Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 49 పరుగుల ఆధిక్యంలో భారత్
- రాణించిన ధావన్, రాహుల్
- రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 171/1
- తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 294/10
- నేడే ఈడెన్ టెస్టుకు ఆఖరు రోజు
ఈడెన్‌లో కచ్చితంగా ఏదో ఒక జట్టుకు గెలుపు తథ్యం, ఇది నిన్నటి మాట!.
రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు శిఖర్ ధావన్ (94), కెఎల్ రాహుల్ (73) మెరుపులతో అంచనా పూర్తిగా తప్పింది. స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించిన ధావన్, రాహుల్ భారత్‌కు 122 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటు భర్తీ చేయటంతో పాటు మరో 49 పరుగుల ఆధిక్యాన్ని కట్టబెట్టారు. ఈడెన్ టెస్టుకు నేడు ఆఖరు రోజు కావటంతో ఫలితం తేలటం అసాధ్యమే అనిపిస్తోంది!. మూడు సెషన్ల ఆటలో లంకేయులకు తగిన లక్ష్యాన్ని నిర్దేశించటంతో పాటు ప్రత్యర్థి శిబిరంలో 10 వికెట్లూ పడగొట్టాలి. ఆఖరు రోజు పిచ్ అనూహ్యంగా స్పిన్‌కు అనుకూలిస్తే.. నాటకీయ పరిణామాలు ఆశించవచ్చు!.
నవతెలంగాణ-కోల్‌కత
ఓపెనర్లు శిఖర్ ధావన్ (94, 116 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెఎల్ రాహుల్ (73 బ్యాటింగ్, 113 బంతుల్లో 8 ఫోర్లు) ధాటిగా ఆడటంతో ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంక ఆధిపత్యానికి చెక్ పడింది!. భారీ తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్ పట్టిన టీమ్ ఇండియాకు ఓపెనర్లు 166 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో కోహ్లిసేన 49 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సెంచరీ ముంగిట శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయినా... మరో ఓపెనర్ రాహుల్‌కు తోడు టెస్టు స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా (2) క్రీజులో కొనసాగుతున్నాడు. 171/1తో ఉన్న టీమ్ ఇండియా.. నేడు ఉదయం సెషన్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి, శ్రీలంకను ఛేదనకు ఆహ్వానిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు!. ఎందుకంటే, తొలి మూడు రోజుల్లో (నాల్గో రోజు తొలి రెండు సెషన్లు సైతం) వెనుకంజలో నిలిచినా కోహ్లిసేన ఏ దశలోనూ సానుకూల దృక్పథం కోల్పోలేదు. అందువల్లే రెండో ఇన్నింగ్స్‌లో స్వేచ్ఛగా ఆడి పరుగులు పిండుకున్నది! ఓవర్‌నైట్ స్కోరు 165/4తో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక.. లోయర్ ఆర్డర్ సాయంతో భారీ స్కోరు చేసింది. చండిమాల్ (28), డిక్వెల్లా (35) త్వరగా నిష్క్రమించినా..రంగన హెరాత్ (67, 105 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో లంక ఆధిక్యాన్ని భారీగా పెంచాడు. షమి, భువి చెరో నాల్గు వికెట్లతో మెరవటంతో శ్రీలంక 294 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.
ఓపెనర్లు అదుర్స్ : ఈడెన్‌లో కాస్త ఎండకాచిన వేళ.. పిచ్ నుంచి బ్యాట్స్‌మెన్‌కు సహకారం లభించింది. ఈ విషయం శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్నప్పుడే అర్థమైంది. ఇదే అవకాశాన్ని సొమ్ముచేసుకున్న భారత ఓపెనర్లు దుమ్మురేపారు. తొలి ఇన్నింగ్‌లో అలవోకగా వికెట్ చేజార్చుకున్నది వీరేనా అనుకునేంతగా.. శిఖర్ ధావన్ (94), కెఎల్ రాహుల్ (73) రెచ్చిపోయారు. తొలుత రాహుల్ వరుస బౌండరీలతో కదం తొక్కగా.. గబ్బర్ కాస్త సమయం తీసుకున్నాడు. ఏడు ఫోర్లతో 65 బంతుల్లో రాహుల్ అర్ధ సెంచరీ సాధించగా, 74 బంతుల్లో ధావన్ కొట్టాడు. కానీ 50 మార్క్ దాటక ధావన్ ఎక్కడా ఆగలేదు. ఇదే సమయంలో స్పిన్నర్ రంగన హెరాత్ బంతి అందుకోవటంతో శిఖర్ శివమెత్తాడు. రెండు భారీ సిక్సర్లతో విజృంభించాడు. జోరుమీదున్న ధావన్ వేగంగా పరుగులు రాబట్టగా, మరో ఎండ్‌లో రాహుల్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ సహకరించాడు. సెంచరీకి మరో ఆరు పరుగుల దూరంలో ఉండగా... శనక బంతికి వికెట్ల వెనకాల అవుట్ కాగా ధావన్ నిష్క్రమించాడు. పుజారా (2) మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించాడు. సాయంత్రం 4.30 గంటలకు వెలుతురు లేమితో వరుసగా నాల్గో రోజూ ఆటను ముందుగానే నిలిపివేశారు.
వాహ్.. హెరాత్! : ఉదయం సెషన్లో పిచ్ సహకారంతో లంకేయులను సాధ్యమైనంత తక్కువ స్కోరుకే పరిమితం చేయాలనుకుంటే, లోయర్ ఆర్డర్ మాత్రం అద్భుతాలతో కోహ్లిసేనను నిరాశపరిచింది. కెప్టెన్ చండిమాల్ (28), వికెట్ కీపర్ డిక్వెల్లా (35)లను త్వరగా పంపించినా, రంగన హెరాత్ (67) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. తొమ్మిది బౌండరీలు సాధించిన హెరాత్.. 83 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఇతడికి లక్మల్ (16) తోడుగా నిలిచాడు. దీంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో ఓ 50 పరుగులు ఎక్కువే చేయగల్గింది!.
భారత్ తొలి ఇన్నింగ్స్ : 172 ఆలౌట్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : సమరవిక్రమ (సి) సాహా (బి) భువి 23, కరుణరత్నె (ఎల్బీ) భువి 8, తిరిమానె (సి) కోహ్లి (బి) ఉమేశ్ 51, మాథ్యూస్ (సి) రాహుల్ (బి) ఉమేశ్ 52, చండిమాల్ (సి) సాహా (బి) షమి 28, డిక్వెల్లా (సి) కోహ్లి (బి) షమి 35, శనక (ఎల్బీ) కుమార్ 0, పెరీరా (సి) సాహా (బి) షమి 5, హెరాత్ (సి) షమి (బి) భువి 67, లక్మల్ (బి) షమి 16, గమగె నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 09, మొత్తం : (83.4 ఓవర్లలో ఆలౌట్) 294.
వికెట్ల పతనం : 1-29, 2-34, 3-133, 4-138, 5-200, 6-201, 7-201, 8-244, 9-290, 10-294.
బౌలింగ్ : భువి 27-5-88-4, షమి 26.3-5-100-4, ఉమేశ్ 20-1-79-2, అశ్విన్ 8-2-13-0, కోహ్లి 1.1-0-5-0, జడేజా 1-0-1-0.
భారత్ రెండో ఇన్నింగ్స్ :రాహుల్ బ్యాటింగ్ 73, శిఖర్ ధావన్ (సి) డిక్వెల్లా (బి) శనక 94, పుజారా బ్యాటింగ్ 2, ఎక్స్‌ట్రాలు : 02, మొత్తం : (39.3 ఓవర్లలో 1 వికెట్) 171.
వికెట్ల పతనం : 1-166.
బౌలింగ్ : లక్మల్ 8-0-29-0, గమగె 9-0-47-0, శనక 9.3-1-29-1, పెరీరా 10-1-41-0, హెరాత్ 3-0-25-0.