Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంగారూలతో వన్డే, టీ20 సమరం
- కోహ్లి, స్మిత్ వైరం పునరావృతం!
- హాట్‌ఫేవరేట్‌గా ఆతిథ్య భారత్
ప్రపంచ క్రికెట్లో చిరకాల వైరం అంటే ముందుగా గుర్తొచ్చేది భారత్ వర్సెస్ పాక్, ఆస్ట్రేలియా వర్సెన్ ఇంగ్లాండ్. కానీ ఆధునిక క్రికెట్ ఆస్ట్రేలియా, భారత్ మధ్య క్రికెట్ వైరాన్ని సృష్టించింది. రెండు జట్లూ టాప్ ఫామ్‌లో ఉండటం, ఇరు జట్ల సారథులు బెస్ట్ బ్యాట్స్‌మన్ రేసులో పోటీపడుతుండటం, ఆఖరి బంతి వరకూ ఫలితాన్ని ఊహించలేని స్థాయి పోటీతత్వం కంగారూలతో కోహ్లిసేన పోరాటాన్ని రసవత్తరంగా మార్చుతున్నాయి. ఫార్మాట్ ఏదైనా, పోటీ ఎక్కడైనా.. భారత్, ఆసీస్ తలపడుతున్నాయంటే క్రికెట్ ప్రపంచం చూపులన్నీ అటువైపే ఉంటున్నాయి. ఏడాది ఆరంభం టెస్టు సిరీస్‌లో మైదానం లోపలా, బయటా విపరీమైన వేడి పుట్టించిన కోహ్లి, స్మిత్ సేనలు పరిమిత ఓవర్ల పోటీలోనూ అంతకుమించిన అంచనాలతో బరిలోకి దిగుతున్నాయి. ఆసీస్‌తో ఆటలో వరల్డ్ నెం.1 సాధించాలనే లక్ష్యంతో టీమ్ ఇండియా కనిపిస్తోంది.
* శ్రీనివాస్ దాస్ మంతటి
స్వదేశీ టెస్టు సీజన్‌ను ఆస్ట్రేలియాపై 2-1 విజయంతో ఘనంగా ముగించిన కోహ్లిసేన.. విదేశీ గడ్డపై విజయయాత్ర ముగించుకుని మళ్లీ సొంతగడ్డపై కాలుమోపింది. ఈసారి స్వదేశంలో స్వల్పకాలిక పరిమిత ఓవర్ల సీజన్‌ను ఆస్ట్రేలియాతో ఆరంభించనున్న టీమ్ ఇండియా అదిరే విజయంపై కన్నేసింది. ఆధునిక క్రికెట్లో భారత్‌కు సమవుజ్జీగా నిలుస్తోన్న ఆస్ట్రేలియాను ఓడించి వన్డేల్లో వరల్డ్ నెం.1 కైవసం చేసుకోవాలని ఎదురుచూస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ, కరీబియన్ పర్యటన సహా శ్రీలంకలో భారత్ తిరుగులేని విజయాలు సాధించింది. కానీ తలపడుతున్నది సొంతగడ్డపైనే అయినా, కోహ్లి సారథ్యంలోని బృందం భీకర ఫామ్‌లో ఉన్నా.. ప్రత్యర్థి ఆస్ట్రేలియా కావటంతో ఐదు వన్డేల సిరీస్‌పై ఎడతెగని ఉత్కంఠ నెలకొన్నది. ఐదు వన్డేలు, మూడు టీ20ల కోసం భారత్‌కు వచ్చిన కంగారూలు ప్రాక్టీస్ పోరులో సత్తా చాటారు. దీంతో అసలు సమరంపై అంచనాలు రెట్టింపవుతున్నాయి. చెన్నై చెపాక్‌లో ఆదివారం జరిగే తొలి వన్డేతో ఆసీస్, భారత్ వన్డే సవాల్ షురూ కానున్నది.
భీకర ఫామే మన బలం : ఆస్ట్రేలియాతో పోరు అయినప్పటికీ కోహ్లిసేన హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. అందుకు కారణం టీమ్ ఇండియా నిలకడైన విజయాలే. బ్యాటింగ్, బౌలింగ్ సహా ఫీల్డింగ్ విభాగాల్లో భారత్ పటిష్టంగా ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లి పరుగుల ప్రవాహం కొనసాగుతుండగా అతడికి రోహిత్ శర్మ, ఎం.ఎస్ ధోనిలు అండగా ఉన్నారు. అజింక్య రహానె, లోకేశ్ రాహుల్‌లకు తోడు మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యలు బ్యాటింగ్ ఆర్డర్‌కు బలోపేతం చేస్తున్నారు. భారీ లక్ష్యాలను సైతం అలవోక ఛేదించగల దుర్బేద్యమైన లైనప్ మన సొంతం. ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు గొప్ప రికార్డు ఉంది. ఇటీవల శ్రీలంక సిరీస్‌లో ఎం.ఎస్ ధోని ఒక్కసారి కూడా వికెట్ జారవిడుచుకోలేదు. కంగారూలపైనా అతడి జోరు కొనసాగుతుందనటంలో సందేహం లేదు. బౌలింగ్ విభాగంలో భారత్ మునుపెన్నడూ లేనంత ప్రమాదకరంగా తయారైంది. యార్కర్ల హీరో జశ్‌ప్రీత్ బుమ్రాకు తోడు మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్‌లు పేస్ దళంలో ఉన్నారు. స్పిన్ బాధ్యతలను యువ యామాగాళ్లు అక్షర్ పటేల్, యుజ్వెందర్ చాహాల్ సహా కుల్దీప్ యాదవ్ తీసుకున్నారు. వన్డే ఫార్మాట్లో సీనియర్లను పక్కనపెట్టినా, మణికట్టు మాయాగాళ్లు బంతిని అద్భుతంగా తిప్పుుతున్నారు. మిడిల్ ఓవర్లలో వికెట్ల వేటలోనూ కోహ్లిసేనకు చింత లేదు. ఫిట్నెస్ విషయంలో కొత్త ప్రమాణాలతో దూసుకెళ్తోన్న భారత్.. ఫీల్డింగ్‌లో కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తున్నది. వికెట్ల మధ్య వేగంగా పరుగు తీయటంతో పాటు మైదానంలో పాదరసంలా కదులుతూ పరుగుల నియంత్రణలోనూ దూకుడు చూపిస్తున్నారు. కోహ్లిసేన మెరుగైన విభాగాల్లో దీని ప్రాధాన్యం ఎనలేనిది. వీటన్నింటికి తోడు సొంతగడ్డపై, కిక్కిరిసిన అభిమానుల నడుమ ఆడటం కోహ్లిసేనకు కలిసొచ్చేదే. దీంతో 4-1తో ఆసీస్‌ను ఓడించి వరల్డ్ నెం.1గా నిలవాలని భారత్ వ్యూహం రచిస్తోంది. అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా కంటే రెండు పాయింట్ల వెనుకంజలోనే ఉన్న టీమ్ ఇండియా తాజా సిరీస్‌తో నెం.1పై కన్నేసింది.
కంగారూలతో ప్రమాదమే : ఆస్ట్రేలియా ఎప్పుడైనా ప్రమాదకర జట్టే. ప్రస్తుత స్మిత్‌సేన సైతం అందుకు భిన్నం కాదు. ఆ జట్టులో విధ్వంసక ఆటగాడు డెవిడ్ వార్నర్ సహా అనూహ్య వీరంగ వీరులు గ్లెన్ మాక్స్వెల్, జేమ్స్ ఫాల్క్‌నర్‌లు ఉన్నారు. ఆసీస్ గత పర్యటనలో ఇక్కడికొచ్చినప్పుడు.. ఫాల్క్‌నర్ సృష్టించిన అలజడి అభిమానులు ఇంకా మరిచిపోలేదు. ఈసారి కూడా ఫాల్క్‌నర్ నుంచి కంగారూ శిబిరం అలాంటి ప్రదర్శనలు కోరుకుంటోంది. సారథి స్టీవ్ స్మిత్ ఆసీస్‌కు అదనపు బలం. పరిస్థితులకు తగినట్టు ఆడగల నేర్పు, కీలక భాగస్వామ్యాలు నిర్మించగల సామర్థ్యం స్మిత్ సొంతం. అందుకే ఆరంభంలో వికెట్లు కూలినా.. మిడిల్లో స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగలడు. అరోన్ ఫించ్ గాయంతో దూరమైనా పీటర్ హ్యాండ్స్కోంబ్ సాధారణ ఆటగాడేమీ కాదు. లోయర్ ఆర్డర్లో మాథ్యూ వేడ్‌కు తోడు ట్రావిశ్ హెడ్, స్టోయినిస్‌లు ధనాధన్ మోగించగలరు. బ్యాటింగ్ లైనప్ పరంగా భారత్‌తో ఆస్ట్రేలియా ఎక్కడా తీసిపోదు!. కానీ సమస్యంతా బౌలింగ్ బృందంతోనే. మిచెల్ స్టార్క్, జోశ్ హెజిల్వుడ్లు లేని కంగారూ బౌలింగ్ దాడికి కొరల్లేవనే చెప్పాలి. రిచర్డ్సన్, ఫాల్క్‌నర్, కమిన్స్‌లు ప్రతిభావంతులే కానీ వారికి భారత బ్యాట్స్‌మెన్‌కు సవాల్ విసిరే సత్తా లేదు. ఆడమ్ జంపా, అస్టన్ అగర్‌లతో కూడిన స్పిన్ విభాగం సైతం ప్రభావం చూపగలదని చెప్పలేం. బంతితో బలహీనంగా కనిపిస్తున్న కంగారూలు.. మైదానంలో కంగారు పడక తప్పదు.
లెక్క సరిచేయాలి : ఆస్ట్రేలియాతో వన్డే ముఖాముఖిలో భారత్ ఎంతో వెనుకంజలో ఉంది. భారత గడ్డపై కంగారూలతో ఇప్పటివరకూ ఏడు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడగా వాటిల్లో సైతం ఆసీస్‌దే ఆధిపత్యం. ఆస్ట్రేలియా నాల్గు సిరీస్‌లు గెల్చుకోగా, ఆతిథ్య భారత్ కేవలం మూడింటిలోనే విజయం సాధించింది. ఆసీస్ గత పర్యటనలోకి ఇక్కడికొచ్చినప్పుడు హోరాహోరీగా సాగిన వన్డే సిరీస్‌లో ధోనీసేన పైచేయి సాధించింది. ఈ సారీ సిరీస్ సాధించి సొంతగడ్డపై సిరీస్ విజయాలను సమం చేయాలని చూస్తున్నారు.
ఆసీస్‌తో భారత్ వన్డే ముఖాముఖి
మ్యా గె ఓ ఫ.తే
భారత్‌లో 51 21 25 05
ఆసీస్‌లో 48 11 35 02
తటస్థం 24 09 12 03
ఓవరాల్ 123 41 72 10
నోట్: మ్యా: మ్యాచులు, గె: గెలుపు, ఓ: ఓటమి, ఫ.తే: ఫలితం తేలనివి
వన్డే సిరీస్ షెడ్యూల్
తొలి వన్డే : సెప్టెంబర్ 17, చెన్నై
రెండో వన్డే : సెప్టెంబర్ 21, కోల్‌కత
మూడో వన్డే : సెప్టెంబర్ 24, ఇండోర్
నాల్గో వన్డే : సెప్టెంబర్ 28, బెంగళూర్
ఐదో వన్డే : అక్టోబర్ 1, నాగ్‌పూర్
అన్ని మ్యాచులు మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం