Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ క్రీడా విభాగం
ఆడుతున్నది శ్రీలంకతోనే అయినా, కోహ్లిసేన సన్నద్ధత దక్షిణాఫ్రికా కోసమే. ప్రాక్టీస్ సెషన్లో సాధన దగ్గర్నుంచి తుది జట్టు కూర్పు వరకూ అంతా సఫారీ పర్యటన దృష్టిలో ఉంచు కునే జరుగుతున్నాయి!. అందుకే, ఈడెన్ గార్డెన్స్‌లో కోరి మరీ పచ్చిక పిచ్‌ను సిద్ధం చేయించుకున్నారు. సహజంగానే ఈడెన్ పేసర్లకు అనుకూలమైనా, శ్రీలంకతో టెస్టుకు అది స్వర్గధామమైంది. పూర్తిగా పచ్చికతో కనిపిస్తున్న పిచ్‌కు, వాతావరణ పరిస్థితులు తోడయ్యాయి. దీంతో లంక పేసర్ సురంగ లక్మల్ ఆరు ఓవర్లలోనే మూడు వికెట్లు కూల్చాడు. అయితే, ఇదే పరిస్థితులు సఫారీ పర్యటనలో ఊహించుకుంటే? జోహ్నెస్బర్గ్లోని వాండరర్స్ పిచ్‌పై డెల్ స్టెయిన్, ఫిలాండర్, రబాడాలతో కూడిన పేస్ దళం బంతులేస్తే?!. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు కోహ్లిసేన సిద్ధంగా ఉన్నదా? అనేది ఆసక్తిరేపుతోంది.
శ్రీలంకతో ఇటీవల వరుసగా ఆడటం, వారిపై ఎదురులేని విజయాలు నమోదు చేయటంతో అసలు లంకేయులతో పోరు మునుపటి ఉత్కంఠ లేదు. లంక సైతం బలహీనంగా ఉండటంతో మనోళ్లు కూడా పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. కానీ సఫారీ సన్నద్ధతలో భాగంగా పేస్ పిచ్‌పై ఆడటం, ఈడెన్ టెస్టును రక్తి కట్టిస్తోంది. లక్మల్ ప్రదర్శన అమోఘమైనా, అతడు ఆ స్థాయి పేసర్ కాదు. దీంతో రానున్న దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లిసేన ప్రదర్శన ఏ విధంగా ఉండబోతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఓపెనర్లు రాహుల్, ధావన్‌లతో పాటు కెప్టెన్ కోహ్లి సైతం మంచి బంతులకే వికెట్లు జారవిడుచుకున్నారు. బ్యాట్స్‌మెన్ తప్పిదం కంటే బౌలర్ నైపుణ్యమే ఇందులో కనిపిస్తోంది!. జట్టులో చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మెన్. ఈ ఇద్దరూ ప్రస్తుతం అజేయంగా క్రీజులో ఉన్నారు. పుజారా 43 బంతుల ఇన్నింగ్స్‌లో లంక సీమర్లు అతడినీ కుదురుగా ఆడనీయలేదు. కానీ పుజారా ఏకాగ్రతను దెబ్బతీయటంలో లంక సఫలం కాలేదు. రహానె, పుజారా తర్వాత స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేరు. జడేజా, సాహాలు ఉన్నా.. వారిపై నమ్మకం ఉంచలేం. దీంతో తొలి ఇన్నింగ్స్ భారమంతా పుజారా, రహానెలపైనే ఉన్నది. పచ్చిక పిచ్‌పై ఈడెన్‌లో కోహ్లిసేనకు ఎదురైన ఈ చేదు అనుభవం నిజానికి మంచి పాఠం. ఎందుకంటే ఇదే సీన్ వాండర్సర్లో పునారవృతం అయితే, అది గుణ పాఠమయ్యేది!. నాణ్యమైన పేసర్లను ఎదుర్కొవటంలో, పచ్చికతో కూడిన పిచ్‌లపై పరుగులు చేయటంలో కోహ్లిసేన సన్నాహకం ఆహ్వానించదగినదే. ఈడెన్‌లో పచ్చిక పిచ్ ఎదురైంది కాబట్టే, వాస్తవ పరిస్థితి తెలిసొచ్చింది. ఈ అనుభవంతోనైనా నాణ్యమైన పేస్‌ను ఎదుర్కొనేందుకు కోహ్లిసేన కొత్త అస్త్రాలు సిద్ధం చేసుకునే అవకాశం లభించింది.