Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2015 శ్రీలంక పర్యటనలో కోహ్లిసేన. తొలి రెండు టెస్టులు ముగిసేసరికి 1-1తో సిరీస్ సమం. నిర్ణయాత్మక మూడో టెస్టు కొలంబోలో. భారత్ తొలి ఇన్నింగ్స్.. కెఎల్ రాహుల్ (2), అజింక్య రహానె (8), విరాట్ కోహ్లి (18), రోహిత్ శర్మ (28) వరుసగా విఫలమయ్యారు. లంక సీమర్ దమ్మిక ప్రసాద్ నాల్గు వికెట్లతో విజృంభించాడు. సిరీస్ ప్రమాదంలో టీమ్ ఇండియా. ఈ తరుణంలో స్ఫూర్తిదాయక శతకంతో (145) భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు, సిరీస్ విజయాన్ని అందించాడు. తాజాగా ఈడెన్‌గార్డెన్స్ టెస్టులోనూ కెఎల్ రాహుల్ (0), ధావన్ (8), రహానె (4), కోహ్లి (0)లు విఫలమైనా, ప్రతికూల పరిస్థితుల్లోనూ మళ్లీ అతనొక్కడే నిలబడ్డాడు. పేసర్లను ఎదురొడ్డి భారత ఇన్నింగ్స్‌ను నిలబెడుతున్నాడు. అతడే టెస్టు
స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా.
* శ్రీనివాస్ దాస్ మంతటి
ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన వారు పరుగుల వరద పారించినా, వచ్చిన వారు వచ్చినట్టే వెనక్కి మళ్లినా అతడి బ్యాటింగ్ శైలి, అతడి ఏకాగ్రత ఏమాత్రం చెదరవు. టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్ర పడినా, కాసుల లీగ్ ఐపీఎల్లో ఏ ప్రాంఛైజీ తీసుకునేందుకు మొగ్గుచూపకపోయినా, ఐదు రోజుల ఆటలో అతడో ఆణిముత్యం. వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌ల తర్వాత భారత క్రికెట్‌కు దక్కిన అత్యంత విలువైన ఆటగాడు చటేశ్వర్ పుజారా. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు విపరీతమైన క్రేజ్ నెలకొన్న ఆధునిక క్రికెట్లో.. సంప్రదాయ షాట్లు, క్రికెటింగ్ నైపుణ్యం, అత్యంత దుర్బేధ్యమైన డిఫెన్స్ పుజారాను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. తాజాగా ఈడెన్‌గార్డెన్స్ టెస్టులో పుజారా స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ అతడిని మరో స్థాయికి తీసుకెళ్లింది. గణాంకాలు మాత్రమే ఓ ఆటగాడి ఇన్నింగ్స్, విలువ ఎప్పటికీ చెప్పలేవు. పరుగుల పరంగా పుజారా ఈడెన్‌లో చేసింది నలభై ఏడే అయినా, వాటి విలువ అమూల్యం. అత్యంత ప్రతికూల, గడ్డు పరిస్థితుల్లో పుజారా కూల్ ఇన్నింగ్స్ విమర్శకులను సైతం మెప్పిస్తోంది. ఈడెన్ టెస్టులో టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌పై ఇంకా ఆశలు పెట్టుకుందీ అంటే అందుకు ఏకైక కారణం క్రీజులో పుజారా అజేయంగా ఉండటమే!.
పనికొచ్చిన కౌంటీ అనుభవం
భారత క్రికెటర్లలో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో క్రమం తప్పకుండా ఆడుతున్న బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా ఒక్కడే. పచ్చికతో కూడిన ఇంగ్లీష్ పిచ్‌లు, అక్కడి అతి శీతల వాతావరణ పరిస్థితులు పరుగుల వేటలో బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెడతాయి. భిన్నమైన పరిస్థితుల్లో ఆడిన అనుభవం సైతం పుజారాకు జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగినప్పుడు పనికొస్తుంది. నిజానికి, ప్రస్తుతం ఈడెన్‌గార్డెన్స్‌లో విదేశీ పిచ్‌ల పరిస్థితే నెలకొన్నది. కోహ్లిసేన ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలలో ఇంకా కాలుమోపలేదు. ఆస్ట్రేలియాలో కోహ్లి టన్నుల కొద్ది పరుగులు చేసినా, నిజానికి కంగారూ పిచ్‌లు కొద్దికాలంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారిపోయాయి. దీంతో అసలు సిసలు పరీక్ష ఎదురుకాలేదు. రానున్న దక్షిణాఫ్రికా పర్యటన కోహ్లిసేనకు నిజమైన పరీక్ష పెట్టనున్నది. కానీ ఇప్పుడే ఈడెన్‌లో మనోళ్లు టీజర్ చూసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి సాంకేతికత, డిఫెన్స్ అవసరమో పుజారా ఇన్నింగ్స్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. లైన్ అండ్ లెంగ్త్‌ను అంచాన వేసి, ముందుగానే ఫుట్‌వర్క్‌ను సరిచేసుకుంటున్న పుజారా.. సీమర్లను అలవోకగా ఆడేస్తున్నాడు. అదే సమయంలో పేసర్లు సంధించిన మంచి బంతుల్ని గౌరవిస్తున్నాడు. పరుగులు చేయగల బంతులనే ఎంచుకుని మరీ జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నాడు. ఈడెన్ వంటి పరిస్థితులకు త్వరగా అలవాటు పడకపోవటం లేదా టెక్నిక్ లోపమా అనేది భారత్ ఆలోచన చేయాలి. నిజానికి, ఇటువంటి పిచ్‌పై పై రెండూ భారత బ్యాట్స్‌మెన్‌కూ సమస్యే. జట్టులోని చాలా మంది నెట్స్‌లో పచ్చిక పిచ్‌పై సాధన చేస్తే సరిపోతుంది, విదేశాల్లో అడేందుకు సన్నద్ధ్దత అవుతుందని భావిస్తున్నారు. కానీ నెట్స్‌లో ఎంత చెమటోడ్చినా...మ్యాచ్ ప్రాక్టీస్‌లో గడించిన అనుభవం రాదు. ప్రతికూల పరిస్థితుల్లో సవాళ్లను ఎదుర్కొనటంలోనే ఆటగాడు రాటుదేలేందుకు ఆస్కారం ఉంటుంది. పుజారా ఈడెన్‌లో చూపిన డిఫెన్స్ అత్యుత్తమం. తాజా మ్యాచ్‌లో శనక వేసిన ఫుల్ లెంగ్త్ బంతుల్ని రహానె సరిగా అర్ధం చేసుకోలేదు. విపరీమైన స్వింగ్, సీమ్ పిచ్ నుంచి లభిస్తుంటే శనక రెచ్చిపోయి బంతులేశాడు. శనక ఫుల్ లెంగ్త్ బంతిని రహానె బ్యాట్ లోపలి కోణంతో ఆడేందుకు యత్నించి, వికెట్ల వెనకాల క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. ఇవే బంతుల్ని పుజారా భిన్నంగా ఆడాడు. శనక ఊరిస్తూ వేసిన ఫుల్ లెంగ్త్ బంతుల్ని, బ్యాక్వార్డ్ పాయింట్ దిశగా డ్రైవ్ షాట్‌తో బౌండరీలు సాధించాడు.
భిన్న పరిస్థితుల్లో నాణ్యమైన పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొవటంలో సాంకేతికతంగా బలంగా ఉండటంతో పాటు షాట్ల ఎంపిక అత్యంత కీలకం. ఈ విషయంలో పుజారా ఎంతో ముందుండగా, జట్టులోని మిగతా ఆటగాళ్లు చాలా వెనకబడ్డారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఈడెన్‌కు మించిన సవాళ్లు ఎదురుచూస్తున్న వేళ.. కోహ్లిసేన పరిస్థితులకు అలవాటు పడటంతో పాటు సాంకేతికతంగానూ మెరుగవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.