Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేప్‌టౌన్ టెస్టుకు విరాట్ సిద్ధం
- జట్టు కూర్పుపై పెరుగుతున్న ఆసక్తి
భారత క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేస్తూ జొహనెస్‌బర్గ్ టెస్టుకు దూరమైన సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి.. సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయంపై కన్నేసిన టీమ్ ఇండియా కింగ్ కోహ్లి రాకతో కేప్‌టౌన్‌లో విజయే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. విరాట్ కోహ్లి రాకతో తుది జట్టు కూర్పులోనూ ఆసక్తికర మార్పులు జరుగనున్నాయి.
నవతెలంగాణ క్రీడావిభాగం : విదేశీ గడ్డపై టెస్టు సమరాలను ఎంతగానో ఆస్వాదించే ఆటగాడు విరాట్ కోహ్లి. ఐదు రోజుల ఆటను ప్రత్యర్థి సొంతగడ్డపై సవాల్‌గా స్వీకరించే విరాట్ కోహ్లి మ్యాచ్ ఆసాంతం అత్యంత ఉత్కంఠతో కనిపిస్తాడు. దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం దిశగా సెంచూరియన్‌లో తొలి అడుగు వేసిన విరాట్ కోహ్లి.. కంచుకోట వాండరర్స్‌లో లాంఛనం ముగిస్తాడని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా వెన్నుపూస కండరాల నొప్పితో విరాట్ కోహ్లి వాండరర్స్ టెస్టుకు దూరమయ్యాడు. గాయం బాధించినా, నొప్పి వేధించినా మైదానంలో అసమాన పోరాట పటిమ చూపించిన విరాట్ కోహ్లి చిన్న గాయంతో చారిత్రక టెస్టు మ్యాచ్‌కు దూరం కావటం సందేహాలకు తావిచ్చింది. ఆటేతర అంశాలపై విస్తృత చర్చ నడిచినా ఇప్పుడు ఆ ప్రస్తావన అవసరం లేదు. విరాట్ కోహ్లి బెంచ్‌కు పరిమితమైన వేళ కెఎల్ రాహుల్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. జట్టును ముందుండి నడిపించే ప్రయత్నం చేశాడు. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా నాలుగు రోజులు పోటీపడిన టీమ్ ఇండియా చివరకు వెనుకంజ వేసింది. సఫారీ నాయకుడు డీన్ ఎల్గార్ అసమాన ఇన్నింగ్స్‌తో వాండరర్స్ కోటను భారత్ నుంచి లాగేసుకున్నాడు. మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేశాడు. చారిత్రక సిరీస్ విజయం కోసం భారత్ ఇప్పుడు కేప్‌టౌన్‌ను సొంతం చేసుకోవాల్సి ఉంది. ఈ కీలక సమరానికి కెప్టెన్ విరాట్ కోహ్లి అందుబాటులోకి రానుండటం అతిపెద్ద సానుకూలత. కేప్‌టౌన్ టెస్టులో విరాట్ కోహ్లి బరిలోకి దిగుతాడని తాత్కాలిక కెప్టెన్ కెఎల్ రాహుల్, చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సంకేతాలు అందించారు. 'విరాట్ కోహ్లి ప్రస్తుతం బాగున్నాడు. రెండు రోజులుగా నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. ఫీల్డింగ్‌తో పాటు రన్నింగ్ చేస్తున్నాడు. కేప్‌టౌన్ టెస్టుకు అతడు సిద్ధం' అని కెఎల్ రాహుల్ అన్నాడు. ' ఏ విధంగా చూసినా విరాట్ కోహ్లి బాగున్నాడు. ఫిజియోతో కోహ్లి ఫిట్‌నెస్ గురించి పూర్తిగా చర్చించలేదు. కానీ అతడితో మాట్లాడిన అనంతరం విరాట్ మెరుగయ్యాడని అర్థమైంది. కేప్‌టౌన్‌లోనూ విరాట్ కొన్ని నెట్ సెషన్ల పాటు సాధన చేయనున్నాడు. చివరి టెస్టుకు అతడు సిద్ధంగా ఉంటాడనే అనుకుంటున్నాను' అని రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.
విహారిపై వేటు? : విరాట్ కోహ్లి రాకతో భారత శిబిరంలో కొత్త ఉత్సాహం రానుంది. నాయకుడిగా ముందుండి నడిపించటంలో విరాట్ కోహ్లిది భిన్నమైన శైలి. వ్యక్తిగతంగా బ్యాటింగ్ సమస్యలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లి ఓ టెస్టు మ్యాచ్ విరామం అనంతరం భీకర స్థాయిలో రెచ్చిపోయే అవకాశం లేకపోలేదు. విరాట్ కోహ్లి శతక దాహం భారత్‌కు అంతిమంగా మేలు చేసే సమయం ఆసన్నమైందని భావించవచ్చు. విరాట్ కోహ్లి రాకతో తుది జట్టు కూర్పులో మార్పులు అనివార్యం. వాండరర్స్ టెస్టులో ఆడిన ఇద్దరు తెలుగు తేజాలు కేప్‌టౌన్ సమరానికి దూరం కానున్నారు. హనుమ విహారి తన స్థానాన్ని విరాట్ కోహ్లికి త్యాగం చేయక తప్పని పరిస్థితి. నాల్గో రోజు ఆటలో తొడ కండరం గాయానికి గురైన మహ్మద్ సిరాజ్ మూడో టెస్టుకు అనుమానమే. సిరాజ్ ఫిట్‌నెస్‌పై జట్టు మేనేజ్‌మెంట్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అతడి స్థానంలో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లలో ఒకరు కేప్‌టౌన్‌లో ఆడేందుకు వీలుంది. వాండరర్స్ టెస్టులో అద్భుతంగా రాణించిన హనుమ విహారిపై వేటు ఇబ్బందికరం. రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 40 పరుగులు చేసిన విహారి నిర్ణయాత్మక టెస్టుకు దూరం కానున్నాడు. తొలి టెస్టులో, వాండరర్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైన సీనియర్ బ్యాటర్లు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు రెండో ఇన్నింగ్స్‌లో కీలక అర్థ సెంచరీలు నమోదు చేశారు. దీంతో ఆ ఇద్దరు చివరి టెస్టుకు తమ స్థానాలు కాపాడుకున్నారు. సీనియర్ బ్యాటర్ల కోసం హనుమ విహారి మరోసారి బెంచ్‌కు పరిమితం కాక తప్పటం లేదు. ' హనుమ విహారి ఈ టెస్టులో అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో విహారి ఆకట్టుకున్నాడు. ఓ అద్భుత క్యాచ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో అవుటైనా.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత గొప్పగా రాణించాడు. విహారి బ్యాటింగ్‌తో జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసం లభించింది. సీనియర్ల కోసం జూనియర్లు కొంత కాలం ఓపిక పట్టాలి. అందరికీ కెరీర్ ఆరంభంలో ఇది అత్యంత సహజం' అని చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కేప్‌టౌన్ తుది జట్టు కూర్పుపై సంకేతాలు ఇచ్చాడు.