Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్‌లో ఉత్కంఠ విజయం
- ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్
జకర్తా (ఇండోనేషియా): భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు ఇండోనేషియా ఓపెన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఉత్కంఠ విజయం సాధించిన సింధు టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది. 66 నిమిషాల మ్యాచ్‌లో దక్షిణ కొరియా యువ సంచలనం సిమ్ యుజిన్పై సింధు 14-21, 21-19, 21-14తో పైచేయి సాధించింది. వరల్డ్ నం.7, మూడో సీడ్ సింధుకు సెమీస్ బెర్త్ అంత సులువుగా దక్కలేదు. తొలి గేమ్‌లోనే కొరియా చిన్నది సింధుకు గట్టి షాకిచ్చింది. ఆరంభంలో 7-1తో ముందంజ వేసిన సింధుపై వరుసగా ఆరు పాయింట్లు సాధించి 7-7తో స్కోరు సమం చేసింది. విరామ సమయానికి 11-10తో ముందంజ వేసిన సిమ్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తొలి గేమ్ 21-14తో సిమ్ వశమైంది. రెండో గేమ్‌లోనూ కొరియా షట్లర్ దూకుడు తగ్గలేదు. తొలి ఏడు పాయింట్ల వరకు సిమ్ ఆధిపత్యం కనిపించగా.. అక్కడ్నుంచి సింధు జోరు మొదలైంది. 14-8తో సింధు ఆధిక్యం సాధించినా.. సిమ్ పట్టు విడువలేదు. చివర్లో కీలక పాయింట్లతో సింధు రెండో గేమ్‌ను గెలుపొందింది. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. సింధు 11-4తో విరామ సమయానికి మంచి ఆధిక్యం సాధించింది. కానీ సిమ్ వరుస పాయింట్లతో 11-11తో స్కోరు సమం చేసింది. ద్వితీయార్థంలో సిమ్ యుజిన్ బలహీనతలను సొమ్ము చేసుకున్న సింధు తెలివిగా పాయింట్లు సాధించింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. నేడు సెమీస్‌లో రచనోక్ ఇంటనాన్ (థారులాండ్)తో సింధు పోటీపడనుంది.
పురుషుల డబుల్స్ విభాగంలో ఆరో సీడ్ సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ఫైనల్లో మలేషియా జోడీ ఫెయి, నుర్లపై వరుస గేముల్లో గెలుపొందారు. 21-19, 21-19తో 43 నిమిషాల్లోనే సెమీస్ బెర్త్ దక్కించుకున్నాడు. ఫైనల్లో చోటు కోసం నేడు టాప్ సీడ్ ఇండోనేషియా జోడీతో తలపడనున్నారు.