Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొరియా ఓపెన్ తుది పోరులో సింధు, నొజొమి ఢ
- సియోల్‌లో గ్లాస్గో ఫైనల్స్ రీ ఫైట్
ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం గ్లాస్గోలో తలపడిన పి.వి సింధు, నొజొమి ఒకుహరలు స్వల్ప విరామంలో మారో బిగ్ ఫైట్‌కు సై అంటున్నారు. తొలిసారి కొరియా ఓపెన్ ఫైనల్లోకి చేరిన తెలుగు తేజం సింధు.. జపాన్ షట్లర్‌పై ప్రతీకార విజయం కోసం ఎదురుచూస్తోంది. గ్లాస్గో చారిత్రాత్మక మారథాన్ ఫైనల్లో ఒకుహరకు తలొంచిన సింధు.. సియోల్ సూపర్ టైటిల్ వేటలో కసి తీర్చుకుంటుందా? చూడాలి మరి.
సియోల్ (దక్షిణ కొరియా)
సూపర్ ఫామ్‌లో ఉన్న స్టార్ షట్లర్ పి.వి సింధు కొరియా ఓపెన్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రతజం సాధించిన జోరుమీదున్న తెలుగు తేజం సియోల్‌లో సెమీస్ విజయంతో ఫైనల్లోకి ప్రవేశించింది. చైనా క్రీడాకారిణి హీ బింగ్ జియావోతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో 21-10, 17-21, 21-16తో గెలుపొందిన పి.వి సింధు తొలిసారి కొరియా ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 66 నిమిషాల ఆటలో బింగ్జియావోను చిత్తు చేసిన సింధు.. ఆమెతో ముఖాముఖి రికార్డును 4-5తో మెరుగుపర్చుకున్నది. ఇక శనివారం జరిగిన సెమీస్ సమరంలో సింధు దూకుడు కొనసాగించింది. తొలి గేమ్‌లో వరుసగా ఐదు పాయింట్లతో ఆధిపత్యం చాటుకున్న సింధు 5-0తో శుభారంభం చేసింది. చైనా షట్లర్ బింగ్ జియావో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 9-1, 13-4తో సింధు తిరుగులేని ఆధిక్యం సాధించింది. ద్వితియార్థంలోనూ సింధు మెరుపులు కొనసాగగా 19-10, 21-10తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నది. రెండో గేమ్‌లోనూ సింధు ఆరంభంలో రెచ్చిపోయింది. 4-3 నుంచి వరుసగా ఐదు పాయింట్లు కొల్లగొట్టి 9-3తో ముందంజ వేసింది. విరామ సమయానికి 11-6తో ఆధిక్యం నిలుపుకున్నది. సెకండ్ హాఫ్‌లో పుంజుకున్న బింగ్ జియావో 15-15తో తొలిసారి సింధుతో సమవుజ్జీగా నిలిచింది. 16-16 నుంచి వరుస పాయింట్లు సాధించింది. 20-16తో సింధును వెనక్కి నెట్టింది. దీంతో సింధు గేమ్ కోల్పోయింది. నిర్ణయాక మూడో గేమ్‌లో ఆరంభంలో సింధుతో బింగ్ జియావో గట్టిగానే పోటీపడింది. 1-1 నుంచి 3-3తో పాయింట్లు పంచుకున్నారు. 7-4తో సింధు ముందుకెళ్లినా, 9-9తో బింగ్జియావో స్కోరు సమం చేసింది. 11-9తో విరామ సమయానికి రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచిన సింధు తర్వాత రెచ్చిపోయింది. 16-12తో ముందంజ వేసింది. అదే జోరు కొనసాగించిన సింధు 21-16తో మూడో గేమ్‌ను, ఫైనల్లో ప్లేస్‌ను కైవసం చేసుకున్నది.
మళ్లీ సూపర్ ఫైట్ !
రియో నుంచి కరొలినా మారిన్ (స్పెయిన్) తో సింధు షటిల్ వైరం అభిమానులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు గ్లాస్గో ప్రపంచ చాంపియన్‌షిప్స్ తర్వాత నొజొమి ఒకుహర సైతం సింధుతో ప్రియ శత్రుత్వం నడుపుతోంది. గ్లాస్గో మారథాన్ బ్యాడ్మింటన్ అభిమానులు ఇప్పట్లో మరిచిపోలేరు. ప్రతి పాయింట్ కోసం సుదీర్ఘ ర్యాలీల పాటు ఒకుహర, సింధు పోరాడిన తీరు అసమానం. రెండు వారాల వ్యవధిలోనే ఒకుహర, సింధులు మరోసారి ముఖాముఖి కాలుదువ్వారు. నేడు జరిగే ఫైనల్లో కొరియా సూపర్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు.
సెమీస్‌లో ఎవరెలా
సింధు బింగ్జియావో
05 వరుస పాయింట్లు 04
02 గేమ్ పాయింట్లు 02
59 నెగ్గిన పాయింట్లు 47
106 మొత్తం పాయింట్లు 106
మ్యాచ్ సమయం : 66 నిమిషాలు
ఫలితం : 21-10, 17-21, 21-16 (సింధు-బింగ్జియావో)