Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పిన్ చేయకపోవటమే అసలు మాయ
- ఇంగ్లాండ్‌కు నయా సింహస్వప్నం
స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్. తొలి మూడు టెస్టులు ముగిసిపోయాయి. టర్నింగ్ పిచ్‌లపై మాంత్రికుడు రవీంద్ర జడేజా మైదానంలో మాయ చేయటం లేదనే అంశాన్ని అభిమానులతో పాటు విశ్లేషకులు గుర్తించటం లేదు. అందుకు కారణం మహా మాయగాడిని మరిపించే మాయజాలం అక్షర్ పటేల్ చేస్తుండటమే. తొలి రెండు టెస్టుల్లోనే మూడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన సహా 18 వికెట్లు పడగొట్టిన అక్షర్ పటేల్ ఇంగ్లాండ్ శిబిరాన్ని శాసిస్తున్నాడు. అశ్విన్, జడేజా సవాల్‌కు సిద్ధమైన వచ్చిన ఇంగ్లాండ్‌కు అక్షర్ 2.0 ఎదురవటంతో ఆ జట్టు విలవిల్లాడుతోంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
స్పిన్ పిచ్‌పై బ్యాట్స్‌మన్ ఎదుర్కొనే అత్యంత క్లిష్టమైన బంతి స్పిన్ కాని బంతి. ఇది పాత నానుడి అయినా, ఇందులో ఎంతో సత్యం ఉంది. ఆ తర్కం తెలియజేసేందుకు ఇంగ్లాండ్‌పై అక్షర్ పటేల్ సక్సెస్ ఫార్ములా సరిపోలుతుంది. అక్షర్ పటేల్ చెన్నై రెండో టెస్టులో టెస్టు అరంగేట్రం చేశాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనే అతడిని ఎదుర్కొవటం ఇంగ్లాండ్‌కు గగనమైంది. చెన్నైలో అరంగేట్ర ఇన్నింగ్స్‌లో 2/40తో మెరిసిన అక్షర్.. రెండో ఇన్నింగ్స్‌లో 5/60తో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. మొతెరాలో తొలి ఇన్నింగ్స్‌లో 6/38తో ఆరు వికెట్లు కూల్చిన లోకల్ హీరో.. రెండో ఇన్నింగ్స్‌లో 5/32తో మరో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. టెస్టు కెరీర్ ఆరంభ నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనే అక్షర్ పటేల్ ఏకంగా మూడుసార్లు ఐదు వికెట్ల కూల్చిన ఘనత సాధించాడు. 9.44 సగటు, 25.8 స్ట్రయిక్‌రేట్‌తో అక్షర్ పటేల్ 18 వికెట్లు తీసుకున్నాడు. ఆధునిక క్రికెట్ దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఎండ్ నుంచి వికెట్ల వేట సాగిస్తున్నా.. అక్షర్ పటేల్ వికెట్ల వేటలో సఫలం అయ్యాడు. అక్షర్ పటేల్ స్పిన్‌కు ఇంగ్లాండ్ దాసోహం అయిపోయింది. స్పిన్ చేయటం, స్పిన్ చేయకపోవటంలో వైవిధ్యం చూపించిన అక్షర్ పటేల్ చెపాక్, మొతెరాలో ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించాడు.
అక్షర్ వజ్రాయుధం :
' మొతెరాలో పడిన 30 వికెట్లలో ఏకంగా 21 వికెట్లు నేరుగా వచ్చిన బంతులవే. ఇది బ్యాట్స్‌మెన్ ఏకాగ్రత లోపమా? టర్న్ అయిన బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకోవటమా? తెలియదు. పరిస్థితులకు తగినట్టు బ్యాట్స్‌మెన్ మార్పులు చేసుకోలేదు అనేందుకు ఇది చక్కటి ఉదహరణ' ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇలా నేరుగా బంతులు సంధించి వికెట్ల జాతర చేసుకున్న స్పిన్నర్ అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ సంధించిన ఈ బంతులు క్లాసికల్ ఆర్మ్ బంతులు కావు. వర్టికల్ సీమ్, వైవిధ్యంతో అతడు బంతులు వేశాడు. ఇతర బంతులకు ఉండే గ్రిప్నే నేరుగా వేసిన బంతులకూ చూపించాడు. దీంతో అతడి స్పిన్ కాని బంతులు ఎదుర్కొవటం, అంచనా వేయటం బ్యాట్స్‌మెన్‌కు ఓరకంగా అసాధ్యమైంది. సహజసిద్దమైన వైవిధ్యంతో, ఒకేవిధమైన సీమ్‌తో అక్షర్ పటేల్ వరుసగా బంతులు సంధించాడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్‌కు 6.2 ఓవర్లలో ఐదు వికెట్లు పడిన చోట క్లాసికల్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 11 వికెట్లు పడగొట్టడం పెద్ద విశేషం కాదు. రెండు రోజుల్లోనే ముగిసిన టెస్టు సమరంలో అక్షర్ పటేల్ వికెట్లు పడగొట్టిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
' గులాబీ బంతిపై కాస్త ఎక్కువ మెరుపు ఉందని నా భావన. ఎందుకంటే బంతులు ఆఫ్ ది వికెట్ మీదుగా బంతులు నిలకడగా జారిపోతున్నాయి. అందుకే ఎక్కువగా ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలు వచ్చాయి. ఎర్ర బంతికి, గులాబీ బంతికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే కావచ్చు. చెన్నై పిచ్‌తో పోల్చితే మొతెరా పిచ్‌పై బంతి ఎక్కువగా జారిపోయింది' అని అక్షర్ పటేల్ వివరించాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్, అశ్విన్‌లు 9 వికెట్లు పంచుకున్నారు. అందులో నాలుగు ఎల్బీ, మూడు క్లీన్‌బౌల్డ్‌లు ఉన్నాయి. అహ్మదాబాద్ టెస్టులో అక్షర్ పటేల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తను వేసిన తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో తొలి బంతికే జాక్ క్రావ్లీ (0)ని, మూడో బంతికి జానీ బెయిర్‌స్టో (0)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ తొలి బంతికి జానీ బెయిర్‌స్టో (0)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.
ముచ్చటైన నిలకడ :
కెరీర్ తొలి రెండు టెస్టుల్లోనే 18 వికెట్లు పడగొట్టినా.. అక్షర్ పటేల్ ముచ్చటైన నిలకడతో అందరినీ ఆకట్టుకున్నాడు. మ్యాచ్ మ్యాచ్‌కు, సిరీస్ సిరీస్‌కు మెరుగైన ప్రదర్శనలు చేసే అశ్విన్.. అదే తరహాలో ప్రత్యర్థి జట్లను ఇరకాటంలో పడేసే జడేజాలను ఇప్పటివరకు చూశాం. స్పిన్ స్వర్గధామ ఉపఖండ పిచ్‌లపై రవీంద్ర జడేజా లేని లోటు అసలు తెలియకుండా చేశాడు అక్షర్ పటేల్. టెస్టు అరంగ్రేటానికి ముందు 38 ఫస్ట్ క్లాస్ మ్యాచులు అనుభవం కలిగిన అక్షర్ పటేల్ నుంచి ఇటువంటి ప్రదర్శన అమోఘం. పరిమిత ఓవర్ల (వన్డే, టీ20)ల్లో కచ్చితమైన లెంగ్త్‌లతో బంతులు వేయగలను అని అక్షర్ పటేల్ నిరూపించుకున్నాడు.
కానీ సుదీర్ఘ స్పెల్స్లలో టెస్టు క్రికెట్లో ఆ కచ్చితత్వం కొనసాగించటం ఏమంత సులువు కాదు. మొతెరా టెస్టు తొలి రోజు అక్షర్ పటేల్ 21.4 ఓవర్ల పాటు వరుసగా బౌలింగ్ చేశాడు. భారత్‌కు ఇటువంటి ప్రదర్శనలు ఇవ్వటంలో రవీంద్ర జడేజా సిద్ధహస్తుడు. టెస్టు కెరీర్లో జడేజా అన్ని రకాల పిచ్‌లపై వికెట్లు తీయగల సమర్థత సాధించాడు. భవిష్యత్‌లో అక్షర్ పటేల్ సైతం ఆ స్థాయికి చేరుకుంటాడని భారత క్రికెట్ ఆశిస్తోంది. రానున్న నాలుగో టెస్టులో సైతం అక్షర్ పటేల్ వికెట్లు, ప్యాడ్లపై చేసే మాయజాల దాడిని ఎదుర్కొవటం ఇంగ్లాండ్ జట్టుకు అసాధ్యమే!.