Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడోసారి యు.ఎస్ ఓపెన్ టైటిల్ కైవసం
- ఫైనల్లో అండర్సన్‌కు తప్పని భంగపాటు
- 16 గ్రాండ్‌స్లామ్‌తో నడాల్ దూకుడు
స్పెయిన్ బుల్ గర్జించింది. మట్టికోర్టులోనే కాదు హార్డ్కోర్ట్లోనూ రఫెల్ నడాల్ అదరగొట్టాడు. ముచ్చటగా మూడోసారి యు.ఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను ఎగరేసుకుపోయాడు. వరల్డ్ నెం.1, టాప్ సీడ్ రఫెల నడాల్ 2013 తర్వాత తొలిసారి ఓ ఏడాదిలో రెండు గ్రాండ్‌స్లామ్ సాధించాడు. ఫస్ట్‌టైమ్ ఫైనలిస్ట్ కెవిన్ అండర్సన్‌ను అలవోకగా ఓడించి పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. సర్ప్రైజ్లు ఇవ్వటంలో స్పెయిన్బుల్కు సాటి లేరెవ్వరూ!. ఫిట్నెస్తో అవిశ్రాతంగా పోరాడుతూనే, టెన్నిస్ కోర్టులో మళ్లీ మెరుస్తున్నాడు. గ్రాండ్‌స్లామ్ విజయమే లేకుండా రెండేండ్లు గడిచినా, అచ్చొచ్చిన ఫ్రెంచ్‌తో ట్రాక్‌లో పడ్డాడు. నిలకడైన ఆటతీరుతో, చాంపియన్ గేమ్ స్టయిల్‌తో కెరీర్లో 16వ గ్రాండ్‌స్లామ్ కొట్టేశాడు. రోజర్ ఫెడరర్ 19 టైటిళ్లకు మరింత చేరువయ్యాడు.
నవతెలంగాణ-న్యూయార్క్
2010, 2013, 2017... స్పెయిన్ బుల్ న్యూయార్క్‌లో విజేతగా నిలిచిన సీజన్లు. అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్ (10 సార్లు నెగ్గాడు) అత్యధిక టైటిళ్లు నడాల్ ఇక్కడే సాధించాడు. వింబుల్డన్‌లో రెండు, ఆస్ట్రేలియాలో ఓ ట్రోఫీ సాధించిన స్పెయిన్ బుల్, న్యూయార్క్‌లో మూడు టైటిళ్లతో చెలరేగాడు. ఆదివారం అర్థరాత్రి (భారత కాలమానం ప్రకారం) దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ అండర్సన్‌తో జరిగిన టైటిల్ పోరులో అలవోక విజయంతో రఫెల్ నడాల్ (స్పెయిన్) చాంపియన్‌గా నిలిచాడు. రెండున్నర గంటల మ్యాచ్‌లో 6-3, 6-3, 6-4తో అండర్సన్‌పై విజయం సాధించాడు. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో పోరాడిన అండర్సన్.. ఆఖరుకు రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నాడు. నడాల్‌కు ఈ ఏడాదిలో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ విజయం. ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన నడాల్.. టాప్-3 (జకోవిచ్, ఫెడరర్, ఆండీ ముర్రే) ఆటగాళ్లతో తలపడకుండానే టైటిల్ దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో పాటు వింబుల్డన్‌లోనూ విజయం సాధించిన రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) సైతం సెంటర్ కోర్టులో టాప్-3 (నడాల్,జకోవిచ్, ముర్రే)లతో తలపడకుండానే 19వ గ్రాండ్‌స్లామ్ నెగ్గటం యాధృచ్చికమే.
ఫైనల్లో వన్‌మ్యాన్ షో : మూడేండ్ల తర్వాత యు.ఎస్ ఓపెన్ టైటిల్ వేటలో నిలిచిన రఫెల్ నడాల్.. ఫైనల్లో దుమ్మురేపాడు. తొలిసారి ఫైనల్స్‌కు చేరిన కెవిన్ అండర్సన్.. ఆఖరి ఆటలో తేలిపోయాడు. ప్రత్యర్థి 20కి పైగా గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడిన ఆటగాడు కావటం అండర్సన్‌కు ప్రతికూలాంశమైంది. స్వేచ్ఛగా ఆడిన నడాల్ 6-3, 6-3, 6-4తో రెండున్నర గంటల్లోనే టైటిల్‌ను ముద్దాడాడు. తొలి సెట్లో ఇద్దరు తమ సర్వ్‌లు నిలుపుకున్నారు. దీంతో 3-3తో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. కానీ అండర్సన్ సర్వ్‌ను తొలిసారి బ్రేక్ చేసిన నడాల్.. బ్యాక్‌హ్యాండ్ వ్యాలీ విన్నర్‌తో 4-3తో ముందంజ వేశాడు. తర్వాత తన సర్వ్‌ను నిలుపుకుని 5-3తో ఆధిక్యం సాధించాడు. అండర్సన్ సర్వ్‌ను మరోసారి బ్రేక్ చేసిన నడాల్ 6-3తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. గేమ్ పాయింట్ల కోసం నడాల్‌తో సుమారు గంట పాటు పోరాడిన అండర్సన్ 3-6తో తొలి సెట్‌ను కోల్పోయాడు. ఇక రెండో సెట్లో నడాల్ మరింత దూకుడుగా విజృంభించాడు. తన సర్వ్‌తో గేమ్ పాయింట్ సాధించి 1-0తో మొదలెట్టిన నడాల్ ఈ సెట్‌ను 39 నిమిషాల్లోనే ముగించాడు. 2-2తో స్కోరు సమంగా ఉన్న సమయంలో.. వరుస పాయింట్లు సాధించిన నడాల్ 5-2తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచాడు. మ్యాచ్ పాయింట్ వద్ద నడాల్‌ను నిలువరించి అండర్సన్ ఓ గేమ్ పాయింట్ సాధించినా.. కావాల్సినంత పోటీ ఇవ్వలేదు. దీంతో 6-3తో నడాల్ రెండో సెట్‌నూ సొంతం చేసుకున్నాడు. తొలి రెండు సెట్లు నెగ్గిన జోరులో నడాల్ మూడో సెట్లోనూ వెనక్కి తగ్గలేదు. 2-0తో మందంజలో నిలిచి.. అండర్సన్‌ను మానసికంగా ఓడించాడు. ఈ సెట్లో అండర్సన్ ఏ దశలోనూ నడాల్‌కు సమవుజ్జీగా నిలువలేదు. 4-2, 5-4తో ఆధిక్యం సాధించిన నడాల్ బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో మూడో సెట్‌ను, మూడో యు.ఎస్ ఓపెన్ ట్రోఫీని ఖాతాలో వేసుకున్నాడు. నడాల్ ఒక్క ఏస్‌తో సరిపెట్టుకోగా, అండర్సన్ మాత్రం 4 ఏస్‌లు సంధించాడు. ఇక విన్నర్ల విషయంలోనూ నడాల్ 30 సాధించగా, అండర్సన్ 32 విన్నర్లు సాధించాడు. కానీ అనవసర తప్పిదాల విషయంలో 40 సార్లు తడబడిన అండర్సన్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. 11 సార్లే అనసవర తప్పిదాలకు ఆస్కారం ఇచ్చిన నడాల్ ఫైనల్లో తిరుగులేని విజేతగా నిలిచాడు. ఇక గేమ్ వ్యూహంలోనూ నడాల్ విశేషంగా ఆకట్టుకున్నాడు.
ప్రధానంగా అండర్సన్‌ను సర్వ్‌లను బ్రేక్ చేసి, అతడి స్జైర్యాన్ని దెబ్బకొట్టిన నడాల్ ఎక్కడా కోలుకునే అవకాశం ఇవ్వలేదు. అండర్సన్‌కు బ్యాకహ్యేండ్ రిటర్న్‌లతో బదులిస్తూనే, తన ట్రేడ్ మార్క్ టాప్ స్పిన్ ఫోర్‌హ్యాండ్ షాట్లతో నెట్ దగ్గర అండర్సన్‌ను బోల్తాకొట్టించాడు. నడాల్ వ్యూహానికి ఏ దశలోనూ దీటుగా స్పందించని అండర్సన్.. కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
నడాల్ అండర్సన్
01 ఏస్‌లు 10
01 డబుల్ ఫాల్ట్స్ 04
16/16 నెట్ పాయింట్లు 16/34
4/9 బ్రేక్ పాయింట్లు 0/0
30 విన్నర్లు 32
11 అనవసర తప్పిదాలు 40
102 నెగ్గిన పాయింట్లు 78