Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒత్తిడిని అధిగమిస్తూ సాగిన నా ప్రయాణం సంతృప్తికరం. యు.ఎస్ ఓపెన్‌లో నేను ఆడిన విధానంతో ఆనందంగా ఉన్నాను. చెత్తగా ఆడినా, గొప్పగా ఆడినా.. నా పోటీతత్వం, క్రీడాస్ఫూర్తి, గెలవాలనే తపనలో ఎన్నడూ మార్పు లేదు. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతోనే ముందుకు సాగాను' - రఫెల్ నడాల్
కింగ్ ఆఫ్ క్లే మరోసారి హార్డ్కోర్టులో హీరోగా అవతరించాడు. ఏకపక్ష ఫైనల్లో తిరుగులేని విజయంతో మూడో యు.ఎస్ ఓపెన్ ట్రోఫీని దక్కించుకున్నాడు. 31 ఏండ్ల వయసులో కెరీర్ 16వ గ్రాండ్‌స్లామ్ సాధించి.. చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెడరర్ (19)ను వెంబడిస్తున్నాడు!. 30వ పుట్టినరోజు జరుపుకున్న తర్వాత నడాల్ కెరీర్ గ్రాఫ్ మరింత క్షీణించటం ఖామమనుకున్న వారికి విజయంతోనే సమాధానం ఇచ్చాడు. 12 ఏండ్ల ముందు తొలి గ్రాండ్‌స్లామ్ విజయం సాధించిన నడాల్.. వరుసగా మూడు టైటిళ్లు పారిస్‌లోనే సాధించాడు. దీంతో నడాల్ దూకుడు మట్టికోర్టుకే పరిమితం అనుకున్నారు. కానీ వింబుల్డన్‌లో రెండు, ఆస్ట్రేలియాలో ఒకటి సహా న్యూయార్క్‌లోనూ మూడు టైటిళ్లు సాధించాడు. 2005-2014 వరకూ ప్రతి ఏడాది కనీసం ఒక్క గ్రాండ్‌స్లామ్ విజయమైనా సాధించాడు. కానీ 2005లో తొలిసారి నడాల్ గ్రాండ్‌స్లామ్ లేకుండానే సీజన్‌ను ముగించాడు. 2016 సైతం అదే విధంగా నడాల్‌కు చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. దీనికి తోడు ఫిట్నెస్తో పోరాటం. ఇలాంటి సందర్భంలో నడాల్ మళ్లీ తిరిగి విజేతల గ్రూప్‌లో చేరుతాడని ఎవ్వరూ ఊహించలేదు. కానీ గొప్పగా పుంజుకున్న నడాల్ మెల్బోర్న్లో టైటిల్ పోరులో తలపడ్డాడు, పారిస్‌లో పదో టైటిల్ సాధించాడు. తాజాగా న్యూయార్క్‌లో హీరోగా నిలిచాడు. కెరీర్ బ్రహ్మాండంగా కొనసాగిన 2008, 2010, 2013లలో ఏడాదికి రెండు చొప్పున గ్రాండ్‌స్లామ్ సాధించిన నడాల్.. పనైపోయిందనుకున్న వేళ పునరాగమనంలో మళ్లీ ఒకే ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు సాధించి ఔరా అనిపించాడు.
పాతదే అయినా, నడాల్ విజయ స్ఫూర్తితో కొత్తగా చెప్పుకోవాలి. నొవాక్ జకోవిచ్, ఆండీ ముర్రేలు గ్రాండ్‌స్లామ్ వేటలో జోరందుకున్న వేళ.. నడాల్, ఫెడరర్లు మళ్లీ గ్రాండ్‌స్లామ్‌తో కనిపించటం కష్టమే అనిపించింది. ఫెడరర్ విషయంలో చాలామంది అతడు పుంజుకుంటాడని అంచనా వేశారు. కానీ నడాల్ విషయానికొచ్చేసరికి ఆ మాట అనలేకపోయారు. కానీ 2017లో రెండు మేజర్ ట్రోఫీలతో దూసుకొచ్చిన నడాల్.. ఆట తీరు అద్భుతంగా ఉన్నా, అధ్వాన్నంగా ఉన్నా పోరాటపటిమలో తేడా ఉండదు మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపించాడు. క్రీడల గొప్పతనమే ఆ అనూహ్యం. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ విజయం సాధిస్తారో చెప్పలేం. ఇది నడాల్కైనా, భవిష్యత్‌లో జకోవిచ్, ముర్రేలకైనా వర్తిస్తుంది.