Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిషేధానంతరం తొలి టైటిల్ సాధించిన షరపోవా
- ఫైనల్లో 2-0తో సబలెంకాపై గెలుపు
సుమారు 15 నెలల క్రితం టెన్నిస్ కోర్టులో అడుగిడిన రష్యా భామ టియాంజన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో సత్తా చాటింది. డోప్ నిషేధం ముగిసాక పాల్గొన్న గత ఆరు టోర్నీల్లో వరుసగా విఫలమైంది.. ఐదు గ్రాండ్ స్లామ్‌లు అందుకున్న మాజీ నెంబర్ వన్ యుఎస్ ఓపెన్‌లో నిరాశపర్చటంతో ఇక ఆమె పని అయిపోయిందనుకున్నారు. కానీ,
తనలో చేవ తగ్గలేదని మాజీ నెంబర్‌వన్ షరపోవా నిరూపించుకున్నది.
టియాంజన్ : అద్భుత పోరాట పటిమతో ఆకట్టుకున్న రష్యా దిగ్గజం టియాంజన్ టైటిల్ విజయంతో అలరించింది. ఆదివారం జరిగిన ఫైనల్ సమరంలో 2-0తో బెలారస్ చిన్నది ఆర్యనా సబలెంకాపై గెలిచి విమర్శకుల నోళ్లు మూయించింది. డోప్ బ్యాన్ తర్వాత షరపోవా ఫైనల్ చేరటం ఇదే తొలిసారి కాగా ఫామ్‌లోకొచ్చిన టెన్నిస్ స్టార్ తుది పోరులో మెరవ టంతో అభిమానుల ఆనందా నికి అవధులు లేకుండా పోయాయి. రెండు గంటలకు పైగా సాగిన టియాంజన్ టైటిల్ సమరం వీక్షకులను కట్టిపడేసింది. తొలి సెట్లో 1-0తో షరపోవా శుభారంభం చేసింది. అయితే సబలెంకా రెండు సార్లు షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-1తో భారీ ఆధిక్యం అందుకున్నది. పుంజుకున్న షరపోవా 4-4తో స్కోరు సమం చేయగా, మరోసారి సబలెంకా 5-4తో ఆధిక్యంలో నిలిచింది. కానీ బెలారస్ కుర్రదాన్ని అక్కడే కట్టడి చేసిన షరపోవా 7-5తో తొలి సెట్‌ను కైవసం చేసుకున్నది. రెండో సెట్లో తొలుత రెండు సర్వ్‌లు కోల్పోయిన షరపోవా 1-5తో వెనుకబడింది. ఆపై ప్రత్యర్థి సర్వీస్‌ను మూడు సార్లు బ్రేక్ చేసి వరుసగా ఐడు పాయింట్లు నెగ్గి 6-5తో పైచేయి సాధించింది. సబలెంకా వెనక్కి తగ్గకుండా 6-7తో పోరును టై బ్రేకర్‌కు తీసుకెళ్ళింది. టై బ్రేకర్‌లో ఆధిక్యం వరుసగా చేతులు మారుతూ ఉండటంతో ఆట రక్తికట్టింది. 8-8తో సమవుజ్జీలుగా నిలిచిన తరుణంలో సబలెంకా సర్వ్ బ్రేక్ చేసిన షరపోవా వరుసగా రెండు పాయింట్లు కొల్లగొట్టి 10-8తో టై బ్రేకర్ నెగ్గింది. మ్యాచ్ మొత్తంలో కేవలం మూడు డబుల్ ఫాల్ట్స్ చేసి, ఏడు ఏస్‌లు సంధించింది. టోర్నీలో అన్ని మ్యాచ్‌లను వరుస సెట్లలో నెగ్గిన షరపోవా టైటిల్ పోరును సైతం రెండు సెట్లలోనే ముగించి టియాంజన్ ఓపెన్ విజేతగా నిలిచింది.