Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3 వికెట్లతో భారత్ చిరస్మరణీయ విజయం
- 2-1తో బోర్డర్-గవాస్కర్ సిరీస్ భారత్ సొంతం
- అదరగొట్టిన రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్
- ఆసీస్ గడ్డపై వరుసగా రెండో సిరీస్ విజయం
వర్షం ప్రమాద ఘంటికల నడుమ బ్రిస్బేన్‌లో ఆఖరు రోజు ఆట. ఉదయం ఆరంభంలోనే సీనియర్ రోహిత్ శర్మ (7)ను భారత్ కోల్పోయింది. యువ కెరటం శుభ్‌మన్ గిల్ (91) ఇన్నింగ్స్‌కు తోడు పుజారా (56) సహనశీల ఇన్నింగ్స్‌తో రాణించాడు. ఈ ఇద్దరి ఇన్నింగ్స్‌తో భారత్ ఓడిపోయే ప్రమాదం నుంచి బయటపడింది. ముఖ్యంగా పుజారా 211 బంతులను ఎదుర్కొని ఆస్ట్రేలియా పేసర్లు పూర్తిగా నీరసించేలా చేశాడు.
సిరీస్‌లో ఆఖరు సెషన్. భారత్ విజయానికి 37 ఓవర్లలో 145 పరుగులు కావాలి. 183/3తో భారత్ మెరుగైన స్థితిలో నిలిచినా సవాల్‌తో కూడిన ఆఖరు సెషన్లో అన్ని పరుగులు సాధించటం ఆషామాషీ కాదు. కానీ సహజ విధ్వంసకారుడు రిషబ్ పంత్ (89 నాటౌట్) ఆ పని చేశాడు. రిషబ్ పంత్ మెరుపులతో టీమ్ ఇండియా గబ్బా కోటను బద్దలు కొట్టింది. 33 ఏండ్లలో ఏ విదేశీ జట్టు ఇక్కడ విజయం సాధించలేదు. కుర్రాళ్లతో కూడిన యువ భారత్ కంగారూ కంచుకోటను ఛేదించింది. 3 వికెట్ల తేడాతో గబ్బాలో ఘన విజయం సాధించిన భారత్, 2-1తో బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ ఇండియాకు ఇది వరుసగా రెండో టెస్టు సిరీస్ విజయం కావటం విశేషం.
బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా)
కంగారూల కంచుకోట బద్దలైంది. చరిత్ర పునరావృతమైంది. ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు వరుసగా రెండోసారి టెస్టు సిరీస్ విజయాన్ని సాధించింది. నిర్ణయాత్మక గబ్బా టెస్టులో 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమ్ ఇండియా 3 వికెట్ల తేడాతో చారిత్రక విజయం నమోదు చేసింది. 2-1తో బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ట్రోఫీని సొంతం చేసుకుంది. గత 33 ఏండ్లలో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా పరాజయం పాలవటం ఇదే తొలిసారి. భీకర ఆసీస్ పేస్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత్ ఆఖరు రోజు అదరగొట్టేసింది. ఆరంభంలో శుభ్‌మన్ గిల్ (91, 146 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆఖర్లో రిషబ్ పంత్ (89 నాటౌట్, 138 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) విశ్వరూపం చూపించారు. సీనియర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (56, 211 బంతుల్లో 7 ఫోర్లు) వెలకట్టలేని సంయమనంతో కూడిన ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాను చావుదెబ్బ కొట్టాడు. పాట్ కమిన్స్ (4/55) రాణించినా.. గబ్బాలో కంగారూకు దారుణ పరాభవం తప్పలేదు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. నాలుగు టెస్టుల్లో 21 వికెట్లు కూల్చిన ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కించుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ట్రోఫీని టీమ్ ఇండియా కైవసం చేసుకుంది.
తొలి సెషన్ : శుభ్‌మన్ శుభారంభం
ఓవర్‌నైట్ స్కోరు 4/0తో ఆఖరు రోజు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ (7) కమిన్స్ బంతికి వికెట్ కోల్పోయాడు. పది ఓవర్లలోపే భారత్ కీలక బ్యాట్స్‌మన్‌ను కోల్పోయింది. నం.3 బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (56, 211 బంతుల్లో 7 ఫోర్లు)తో కలిసి గిల్ అదిరే ఆరంభాన్ని అందించాడు. ఓ ఎండ్‌లో పుజారా పేసర్ల సహనానికి పరీక్ష పెట్టగా.. మరో ఎండ్‌లో గిల్ పరుగుల వరద పారించాడు. ఐదు ఫోర్లతో 90 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన గిల్.. రెండు భారీ సిక్సర్లలో చెలరేగాడు. తొలి సెషన్లో పుజారా, గిల్లు 36 ఓవర్ల పాటు వికెట్‌కు అడ్డుగా నిలిచారు. చతేశ్వర్ పుజారా ఆరంభం నుంచీ దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో అదరగొట్టాడు. ఆ ప్రయత్నంలో పుజారా మోచేతి, భుజాలు, తొడలు, పక్కటెముక, చేతి వేళ్లు ఆసీస్ పేసర్ల ప్రతాపానికి గురయ్యాయి. లంచ్ సెషన్ ముగిసే సమయానికి భారత్ 83/1తో నిలిచింది. గిల్ 64, పుజారా 8 పరుగులతో క్రీజులో నిలిచారు.
రెండో సెషన్ : అటు వికెట్లు, ఇటు పరుగులు
పుజారా, గిల్ జోడీ రెండో వికెట్‌కు 114 పరుగుల శతక భాగస్వామ్యం నెలకొల్పింది. స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో సెంచరీకి చేరువైన గిల్‌ను లయాన్ బౌలింగ్‌లో స్మిత్ క్యాచౌట్ చేశాడు. వికెట్ కీపర్ పైనె వదిలేసిన క్యాచ్‌ను తొలి స్లిప్స్‌లో స్మిత్ అందుకున్నాడు. దీంతో గిల్ అద్భుత ఇన్నింగ్స్ అర్థాంతరంగా ముగిసింది. అజింక్య రహానె (24, 22 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) వచ్చీరాగానే దూకుడుగా ఆడటం మొదలెట్టాడు. పుజారా డిఫెన్స్‌నే నమ్ముకోగా.. రహానె వేగంగా పరుగులు సాధించటంపై దృష్టి సారించాడు. కమిన్స్ ఓవర్లో అయిష్టంగా ఆడిన ఓ షాట్‌కు రహానె వికెట్ కోల్పోయాడు. మరోసారి బ్యాటింగ్ లైనప్‌లో ముందొచ్చిన రిషబ్ పంత్ (89) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. పుజారాతో కలిసి పంత్ 67 పరుగులు జోడించాడు. ఈ ఇద్దరూ రెండో సెషన్లో మరో వికెట్ పడిపోకుండా చూసుకున్నారు. రెండో సెషన్ ముగిసే సమయానికి భారత్ 183/3తో మెరుగైన స్థితిలో నిలిచింది.
మూడో సెషన్ : అసాధ్యుడు 'రిషబ్ పంత్'
37 ఓవర్లలో 145 పరుగులు. సుమారుగా 4 రన్‌రేట్‌తో పరుగులు చేయాలి. టెస్టు క్రికెట్లో తొలి రోజే ఇది సాధ్యపడని సమీకరణం. అలాంటిది, ఆఖరు రోజు చివరి గంటల్లో ఈ సమీకరణం అసాధ్యమనే చెప్పాలి. సహజ విధ్వంసకారుడు రిషబ్ పంత్‌కు ఈ సమీకరణాలతో పని లేదు. తాను క్రీజులో ఉంటే, ఏదైనా సాధ్యమే. సిడ్నీలో భారత్ గెలుపు కోసం పోరాడేలా చేసిన పంత్.. బ్రిస్బేన్‌లో ఏకంగా గెలిపించాడు. పుజారతో కలిసి చివరి సెషన్‌కు బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. సైనితో కలిసి చారిత్రక విజయాన్ని పూర్తి చేశాడు. లయాన్పై భారీ సిక్సర్ బాదిన పంత్.. పేస్ బౌలర్లనూ బౌండరీలకు తరలించాడు. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 100 బంతుల్లో పంత్ అర్థ సెంచరీ సాధించాడు. 196 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసిన పుజారాను పాట్ కమిన్స్ వికెట్ల ముందు బ్రేక్ చేశాడు. మయాంక్ అగర్వాల్ (9, 15 బంతుల్లో 1 ఫోర్) ఎక్కువ సేపు వికెట్ కాపాడుకోలేదు. వాషింగ్టన్ సుందర్ (22, 29 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్)తో పంత్ గెలుపు భాగస్వామ్యం నమోదు చేశాడు. ఆరో వికెట్‌కు సుందర్‌తో కలిసి 53 పరుగులు జోడించాడు. పాట్ కమిన్స్ ఓవర్లో ఓ సిక్సర్, ఫోర్‌తో ధనాధన్ మొదలుపెట్టిన సుందర్.. ఆఖర్లో వికెట్ కోల్పోయాడు. శార్దుల్ ఠాకూర్ (2) సైతం ముగించే ప్రయత్నంలో వికెట్ జారవిడుచుకున్నాడు. కమిన్స్ ఓవర్లో చూడచక్కని బౌండరీ బాదిన రిషబ్ పంత్ గబ్బాలో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆఖరు సెషన్లో భారత్ ఏకంగా 146 పరుగులు పిండుకుంది. ఈ సిరీస్‌లోనే ఓ సెషన్లో అత్యధిక పరుగులు రాబట్టిన సెషన్ ఇది.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 369 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 336 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 294 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) టిమ్ పైనె (బి) పాట్ కమిన్స్ 7, శుభ్‌మన్ గిల్ (సి) స్టీవ్ స్మిత్ (బి) నాథన్ లయాన్ 91, చతేశ్వర్ పుజారా (ఎల్బీ) పాట్ కమిన్స్ 56, అజింక్య రహానె (సి) టిమ్ పైనె (బి) పాట్ కమిన్స్ 24, రిషబ్ పంత్ నాటౌట్ 89, మయాంక్ అగర్వాల్ (సి) మాథ్యూ వేడ్ (బి) పాట్ కమిన్స్ 9, వాషింగ్టన్ సుందర్ (బి) నాథన్ లయాన్ 22, శార్దుల్ ఠాకూర్ (సి) నాథన్ లయాన్ (బి) హజిల్‌వుడ్ 2, నవదీప్ సైని నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 29, మొత్తం : (97 ఓవర్లలో 7 వికెట్లకు) 329.
వికెట్ల పతనం : 1-18, 2-132, 3-167, 4-228, 5-265, 6-318, 7-325.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 16-0-75-0, జోశ్ హజిల్‌వుడ్ 22-5-74-1, పాట్ కమిన్స్ 24-10-55-4, కామెరూన్ గ్రీన్ 3-1-10-0, నాథన్ లయాన్ 31-7-85-2, మార్నస్ లబుషేన్ 1-0-4-0.
ఏ సెషన్లో ఎన్ని?
తొలి సెషన్
పరుగులు : 79
వికెట్లు : 01
ఓవర్లు : 36.1
రెండో సెషన్
పరుగులు : 100
వికెట్లు : 02
ఓవర్లు : 25
మూడో సెషన్
పరుగులు : 146
వికెట్లు : 04
ఓవర్లు : 34