Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విరాట్ కోహ్లికి స్టీవ్ వా ప్రశంస
ముంబయి : సూపర్ స్టార్ బ్యాట్స్‌మన్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ప్రశంసలు కురిపించాడు. సరికొత్త దూకుడుతో భారత జట్టులో నమ్మకాన్ని నింపటంలో విరాట్ కోహ్లి విజయవంతం అయ్యాడని స్టీవ్ వా అన్నాడు. ప్రత్యర్థి జట్టు ఇబ్బందులకు గురవడానికి బదులు, ప్రత్యర్థిపై పంజా విసిరే తత్వం భారత జట్టులో కోహ్లి నింపాడని అభిప్రాయపడ్డాడు. ' విరాట్ కోహ్లిలో అందరూ ఇష్టపడే లక్షణం.. అతడి సరికొత్త వైఖరి. ప్రతి సవాల్‌ను స్వీకరించటం, దేన్నైనా సాధించగలమనే నమ్మకం ఆ వైఖరిలో ఉంటుంది. విరాట్ కోహ్లి ఆధునిక యుగ హీరో' అని స్టీవ్ వా అన్నాడు. 'క్యాప్షరింగ్ క్రికెట్ : స్టీవ్ వా ఇన్ ఇండియా' అనే డాక్యుమెంటరీలో స్టీవ్ వా ఈ వ్యాఖ్యలు చేశాడు. ' ముంబయిలో అడుగుపెట్టగానే అక్కడి కల్చర్ షాక్‌కు గురి చేసింది. ఎక్కడ చూసినా జనాలు, ఫుట్‌పాత్‌ల వెంట పిల్లులు, ఎలుకలు, కార్లు, బైక్‌లు.. ఇవన్నీ చూసి నేను ఎక్కడున్నాను? పూర్తిగా కొత్త ప్రపంచంలోకి వచ్చేశానా? బాంబుల వర్షం కురిసినట్టున్నది నా భావన' అని 1986లో తొలిసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు తన అనుభవంపై స్టీవ్ వా తెలిపాడు.