- గబ్బా ఆఖరు రోజు ఆటకు వర్షం ముప్పు - భారత్ లక్ష్యం 328, ప్రస్తుతం 4/0 - రసకందాయంలో గబ్బా నిర్ణయాత్మక సమరం అద్భుత పోరాటం, అసమాన ప్రదర్శనలతో ప్రతి స్థాయిలోనూ ఆసక్తికర మలుపులు తిరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఆతిథ్య ఆస్ట్రేలియా ఆఖరు రోజు భారత్‌కు 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గబ్బా విజయంతో పాటు టెస్టు సిరీస్ సొంతం చేసుకునేందుకు భారత్ ఉవ్విళ్లూరుతోంది. అమోఘమైన సిరీస్ ఆఖరు రోజు ఫలితం తేలనున్న గడియల్లో వరుణుడు రంగ ప్రవేశం చేసేందుకు తొంగి చూస్తున్నాడు. వర్షం ముప్పు పొంచి ఉన్న గబ్బా టెస్టు ఆఖరు రోజు భారత్ మరో 324 పరుగులు చేయటం కష్టసాధ్యమే. ఇదే సమయంలో వర్షం ప్రభావిత పిచ్‌పై ఆస్ట్రేలియా పేసర్లు వికెట్ల వేటలో రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేయటం కంగారూకు కలిసొచ్చే అంశం. బోర్డర్-గవాస్కర్ సిరీస్ సొంతం చేసుకునేందుకు భారత్‌కు నేడు డ్రా సరిపోతుంది, కానీ ఆస్ట్రేలియాకు కచ్చితంగా విజయమే శరణ్యం. ఈ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ నిర్ణయాత్మక ఆఖరు రోజు ఆసక్తి రేపుతోంది.
బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా) బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో అద్వితీయ ప్రదర్శనలతో సిరీస్ రేసులో నిలిచిన టీమ్ ఇండియా.. కంగారూ నేలపై వరుసగా రెండో టెస్టు సిరీస్ సొంతం చేసుకునేందుకు మరో ఒక్క రోజు మెరిస్తే చాలు. భారత్‌కు ఆస్ట్రేలియా 328 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయిన మూడో సెషన్లో భారత్ ఛేదనలో 4/0తో వేట మొదలుపెట్టింది. స్టీవ్ స్మిత్ (55, 74 బంతుల్లో 7 ఫోర్లు), డెవిడ్ వార్నర్ (48, 75 బంతుల్లో 6 ఫోర్లు), మార్కస్ హారిశ్ (38, 82 బంతుల్లో 8 ఫోర్లు) రాణించటంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 33 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న సంగతి తెలిసిందే. భారత యువ పేసర్ మహ్మద్ సిరాజ్ (5/73) కెరీర్ తొలి ఐదు వికెట్ల ప్రదర్శనతో కదంతొక్కాడు. శార్దుల్ ఠాకూర్ (4/61) సైతం నాలుగు వికెట్లతో ఆసీస్‌ను కట్టడి చేశాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 11 బంతులు ఎదుర్కొంది. రోహిత్ శర్మ (4 బ్యాటింగ్), శుభ్‌మన్ గిల్ (0 బ్యాటింగ్) అజేయంగా ఆడుతున్నారు. భారత్ విజయానికి మరో 324 పరుగులు అవసరం కాగా, ఆస్ట్రేలియాకు పది వికెట్లు కావాలి. వర్షం ప్రభావం చూపనున్న ఆఖరు రోజు ఆటలో ఏం జరుగుతుందో చూడాలి. తొలి సెషన్ : ఆసీస్ ఓపెనర్ల దూకుడు వంద శాతం ఫిట్‌నెస్ సాధించకుండానే, సిడ్నీ టెస్టుకు వచ్చిన డెవిడ్ వార్నర్ (48, 75 బంతుల్లో 6 ఫోర్లు) వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో నిరాశపరిచాడు. మూడో రోజు దూకుడును వార్నర్ నాల్గో రోజు ఉదయం సెషన్‌లోనూ కొనసాగించాడు. ఆరు ఫోర్లతో 48 పరుగులు పిండుకున్నాడు. మరో ఓపెనర్ మార్కస్ హారిశ్ (38, 82 బంతుల్లో 8 ఫోర్లు) సైతం నిలకడగా బౌండరీలు బాదాడు. వార్నర్, మార్కస్ మెరుపులతో ఆస్ట్రేలియా తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించింది. శార్దుల్ ఠాకూర్ తొలి బ్రేక్ అందించగా.. అర్థ సెంచరీకి రెండు పరుగుల చేరువలో డెవిడ్ వార్నర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. వాషింగ్టన్ సుందర్‌కు వార్నర్ వికెట్ కోల్పోయాడు. భారీ స్కోరుపై కన్నేసిన కంగారూలు.. తొలి సెషన్ నుంచే ధాటిగా ఆడారు. ఓపెనర్లకు తోడు మార్నస్ లబుషేన్ (25, 22 బంతుల్లో 5 ఫోర్లు), మాథ్యూ వేడ్ (0)లు సైతం తొలి సెషన్లోనే పెవిలియన్‌కు చేరుకున్నారు. లబుషేన్ ఐదు ఫోర్లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. లబుషేన్, మాథ్యూ వేడ్‌లను మహ్మద్ సిరాజ్ వెనక్కి పంపించాడు. తొలి సెషన్‌ను ఆస్ట్రేలియా 149/4తో ముగించింది. రెండో సెషన్ : జోరు తగ్గని స్టీవ్ స్మిత్ తొలి సెషన్లోనే ధారాళంగా పరుగులు పిండుకున్న కంగారూలూ.. లంచ్ విరామం అనంతరం సైతం వెనక్కి తగ్గలేదు. స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ (55, 74 బంతుల్లో 7 ఫోర్లు) తనదైన జోరు చూపించాడు. ఆరు ఫోర్లతో 67 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన స్మిత్.. ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని వడివడిగా పెంచాడు. మిడిల్ ఆర్డర్‌లో స్మిత్‌కు తోడుగా కామెరూన్ గ్రీన్ (37, 90 బంతుల్లో 3 ఫోర్లు), టిమ్ పైనె (27, 37 బంతుల్లో 3 ఫోర్లు)లు సైతం పరుగుల వేటలో దూసుకెళ్లారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసినా.. ఆస్ట్రేలియా పరుగులే లక్ష్యంగా ఆడటంతో వేగంగానే స్కోరు బోర్డుకు ముందుకు కదిలింది. అర్థ సెంచరీ ఊపులో ఉన్న స్మిత్‌ను మహ్మద్ సిరాజ్ అవుట్ చేయగా.. కామెరూన్ గ్రీన్, టిమ్ పైనెలను శార్దుల్ ఠాకూర్ సాగనంపాడు. బ్యాటింగ్ లైనప్ పూర్తిగా పెవిలియన్‌కు చేరటంతో భారత్ ఛేదనలో తన లక్ష్యాన్ని తగ్గించుకునేందుకు టెయిలెండర్లపై ఒత్తిడి పెంచింది. టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా 243/7తో నిలిచింది. మూడో సెషన్ : మళ్లీ వచ్చిన వరుణుడు టీ విరామానికి పది నిమిషాల సమయం ఉండగానే వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు ముందుగానే టీ విరామం ప్రకటించారు. టీ విరామం ముగిసినా వరుణుడు శాంతించలేదు. అవుట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేసిన అనంతరం ఆస్ట్రేలియా తోక బ్యాట్స్‌మెన్ ప్రతిఘటించారు. పాట్ కమిన్స్ (28 నాటౌట్, 51 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), నాథన్ లయాన్ (13, 10 బంతుల్లో 1 సిక్స్), హజిల్‌వుడ్ (9, 11 బంతుల్లో 2 ఫోర్లు) భారత్ లక్ష్యాన్ని 300 పరుగుల పైచిలుకు తీసుకెళ్లారు. కమిన్స్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరువగా.. లయాన్ సిరాజ్ ఓవర్లో ఓ సిక్సర్ బాదాడు. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసింది. హజిల్‌వుడ్ వికెట్‌తో మహ్మద్ సిరాజ్ కెరీర్‌లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. షార్దుల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో మెప్పించాడు. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాల్గో రోజు 11 బంతులు ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (4 బ్యాటింగ్), శుభ్‌మన్ గిల్ (0 బ్యాటింగ్)లు వికెట్ కోల్పోకుండా భారత్‌ను మానసికంగా ముందంజలో నిలిచేలా చేశారు. స్టార్క్ ఓవర్లో బౌండరీ బాదిన రోహిత్ శర్మ నాలుగు పరుగులు సాధించాడు. హజిల్‌వుడ్ ఓవర్లో ఆరో బంతి విసరడానికి ముందే వరుణుడు మళ్లీ రంగప్రవేశం చేశాడు. దీంతో ఆటగాళ్లు తిరిగి పెవిలియన్‌కు చేరుకున్నారు. ఎడతెరపి లేని వర్షంతో మూడో సెషన్లో గంటకుపైగా ఆట తుడిచిపెట్టుకుపోయింది.
సెషన్ల వారీగా.. తొలి సెషన్ పరుగులు : 128 వికెట్లు : 04 ఓవర్లు : 35 రెండో సెషన్ పరుగులు : 94 వికెట్లు : 03 ఓవర్లు : 25.1 మూడో సెషన్ పరుగులు : 51 వికెట్లు : 03 ఓవర్లు : 9.4 భారత్ బ్యాటింగ్ పరుగులు : 04 వికెట్లు : 00 ఓవర్లు : 1.5