- ఇంగ్లాండ్ వైఖరిపై రిచర్డ్స్ విమర్శ న్యూఢిల్లీ : భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో పిచ్‌లపై చర్చ జరగడాన్ని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. చెన్నై, అహ్మదాబాద్‌లో ఎదురైన స్పిన్ ట్రాక్‌లపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేయటం వింతగా అనిపించిందని తన ఫేస్‌బుక్ పేజీలో కరీబియన్ లెజెండ్ అన్నాడు. 'భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో రెండు, మూడో టెస్టుల పిచ్‌పై స్పందించని నన్ను అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నేను కాస్త తికమక పడ్డాను. ఎందుకంటే ఆ పిచ్‌లపై ఆడుతున్నందుకు వారు(ఇంగ్లాండ్) ఎంతగానో రోధిస్తున్నారు. స్పిన్ పిచ్‌లపై ఏడిచేవారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.. గుడ్ లెంగ్త్ బంతి బౌన్స్ అవుతూ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయటం కష్టసాధ్యమైన పేస్ పిచ్‌లు సైతం మనకు ఉన్నాయని తెలుసుకోవాలి. టెస్టు క్రికెట్ అంటేనే ఇది. భారత పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ స్పిన్ పిచ్‌లే ఎదురవుతాయని జనాలు గమనించాలి. స్పిన్ సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమై వెళ్లాలి. టెస్టు క్రికెట్‌లో స్పిన్ కూడా భాగమే. టెస్టు ఫార్మాట్‌లో ఉండే మజా అదే. గత కొన్నేండ్లుగా భారత పేసర్లు గొప్ప నిలకడతో రాణిస్తున్నారు, వికెట్ల వేటలో దూసుకుపోతున్నారు. బ్యాట్స్‌మెన్ అతి సుకుమారంగా, అతి సునాయసంగా, క్లాసికల్‌గా పరుగులు చేయాలని ఏ క్రికెట్ పుస్తకంలో రాసిపెట్టలేదు' అని వివ్ రిచర్డ్స్ వ్యాఖ్యానించారు.