Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సయాక సటోపై 2-0తో అలవోక విజయం
- కిదాంబి ప్లే ఆఫ్ ఆశలు ఖతం
- ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్
తెలుగుతేజం పి.వి సింధు ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో అదరగొడుతున్నది. గ్రూప్ దశ రెండో పోరులో జపాన్ అమ్మాయి సయాక సటోపై వరుస సెట్లలో గెలుపొందింది. రెండు విజయాలతో అగ్ర శ్రేణి షట్లర్ల పోరులో గ్రూప్ టాప్‌లో నిలిచింది. నేడు నామమాత్రపు తుది గ్రూప్ మ్యాచ్ ఆడనున్న సింధుకు సెమీస్ బెర్త్ ఖాయమైంది. పురుషుల సర్క్యూట్లో చో తిన్ చెన్ చేతిలో పోరాడి ఓడిన కిదాంబి సెమీస్ ఆశలు వదులుకున్నాడు.
నవతెలంగాణ-దుబాయ్
భారత అగ్ర శ్రేణి షట్లర్, ఒలింపిక్ రజత పతక విజేత సింధు దుబారులో దూకుడు కొనసాగిస్తోంది. గురువారం జరిగిన గ్రూప్ పోరులో సయాక సటో (జపాన్)ను 21-13, 21-12తో మట్టి కరిపించింది. తొలి పోరులో బింగ్జియావోపై గెలవటానికి కాస్త శ్రమపడిన సింధు, రెండో మ్యాచ్‌లో జపాన్ కుర్ర దాన్ని అలవోకగా ఓడించేసింది. పురుషుల సింగిల్స్ భారత ఆశలు భారం మోసిన కిదాంబి శ్రీకాంత్‌కు రెండో పోరులోనే నిరాశే ఎదురైంది. గాయాల నుంచి కోలుకున్నాక నేరుగా సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ఆడుతోన్న కిదాంబి ఫామ్‌లోనే ఉన్నా.. వరుసగా రెండు పరాజయాలతో ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకున్నాడు. గురువారం చైనీస్ తైపీ ఆటగాడు చో తిన్ చెన్ చేతిలో 18-21, 18-21తో పోరాడి ఓడాడు. ఆరంభ పోరులో సైతం ప్రపంచ నంబర్ వన్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో ఓడిన కిదాంబి నేడు నామమాత్రపు పోరులో ఆల్ ఇంగ్లాండ్ ఫైనలిస్ట్ షి యుకీ (చైనా)తో తలపడనున్నాడు.
అద్భుత ఫామ్‌లో ఉన్న హైదరాబాదీ షట్లర్ సింధు తొలుత నెమ్మదిగా ఆడినా, ఆపై వేగం పెంచింది. కోర్టు నలుమూలలా షాట్లు సంధిస్తూ, ప్రత్యర్థిని పరుగుల పెట్టించింది. 0-2తో గేమ్ ఆరంభించిన సింధు 3-3 వద్ద స్కోరు సమం చేశాక జోరు పెంచింది. సయా కను కట్టడి చేసి 7-3తో ఆధిక్యం అందు కున్నది. 8-10తో ఓ దశలో సయాక పోటీనిచ్చే ప్రయత్నం చేసినా సింధు ధాటికి నిలువలేక పోయింది. 21-13తో తొలి గేమ్ నెగ్గిన సింధు రెండో సెట్‌ను సైతం 0-1తో మొదలెట్టింది. 1-1 స్కోరు తర్వాత మంచి నీళ్ల ప్రాయింగా ఆడింది. 11-7 ఆధిక్యం సింధు దూకుడుతో 19-7గా మారింది. 21-12తో రెండో సెట్ నెగ్గిన సింధు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్నది. నేడు తుది గ్రూప్ పోరులో అకానె యమగూచి (జపాన్)తో తలపడనున్నది.