Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిరీస్‌లో 1-0 ఆధిక్యం
- చెలరేగిన జడేజా, చాహల్
- రాణించిన నటరాజన్, రాహుల్
- తొలి టీ20లో భారత్ విజయం
సొంతగడ్డపై ఆస్ట్రేలియా బలంగా ఉంది. కానీ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అందుబాటులో లేడు. బంతితో ప్రధాన సీమర్ జశ్‌ప్రీత్ బుమ్రా తుది జట్టులో లేడు. పరుగుల వరద పారే మానుకా ఓవల్‌లో అత్తెసరు స్కోరుకే పరిమితం. దీంతో తొలి టీ20లో కోహ్లిసేన విజయంపై అనుమానాలు!. అయినా, పేసర్ తంగరసు నటరాజన్ (3/30), స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ (3/25) విజృంభణతో తొలి టీ20లో భారత్ మెరుపు విజయం సాధించింది. ఊరించే ఛేదనలో ఆతిథ్య ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాలో పరాజయం పాలైంది. పొట్టి సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వన్డే సిరీస్‌ను కోల్పోయిన కోహ్లిసేన.. చిన్నదాన్నైనా దక్కించుకునేందుకు తొలి అడుగు వేశారు.
కాన్బెర్రా (ఆస్ట్రేలియా)
పరుగుల వరదకు చిరునామా మానుకా ఓవల్‌లో ఆస్ట్రేలియా ముందున్న లక్ష్యం 162 పరుగులు. ఓపెనర్లు అరోన్ ఫించ్ (35, 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), షార్ట్ (34, 38 బంతుల్లో 3 ఫోర్లు)లు శుభారంభం అందించారు. ఆసీస్ ఛేదనకు రంగం సిద్ధమైందనుకున్న తరుణంలో.. కంకషన్ సబ్‌స్టిట్యూట్ యుజ్వెంద్ర చాహల్ (3/25) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అరంగేట్ర పేసర్ తంగరసు నటరాజన్ (3/30) వికెట్ల వేటలో చాహల్‌కు తోడవటంతో ఛేదనలో ఆస్ట్రేలియా చితికిపోయింది. స్టీవ్ స్మిత్ (12), గ్లెన్ మాక్స్వెల్ (2), మాథ్యూ వేడ్ (7) వికెట్లతో భారత్ పైచేయి సాధించింది. ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 150 పరుగులే చేసి, 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్ కెఎల్ రాహుల్ (51, 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (44 నాటౌట్, 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) 161 పరుగుల స్కోరు అందించారు. శిఖర్ ధావన్ (1), విరాట్ కోహ్లి (9), మనీశ్ పాండే (2) విఫలమయ్యారు. మూడు వికెట్లతో మాయాజాలం చేసిన యుజ్వెంద్ర చాహల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. సిరీస్‌లో రెండో టీ20 ఆదివారం సిడ్నీలో జరుగనుంది.
చాహల్, 'నట్టు' బిగించారు : గతంలో ఇక్కడ పాకిస్థాన్‌పై స్వల్ప స్కోరును సులువుగా ఛేదించేసిన ఆస్ట్రేలియా.. శుక్రవారం భారత్‌పైనా అదే ఫలితం పునరావృతం చేసేందుకు దీమాగా కనిపించింది. మహ్మద్ షమి, దీపక్ చాహర్‌లకు బౌండరీలతో స్వాగతం పలికిన ఓపెనర్లు ఫించ్ (35), షార్ట్ (34) పవర్ ప్లేలో దూకుడుగా ఆడారు. తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఓపెనింగ్ జోడీని చాహల్ విడదీశాడు. హార్దిక్ పాండ్య కండ్లుచెదిరే రనప్ క్యాచ్‌తో ఫించ్‌ను అవుట్ చేశాడు. ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ (12)ను సంజు శాంసన్ మెరుపు క్యాచ్‌తో సాగనంపాడు. చాహల్ తన వరుస ఓవర్లలో ఫించ్, స్మిత్‌లను అవుట్ చేసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు. విధ్వంసకారుడు గ్లెన్ మాక్స్వెల్ (2)ను నటరాజన్ వికెట్ల ముందు అవుట్ చేసి ఆసీస్‌ను రేసులో వెనక్కి నెట్టాడు. మోయిసిస్ హెన్రిక్స్ (30, 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఒత్తిడికి గురిచేసినా.. చాహల్ ఆఖర్లో మాథ్యూ వేడ్ (7)ను సైతం అవుట్ చేసి ఆసీస్ ఆశలు ఆవిరి చేశాడు. 17 ఓవర్లకే మ్యాచ్‌ను మానసికంగా సొంతం చేసుకున్న కోహ్లిసేన.. గెలుపు అంతరం కోసమే చివరి మూడు ఓవర్లను వేసింది. టెయిలెండర్లు సీన్ అబాట్ (12 నాటౌట్), మిచెల్ స్విప్సన్ (12 నాటౌట్) ఆస్ట్రేలియా స్కోరును 150కు చేర్చగలిగారు. వన్డే సిరీస్‌లో భారీ స్కోర్లు బాదిన ఆస్ట్రేలియాను 162 పరుగుల ఛేదనలో నిలువరించటంలో భారత బౌలర్లు గొప్పగా రాణించారు. సీనియర్ సీమర్ మహ్మద్ షమి (0/46) నిరాశపరిచినా.. దీపక్ చాహర్ (1/29), వాషింగ్టన్ సుందర్ (0/16) ఆకట్టుకున్నారు.
రాణించిన రాహుల్, జడేజా : మరోసారి కీలక టాస్ ఓడిన భారత్.. తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (1)ను మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేయగా.. విరాట్ కోహ్లి (9) కొత్త సీమర్ స్విప్సన్కు చిక్కాడు. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ (51, 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) నిలకడగా ఆడాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో అర్థ సెంచరీ సాధించిన రాహుల్.. భారత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. సంజు శాంసన్ (23, 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ధనాధన్ జోరు చూపించినా.. ఎంతోసేపు వికెట్ కాపాడుకోలేదు. మిడిల్ ఓవర్లలో మోయిసిన్ హెన్రిక్స్ (3/22), ఆడం జంపా (1/20)లు భారత్‌ను కట్టడి చేశారు. మనీశ్ పాండే ఎనిమిది బంతుల్లో 2 పరుగులే చేసి డగౌట్‌కు చేరుకున్నాడు. సంజు శాంసన్, మనీశ్ పాండే, రాహుల్ సహా భీకర ఫామ్‌లో హార్దిక్ పాండ్య (16, 15 బంతుల్లో ఓ సిక్సర్) వెన్వెంటనే వికెట్లు కోల్పోయారు. దీంతో ఆఖరు ఓవర్లలో ధారాళంగా పరుగులు సాధించే అవకాశాలు సన్నగిల్లాయి. రవీంద్ర జడేజా (44 నాటౌట్) ఒక్కడే పోరాడి భారత్‌కు పోరాడగలిగే స్కోరు అందించారు. ఆఖరు రెండు ఓవర్లలో హజిల్‌వుడ్, స్టార్క్లపై బౌండరీలు బాదిన జడేజా భారత్ ఆశలు సజీవంగా నిలిపాడు. 17 ఓవర్లలో 115/6తో ఉన్న భారత్‌ను జడేజా 161/7కు చేర్చాడు.
'చాలా ఆనందంగా ఉంది. మా ఇన్నింగ్స్‌లో నాపై ఎటువంటి ఒత్తిడి లేదు. కానీ ఆ తర్వాతే తెలిసింది నేడు ఆడబోతున్నానని. ఆసీస్ ఇన్నింగ్స్‌కు 10-15 నిమిషాల ముందు నాకు తెలిసింది. వన్డే సిరీస్‌లో చేసిన పొరపాట్ల నుంచి నేర్చుకున్నాను. తొలి ఇన్నింగ్స్‌లో స్పిన్‌పై పరుగులు చేయటం కాస్త కష్టమైంది. నా ప్రణాళికలకు అనుగుణంగా నేను బంతులేశాను'
- యుజ్వెంద్ర చాహల్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) అబాట్ (బి) హెన్రిక్స్ 51, శిఖర్ ధావన్ (బి) మిచెల్ స్టార్క్ 1, విరాట్ కోహ్లి (సి,బి) స్వీప్సన్ 9, సంజు శాంసన్ (సి) స్విప్సన్ (బి) హెన్రిక్స్ 23, మనీశ్ పాండే (సి) హజిల్‌వుడ్ (బి) జంపా 2, హార్దిక్ పాండ్య (సి) స్మిత్ (బి) హెన్రిక్స్ 16, రవీంద్ర జడేజా నాటౌట్ 44, వాషింగ్టన్ సుందర్ (సి) అబాట్ (బి) స్టార్క్ 7, దీపక్ చాహర్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 08, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 161.
వికెట్ల పతనం : 1-11, 2-48, 3-86, 4-90, 5-92, 6-114, 7-152.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 4-0-34-2, జోశ్ హజిల్‌వుడ్ 4-0-39-0, ఆడం జంపా 4-0-20-1, సీన్ అబాట్ 2-0-23-0, స్విప్సన్ 2-0-21-1, హెన్రిక్స్ 4-0-22-3.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : షార్ట్ (సి) హార్దిక్ పాండ్య (బి) నటరాజన్ 34, అరోన్ ఫించ్ (సి) హార్దిక్ పాండ్య (బి) చాహల్ 35, స్టీవ్ స్మిత్ (సి) శాంసన్ (బి) చాహల్ 12, గ్లెన్ మాక్స్వెల్ (ఎల్బీ) నటరాజన్ 2, మోయిసిన్ హెన్రిక్స్ (ఎల్బీ) దీపక్ చాహర్ 30, మాథ్యూ వేడ్ (సి) కోహ్లి (బి) చాహర్ 7, సీన్ అబాట్ నాటౌట్ 12, మిచెల్ స్టార్క్ (బి) నటరాజన్ 1, మిచెల్ స్విప్సన్ నాటౌట్ 12, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 150.
వికెట్ల పతనం : 1-56, 2-72, 3-75, 4-113, 5-122, 6-126, 7-127.
బౌలింగ్ : దీపక్ చాహర్ 4-0-29-1, వాషింగ్టన్ సుందర్ 4-0-16-0, మహ్మద్ షమి 4-0-46-0, తంగరసు నటరాజన్ 4-0-30-3, యుజ్వెంద్ర చాహల్ 4-0-25-3.