ కండ్లుచెదిరే స్టంప్తో ఫిలిప్ ఇన్నింగ్స్ ముగిసింది. జశ్‌ప్రీత్ బుమ్రా విరాట్ కోహ్లి (9)ని, ఏబీ డివిలియర్స్ (15)ను కీరన్ పొలార్డ్ అవుట్ చేయటంతో బెంగళూర్ ఇన్నింగ్స్ డీలా పడింది. బుమ్రా డెత్ ఓవర్లలో 12 బంతులేసి ఐదు పరుగులకే రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో డెత్ ఓవర్లలో బెంగళూర్ వేగంగా పరుగులు చేయలేకపోయింది. గురుకీరత్ సింగ్ (14), వాషింగ్టన్ సుందర్ (10) మెరుపులతో ఆర్సీబీ 164 పరుగులైనా చేయగల్గింది. ముంబయి బౌలర్లలో బౌల్ట్, రాహుల్ చాహర్, కీరన్ పొలార్డ్‌లు తలా ఓ వికెట్ తీసుకున్నారు.
స్కోరు వివరాలు :
బెంగళూర్ ఇన్నింగ్స్ : జోశ్ పిలిప్ (స్టంప్డ్) డికాక్ (బి) రాహుల్ చాహర్ 33, దేవ్‌దత్ పడిక్కల్ (సి) బౌల్ట్ (బి) బుమ్రా 74, విరాట్ కోహ్లి (సి) సౌరభ్ తివారి (బి) బుమ్రా 9, ఏబీ డివిలియర్స్ (సి) రాహుల్ చాహర్ (బి) పొలార్డ్ 15, శివం దూబె (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) బుమ్రా 2, క్రిస్ మోరీస్ (సి) జేమ్స్ పాటిన్సన్ (బి) బౌల్ట్ 4, గరుకీరత్ సింగ్ నాటౌట్ 14, వాషింగ్టన్ సుందర్ నాటౌట్ 10, ఎక్స్‌ట్రాలు : 03, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164.
వికెట్ల పతనం : 1-71, 2-95, 3-131, 4-134, 5-134, 6-138.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 4-0-40-1, జశ్‌ప్రీత్ బుమ్రా 4-1-14-3, కృనాల్ పాండ్య 4-0-27-0, జేమ్స్ పాటిన్సన్ 3-0-35-0, రాహుల్ చాహర్ 4-0-43-1, కీరన్ పొలార్డ్ 1-0-5-1.