Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2013 రూట్‌తో గొడవపై వార్నర్
- స్టోక్స్‌పై ఇంగ్లాండ్ వైఖరేంటోనని వ్యాఖ్య
- 2013 లార్డ్స్ టెస్టులో రూట్‌తో వార్నర్ కరచాలనం
మెల్బోర్న్: ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ప్రస్తావన వచ్చినప్పుడు విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్ సహా జోరు రూట్లతో పాటు డెవిడ్ వార్నర్‌పై చర్చ జరగటం పరిపాటి. అన్ని దేశాల్లో, విభిన్న పరిస్థితుల్లోనూ వార్నర్ తనెంటో ప్రపంచానికి చాటిచెప్పాడు. ప్రస్తుతం డెవిడ్ వార్నర్ అంటే అతడి బ్యాటింగ్ విన్యాసాలే గుర్తొస్తాయి!. కానీ కొంత కాలం క్రితం పరిస్థితి పూర్తిగా భిన్నం. మైదానం లోపలా, వెలుపలా వార్నర్ నోటికి అడ్డూ అదుపూ ఉండేది కాదు. భారత క్రికెటర్లతోనూ వార్నర్ అగ్లీ అరుపులు అభిమానులకు గుర్తుండేఉంటాయి. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు వార్నర్ మాటల యుద్ధం తాకిడి తెలిసినవారే. వార్నర్ ఆసీస్ జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో కంగారూలు స్లెడ్జింగ్‌లో పండిపోయారు. స్లిప్స్‌లో కాచుకునే వార్నర్, సీనియర్లతో కలిసి స్లెడ్జింగ్ శృతి కలిపేవాడు. అయితే, అప్పట్లో ఇప్పుడున్నట్టు మైక్రో మైక్‌లు లేకపోవటంతో ఆటగాళ్లు మాటలయుద్ధంలో ఎంతటి తీవ్రమైన పదాలు వాడారో తెలిసేది కాదు. దీంతోనే ఎందరో ఐసీసీ క్రమశిక్షణ చర్యల నుంచి తప్పించుకున్నారు. మైదానంలో స్లెడ్జింగ్‌కు రుచిమరిగిన వార్నర్, 2013లో యాషెస్ సిరీస్ నిమిత్తం ఇంగ్లాండ్‌కు వెళ్లినప్పుడు దారుణ తప్పిదానికి పాల్పడ్డాడు. బర్మింగ్‌హామ్‌లోని వాకబౌట్ బార్లో ప్రస్తుత ఇంగ్లాండ్ కెప్టెన్ జోరు రూట్‌తో కలిసి తప్పతాగిన వార్నర్.. మత్తులో రూట్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. 2013లో వార్నర్ బార్ గొడవ యాషెస్ సిరీస్‌కు ముందు నిప్పు రాజేసింది. ఇంగ్లీష్ మీడియా ఈ ఉదంతంపై దుమ్మెత్తిపోసింది. దీంతో కెప్టెన్ మైకల్ క్లార్క్‌తో కలిసి డెవిడ్ వార్నర్ మీడియా ముందు బహిరంగ క్షమాపణలు చెప్పుకున్నాడు. యాషెస్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లకే కాకుండా తొలి రెండు టెస్టులకూ జట్టులో చోటు కోల్పోయాడు. ఈ సంఘటన తర్వాత మద్యం మానేసిన వార్నర్ యాషెస్ విజయాన్ని కరీబియన్ దీవుల్లో గ్రీన్ టీ తాగుతూ సంబురాలు చేసుకున్నాడు. మద్యంపై స్వీయ నియంత్రణతో పాటు మాటల తుటాల్లోనూ జాగ్రత్తలు తీసుకున్నాడు!. ఇప్పటికీ ఇంగ్లాండ్‌తో ముఖాముఖి అంటే వార్నర్‌లో మునుపటి వాడీవేడీ కనిపిస్తున్నా, అప్పట్లో అతడి రూటే సెపరేటు!. ఈ సంఘటన జరిగి నాలుగేండ్లు గడుస్తున్నా, వార్నర్ ఇప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తటం వెనుక మళ్లీ ఇంగ్లాండ్‌తో ముఖాముఖి పోరాటమే కారణం. ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఓ నైట్‌క్లబ్ గొడవలో విచారణ ఎదుర్కొంటున్నాడు. స్టోక్స్ గొడవకు సంబంధించిన వీడియో ఫుటేజీ బహిర్గతమైంది. అందులో ఇద్దరు వ్యక్తులపై స్టోక్స్ పంచ్‌లు విసురుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయినా, ఈ ఘటనపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వార్నర్ ఆశించిన తీవ్రమైన నిర్ణయాలేమీ తీసుకోలేదు!. ఇంకా దర్యాప్తు నివేదిక కోసం ఎదురుచూస్తోంది. క్లీన్చిట్ తెచ్చుకునే వరకూ వేచిచూసే ధోరణిలో కనిపిస్తోంది. జోరు రూట్‌తో 2013 సంఘటనను పోలీఉన్న ఘటన కావటంతో వార్నర్ యాషెస్ సిరీస్ అదనుగా స్టోక్స్‌పై, ఇంగ్లాండ్ బోర్డుపై బాణాలు విసురుతున్నాడు. స్టోక్స్‌తో పోల్చుకుంటే ఎంతో సూక్ష్మ తప్పిదానికే ఎక్కువ శిక్ష అనుభవించానని వార్నర్ వాపోతున్నాడు. మరి, స్టోక్స్ విషయంలో ఏం జరుగనుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని అంటున్నాడు.
' నేను బెన్ స్టోక్స్ వీడియో ఫుటేజీ చూశాను. దానితో పోల్చుకుంటే నాదెంతో అతి సూక్షమైన తప్పిదమని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అప్పట్లో నాపై వేటు వేసినందుకు క్రికెట్ ఆస్ట్రేలియా పశ్చాత్తాపం చెందుతుందా లేదా అనేది అనవసరం. నిజానికి రూట్‌తో ఘటనకు సంబంధించి కనీసం వీడియో ఆధారం కూడా లేదు. అయినా, నన్ను శిక్షించారు' అని డెవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. బర్మింగ్‌హామ్ బార్లో జోరు రూట్ ముస్లింలకు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకే అతడితో గొడవ పడ్డానని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో వార్నర్ ఒప్పుకున్నాడు. వార్నర్, రూట్లతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్టులోని కొందరు ఆటగాళ్లు సైతం ఆ సమయంలో బార్లోనే ఉన్నారు. గొడవ మరింత ముదరకుండా వారిని శాంతింపచేశారు. సస్పెన్షన్ ముగిసిన తర్వాత లార్డ్స్ మ్యాచ్‌లో రూట్‌కు కరచాలనం చేసిన వార్నర్ సాధారణ పరిస్థితులకు తొలి అడుగు వేశాడు.
స్టోక్స్ మళ్లీ రా..!
బార్ గొడవ మరిచిపోయి వివాహం చేసుకున్నా, బెన్ స్టోక్స్‌ను ఆ సంఘటన వీడటం లేదు. యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు నుంచి తొలగించబడిన స్టోక్స్‌ను విచారణ కోసం మరోసారి రావాలని పోలీ సులు నోటీసులు పంపారు. ఇప్పటికే ఓమారి పోలీసుల ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చిన స్టోక్స్, మరోసారి ఘటన వివరాలను పోలీసులతో సవివరంగా పంచుకోవాల్సి ఉన్నది. ఈ గొడవ కారణంగా బెన్ స్టోక్స్ బ్యాట్ లోగో స్పాన్సర్ 'న్యూ బాలెన్స్' తన కాంట్రాక్టును రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.