Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శతకంతో చెలరేగిన మార్నస్ లబుషేన్
- అరంగేట్ర నటరాజన్‌కు రెండు వికెట్లు
- రాణించిన సైని, వాషింగ్టన్ సుందర్
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 274/5
- భారత్, ఆస్ట్రేలియా నాల్గో టెస్టు తొలి రోజు
రెండు టెస్టులు ఆడిన మహ్మద్ సిరాజే భారత పేస్ దళానికి నాయకుడు. అరంగేట్ర మాయగాడు వాషింగ్టన్ సుందరే స్పిన్ దాడికి దళపతి. విదేశీ టెస్టులో నటరాజన్, షార్దుల్ ఠాకూర్ రూపంలో ఇద్దరు అరంగేట్ర పేసర్లు. బ్రిస్బేన్ టెస్టు హీరోలు విహారి, అశ్విన్, జడేజాలు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో సొంతగడ్డపై నిర్ణయాత్మక టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా స్పష్టమైన ఫేవరేట్. భారత అరంగేట్ర హీరోలు గబ్బాలో గర్జించారు. తంగరసు నటరాజన్, వాషింగ్టన్ సుందర్, షార్దుల్ ఠాకూర్లు వికెట్ల వేటలో ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ (105) శతకంతో చెలరేగినా.. ఆతిథ్య జట్టు జోరుకు భారత్ పాక్షికంగా కళ్లెం వేసింది. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా 274/5తో మెరుగైన స్థితిలో నిలిచినా.. భారత్ సైతం ఆకర్షణీయ ప్రదర్శనే చేసింది.
బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా)
మార్నస్ లబుషేన్ (108, 204 బంతుల్లో 9 ఫోర్లు) ఎట్టకేలకు భారత్‌పై శతకం సాధించాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో తొలి టెస్టు నుంచీ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్న లబుషేన్ మూడెంకల స్కోరు చేసేందుకు భారత బౌలర్లు ససేమిరా అనేశారు. కానీ గబ్బాలో లబుషేన్ గర్జించాడు. 108 పరుగుల ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మాథ్యూ వేడ్ (45, 87 బంతుల్లో 6 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (36, 77 బంతుల్లో 5 ఫోర్లు) సైతం రాణించారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు 274/5 స్కోరు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కామెరూన్ గ్రీన్ (28 బ్యాటింగ్, 70 బంతుల్లో 3 ఫోర్లు), టిమ్ పైనె (38 బ్యాటింగ్, 62 బంతుల్లో 5 ఫోర్లు) అజేయంగా ఆడుతున్నారు. అరంగేట్ర బౌలర్లు తంగరసు నటరాజన్ (2/63), వాషింగ్టన్ సుందర్ (1/63), షార్దుల్ ఠాకూర్ (1/67)లు వికెట్లు తీసుకున్నారు. దీంతో, తొలి రోజు ఆస్ట్రేలియా జోరుకు కాస్తయినా బ్రేక్ పడింది. నేడు ఉదయం సెషన్లో భారత బౌలర్లు ఆసీస్ తోకను కత్తిరిస్తే... మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేందుకు అవకాశం ఉంది.
తొలి సెషన్ : వార్నర్‌కు సిరాజ్ స్ట్రోక్
కీలకమైన టాస్ గెల్చుకున్న ఆస్ట్రేలియా మరో ఆలోచనకు తావులేకుండా, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదేండ్లలో సొంతగడ్డపై తొలిసారి సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితమైన డెవిడ్ వార్నర్‌ను హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి ఆరంభంలోనే వెనక్కి పంపించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఆరో బంతికే డెవిడ్ వార్నర్ (1)ను సిరాజ్ అవుట్ చేశాడు. డెవిడ్ వార్నర్‌ను అద్భుతమైన బంతితో సిరాజ్ బుట్టలో వేసుకున్నాడు. సిరాజ్ బంతిని సంశయంతో ఆడేసిన వార్నర్ తొలి స్లిప్స్‌లో క్యాచ్ ఇవ్వగా.. రెండో స్లిప్స్‌లో ఉన్న రోహిత్ శర్మ డైవ్ చేస్తూ క్యాచ్‌ను ఒడిసిపట్టుకున్నాడు. మరో ఓపెనర్ మార్కస్ హారిశ్ (5) సైతం ఎంతోసేపు నిలువలేదు. అరంగేట్ర సీమర్ షార్దుల్ ఠాకూర్ టెస్టు క్రికెట్లో సంధించిన 11వ బంతికే వికెట్‌ను సాధించాడు. సిరాజ్, షార్దుల్ దెబ్బకు 17 పరుగులకే ఆస్ట్రేలియా ఓపెనర్లను కోల్పోయింది. ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయిన ఆస్ట్రేలియాను ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్ నిలబెట్టారు. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్‌లు ఉదయం సెషన్లో మరో వికెట్ పడకుండా నిలువరించారు. తొలి సెషన్‌ను ఆస్ట్రేలియా 65/2తో ముగించింది.
రెండో సెషన్ : మార్నస్ లబుషేన్ మెరుపుల్
మార్నస్ లబుషేన్‌తో కలిసి స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియాను పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. స్మిత్, లబుషేన్ మరింత ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో అరంగేట్ర స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. లెగ్ సైడ్ వ్యూహంతో స్టీవ్ స్మిత్‌కు బంతులు సంధించిన వాషింగ్టన్ సుందర్.. ఎట్టకేలకు స్మిత్ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్యాడ్ల మీదుకు దూసుకొచ్చిన బంతిని స్మిత్ ఫ్లిక్ చేశాడు. షార్ట్ మిడ్ వికెట్లో ఉన్న రోహిత్ శర్మ క్యాచ్‌ను పూర్తి చేయటంతో స్టీవ్ స్మిత్ (36, 77 బంతుల్లో 5 ఫోర్లు) పోరాటానికి తెరపడింది. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ స్మిత్ వికెట్‌తో వాషింగ్టన్ సుందర్ టెస్టు కెరీర్‌ను మొదలెట్టాడు. స్మిత్ నిష్క్రమణ అనంతరం లబుషేన్‌తో మాథ్యూ వేడ్ (45, 87 బంతుల్లో 6 ఫోర్లు) జతకలిశాడు. లంచ్ విరామం అనంతరం ఆస్ట్రేలియా ఒకే ఒక్క వికెట్ కోల్పోయింది. తొలి సెషన్లో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచిన భారత బౌలర్లు.. రెండో సెషన్లో ఒత్తిడిని కొనసాగించలేకపోయారు. దీంతో రెండో సెషన్ నుంచే పరుగుల ప్రవాహం మొదలైంది. మార్నస్ లబుషేన్ 145 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో సిరీస్‌లో మరో అర్థ సెంచరీ సాధించాడు. లంచ్ లోపే ఆస్ట్రేలియా 150 పరుగుల మార్క్ దాటేసింది. రెండో సెషన్‌ను ఆస్ట్రేలియా 154/3తో పటిష్ట స్థితిలో ముగించింది. స్టీవ్ స్మిత్‌ను అవుట్ చేసిన ఆనందం మాత్రమే భారత్‌కు మిగిలింది.
మూడో సెషన్ : ఆసీస్ పరుగుల వరద
మూడో సెషన్లో ఆస్ట్రేలియా వేగంగా పరుగులు పిండుకుంది. ఈ ఒక్క సెషన్లోనే కంగారూలు ఏకంగా 120 పరుగులు సాధించారు. నం.3 బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ సిరీస్‌లో ఎట్టకేలకు శతకం సాధించాడు. ఆడిలైడ్ నుంచి ఆకట్టుకునే ప్రదర్శన చేసినా.. మూడంకెల స్కోరును మాత్రం గబ్బాలోనే చేరుకున్నాడు. 9 బౌండరీలు బాదిన లబుషేన్ 195 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో మాథ్యూ వేడ్ అండ సైతం తోడైంది. అరంగేట్ర పేసర్, యార్కర్ల యువరాజు తంగరసు నటరాజన్ మూడో సెషన్లో మెరిశాడు. రెండు వికెట్లు పడగొట్టి భారత్‌ను మ్యాచ్ రేసులోకి తీసుకొచ్చాడు. నటరాజన్ షార్ట్ బంతికి శతక హీరో లబుషేన్ (108, 204 బంతుల్లో 9 ఫోర్లు) వికెట్ల వెనకాల పంత్‌కు చిక్కాడు. అంతకముందే, మాథ్యూ వేడ్‌ను సైతం షార్ట్ బాల్తోనే నటరాజన్ వెనక్కి పంపించాడు. పరుగుల వరద పారిస్తున్న ఈ జోడిని నటరాజన్ అవుట్ చేయటంతో భారత్ ఉత్సాహపడింది. కానీ కామెరూన్ గ్రీన్ (28 నాటౌట్, 70 బంతుల్లో 3 ఫోర్లు), టిమ్ పైనె (38 నాటౌట్, 62 బంతుల్లో 5 ఫోర్లు) ఆరో వికెట్‌కు అజేయంగా 61 పరుగులు జోడించారు. తొలి రోజు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఈ జోడీ 20 పైచిలుకు ఓవర్ల పాటు భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలుస్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 274/5తో కొనసాగుతోంది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : డెవిడ్ వార్నర్ (సి) రోహిత్ శర్మ (బి) మహ్మద్ సిరాజ్ 1, మార్కస్ స్టోయినిస్ (సి) వాషింగ్టన్ సుందర్ (బి) షార్దుల్ ఠాకూర్ 5, మార్నస్ లబుషేన్ (సి) రిషబ్ పంత్ (బి) నటరాజన్ 108, స్టీవ్ స్మిత్ (సి) రోహిత్ శర్మ (బి) వాషింగ్టన్ సుందర్ 36, మాథ్యూ వేడ్ (సి) షార్దుల్ ఠాకూర్ (బి) నటరాజన్ 45, కామెరూన్ గ్రీన్ బ్యాటింగ్ 28, టిమ్ పైనె బ్యాటింగ్ 38, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (87 ఓవర్లలో 5 వికెట్లకు) 274.
వికెట్ల పతనం : 1-4, 2-17, 3-87, 4-200, 5-213.
బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ 19-8-51-1, తంగరసు నటరాజన్ 20-2-63-2, షార్దుల్ ఠాకూర్ 18-5-67-1, నవదీప్ సైని 7.5-2-21-0, వాషింగ్టన్ సుందర్ 22-4-63-1, రోహిత్ శర్మ 0.1-0-1-0.
సెషన్ల వారీగా..
తొలి సెషన్
పరుగులు : 65
వికెట్లు : 02
ఓవర్లు : 27
రెండో సెషన్
పరుగులు : 89
వికెట్లు : 01
ఓవర్లు : 27
మూడో సెషన్
పరుగులు : 120
వికెట్లు : 02
ఓవర్లు : 33