Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 403/10
- 200 పరుగుల వెనుకంజలో ఆసీస్
- యాషెస్ మూడో టెస్టు రెండో రోజు
పెర్త్్ : వాకా మైదానంలో చివరిదైన మూడో యాషెస్ టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. జానీ బెయిర్‌స్టో (119, 215 బంతుల్లో 18 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కగా భారీ ఆధిక్యం దిశగా దూసుకొచ్చిన ఇంగ్లాండ్.. తోక వికెట్లు వరుసగా కూలటంతో రెండో రోజు 403 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఆసీస్ ఓపెనర్లను స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. కానీ కంగారూల కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అజేయంగా సెంచరీవైపు పయనిస్తున్నాడు. ప్రస్తుతం 200 పరుగుల వెనుకంజలో తొలి ఇన్నింగ్స్ కొనసాగిస్తోన్న ఆసీస్ నేడు ఇదే జోరు కొనసాగిస్తే లక్ష్యాన్ని ఛేదించటమే కాక ఆధిక్యం చేజిక్కించుకునే అవకాశమున్నది.
గురువారం టెస్టుల్లో తన తొలి శతకం నమోదు చేసిన డావిడ్ మలన్, బెయిర్‌స్టో జతగా రెండో రోజు ఆట కొనసాగించాడు. ఆసీస్ బౌలర్లు ఆది నుంచే చెలరేగటంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. 140 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డావిడ్ మలన్.. స్పిన్నర్ నాథన్ లైయన్ బౌలింగ్‌లో హ్యాండ్స్కోంబ్కు క్యాచ్ ఇచ్చి క్రీజును వీడాడు. మరో పక్క వికెట్ కీపర్ బెయిర్ స్టో (119) సెంచరీ మార్కు దాటేశాడు. యాషెస్‌లో తొలి శతకం బాదిన బెయిర్‌స్టో, మలన్‌తో కలిసి 237 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే, మలన్ వికెట్‌తో వేగం పుంజుకున్న ఆసీస్ బౌలర్లు ఇంగ్లాండ్ తోకను కత్తిరించేశారు. మోయిన్ అలీని పాట్ కమిన్స్ డకౌట్ చేయగా.. క్రిస్ వోక్స్ (8), క్రెయిగ్ ఓవర్టన్ (2)లను హాజిల్‌వుడ్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం చేశాడు. పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (12) ఆఖర్లో దూకుడుగా ఆడినా.. స్టార్క్ బౌలింగ్‌లో క్యాచౌట్ అయ్యాడు. జేమ్స్ ఆండర్సన్ పరుగులేమీ చేయలేదు. తుది 10 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 35 పరుగుల మాత్రమే చేయగల్గింది ఇంగ్లాండ్. 403 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ముగించింది. భారీ ఛేదనలో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ. ఓపెనర్లు కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ (25), డెవిడ్ వార్నర్ (22)లు ఓవర్టన్కు బలయ్యారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఉస్మాన్ ఖవాజా (50) అర్థ శతకం మార్కు అందుకోగానే వోక్స్ బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆసీస్‌ను కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు స్టీవెన్ స్మిత్ (92 బ్యాటింగ్). ఖవాజాతో కలిసి 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన స్మిత్, క్రీజులో అజేయంగా ఉన్నాడు. రెండో రోజు ఆటముగిసే సమయానికి మార్ష్ (7 బ్యాటింగ్) స్మిత్‌కు తోడు నిలిచాడు.