Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకట్టుకున్న భారత యువ ఆటగాళ్లు
నవతెలంగాణ-చెన్నై
సన్నాహాకంలో స్మిత్‌సేన మెరిసింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ సానుకూలంగా భారత్ పర్యటనను ఆరంభించారు. చెపాక్‌లో ఇండియన్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవెన్‌తో జరిగిన వన్డే వార్మప్ పోరులో ఆస్ట్రేలియా 103 పరుగుల తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్‌తో మీర్పూర్ టెస్టులో మట్టికరిచినా, చిట్టగాంగ్‌లో పుంజుకున్న కంగారూలు అదే జోరు చెపాక్‌లోనూ చూపించారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (55, 68 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) సహా ఓపెనర్ డెవిడ్ వార్నర్ (64, 48 బంతుల్లో 11 ఫోర్లు), ట్రావిశ్ హెడ్ (65), స్టోయినిస్ (76)లు అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. మాథ్యూ వేడ్ (45, 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 347 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో భారత కుర్రాళ్లు ఆకట్టుకున్నా.. 244 పరుగులకే కుప్పకూలారు. గోస్వామి (43), అగర్వాల్ (42)లు రాణించారు. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ (2/23), కుశాంగ్ పటేల్ (2/58)లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా సెప్టెంబర్ 17న చెపాక్‌లో తొలి వన్డేతో కఠిన పరీక్షకు సిద్ధం కానున్నది.
కంగారూ లేకుండా.. : టాస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా చెపాక్‌లో పరుగుల వరద పారించింది. యువ సీమర్ అవేశ్ ఖాన్ ఆరంభంలోనే ఓపెనర్ కార్ట్‌రైట్ (0)ను డకౌట్‌గా వెనక్కి పంపినా.. ఆసీస్ వెనక్కి తగ్గలేదు. డెవిడ్ వార్నర్ (64) జతగా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (55) చెలరేగాడు. 48 బంతుల్లోనే వార్నర్ 11 ఫోర్లతో రచ్చ చేయగా, స్మిత్ సహజశైలిలో ఆడాడు. స్మిత్, వార్నర్‌లు తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించారు. దీంతో ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగింది. 106/1తో ఉన్న ఆసీస్‌ను 158/4తో ఒత్తిడిలోకి నెట్టిన యువ బౌలర్లు.. స్మిత్సేనను స్వల్ప స్కోరుకే పరిమితం చేసేలా కనిపించారు. కానీ ఆసీస్ లోయర్ ఆర్డర్ అందుకు నిరాకరించింది. మాథ్యూ వేడ్ (45, 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కండ్లుచెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. నాల్గు సిక్సర్లతో హడలెత్తించాడు. ఇతనికి స్టోయినిస్ (76, 60 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చక్కటి సహకారం లభించింది. ట్రావిశ్ హెడ్ (65, 63 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో దుమ్మురేపాడు. ఐదుగురు ఆటగాళ్లు ఆకట్టుకునే ప్రదర్శన చేయగా ఆసీస్ 347 పరుగులు చేసింది.
పోరాడిన కుర్రాళ్లు : భారీ ఛేదనలో యువ జట్టు తడబడింది. ఆస్ట్రేలియా మాదిరిగానే ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (7)ని ఆరంభంలోనే కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ శ్రీవాట్స్ గోస్వామి (43, 54 బంతుల్లో 2 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (42, 47 బంతుల్లో 4 ఫోర్లు)లు రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. దీంతో భారత్ గెలుపు దిశగా సాగుతున్నట్టే అనిపించింది. కానీ మిడిల్ ఆర్డర్లో సరైన భాగస్వామ్యాలు లేకపోవటం యువ జట్టు అవకాశాలను దెబ్బతీసింది. నితీశ్ రానా (19) రనౌట్‌తో ఇన్నింగ్స్ వేగం మందగించింది. గుర్కీరత్ సింగ్ మన్ (27), శివం చౌదరి (4), వాషింగ్టన్ సుందర్ (11)లు విఫలమయ్యారు. ఆఖర్లో అక్షరు కర్నెవార్ (40, 28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు0, కుశాంగ్ పటేల్ (41, 48 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అస్టన్ అగర్ నాల్గు వికెట్లు కూల్చగా, రిచర్డ్సన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఫాల్క్‌నర్, జంపా, స్టోయినిస్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : వార్నర్ (సి) గోస్వామి (బి) కుశాంగ్ పటేల్ 64, కార్ట్‌రైట్ (సి) గుర్కీరత్ (బి) అవేశ్ ఖాన్ 0, స్మిత్ (సి) గుర్కీరత్ (బి) వాషింగ్టన్ సుందర్ 55, ట్రావిశ్ హెడ్ (సి) సందీప్ శర్మ (బి) కర్నెవార్ 65, మాక్స్వెల్ (సి,బి) వాషింగ్టన్ సుందర్ 14, స్టోయినిస్ (సి) త్రిపాఠి (బి) ఖెజ్రోలియా 76, మాథ్యూ వేడ్ (బి) కుశాంగ్ పటేల్ 45, ఫాల్క్‌నర్ నాటౌట్ 8, అగర్ 8, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (50 ఓవర్లలో 7 వికెట్లకు) 347.
వికెట్ల పతనం : 1-0, 2-106, 3-134, 4-158, 5-246, 6-331, 7-331.
బౌలింగ్ : సందీప్ శర్మ 6-1-46-0, అవేశ్ ఖాన్ 6-0-40-1, ఖెజ్రోలియా 5-0-37-1, వాషింగ్టన్ సుందర్ 8-1-23-2, కుశాంగ్ పటేల్ 6-0-58-2, రాహిల్ షా 7-0-32-0, కర్నెవార్ 6-0-59-1, గుర్కీరత్ సింగ్ మన్ 6-0-44-0.
ఇండియన్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ ఇన్నింగ్స్ : శ్రీవాట్స్ గోస్వామి (బి) స్టోయినిస్ 43, రాహుల్ త్రిపాఠి (సి) వేడ్ (బి) రిచర్డ్సన్ 7, మయాంక్ అగర్వాల్ (సి) వార్నర్ (బి) జంపా 42, నితీశ్ రానా రనౌట్ (స్మిత్) 19, గుర్కీరత్ సింగ్ (సి) ఫాల్క్‌నర్ (బి) అగర్ 27, శివం చౌదరి (సి) వేడ్ (బి) అగర్ 4, వాషింగ్టన్ సుందర్ (సి) అగర్ (బి) రిచర్డ్సన్ 11, గోవిందా పొద్దార్ (సి) స్మిత్ (బి) అగర్ 0, కర్నెవార్ (సి) మాక్స్వెల్ (బి) ఫాల్క్‌నర్ 40, కుశాంగ్ పటేల్ నాటౌట్ 41, రాహిల్ షా (సి) కార్ట్‌రైట్ (బి) అగర్ 3, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (48.2 ఓవర్లలో ఆలౌట్) 244.
వికెట్ల పతనం : 1-10, 2-89, 3-102, 4-130, 5-143, 6-148, 7-148, 8-156, 9-222, 10-244.
బౌలింగ్ : కౌల్టర్‌నైల్ 7-1-16-0, రిచర్డ్సన్ 6-0-36-2, ట్రావిశ్ హెడ్ 4-0-24-0, ఫాల్క్‌నర్ 7-0-35-1, ఆడం జంపా 8-0-59-1, స్టోయినిస్ 4-0-13-1, అస్టన్ అగర్ 8.2-1-44-4, పాట్ కమిన్స్ 4-0-15-0.