Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ నెం. 2 యమగూచిపై సింధు ఘనవిజయం
రెండు విజయాలతో సెమీస్‌లో చోటు ఖాయం చేసుకున్న తెలుగుతేజం పి.వి సింధు.. నామమాత్రపు గ్రూప్ దశ తుది పోరులోనూ చెలరేగింది. జపాన్ చిన్నది అకానె యమగూచిని 2-0తో చిత్తు చేసింది. సూపర్ సిరీస్ టైటిల్‌పై కన్నేసిన సింధు చైనా యువతి చెన్ యుఫెరుతో సెమీస్‌లో నేడు అమీతుమీ తేల్చుకోనున్నది. కిదాంబి శ్రీకాంత్ నామమాత్రపు పోరులోనూ పోరాడి ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
నవతెలంగాణ- దుబాయ్
నామమాత్రపు పోరు అయినప్పటికీ హైదరాబాదీ షట్లర్ కనికరించలేదు. ప్రత్యర్థితో ఉన్న 4-2 ముఖాముఖి రికార్డును మరింత మెరుగుపరచుకున్నది. జపాన్ అగ్ర షట్లర్, సీజన్ ఫైనల్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన అకానె యమగూచికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. భీకర ఫామ్‌లో ఉన్న ఒలింపిక్ సిల్వర్ స్టార్ 21-9, 21-13తో ప్రపంచ నెంబర్ 2 యమగూచిని కంగుతినిపించింది. తాజా అగ్ర తారల గ్రూప్ దశ పోరులో మూడు విజయాలు అందుకున్న ఏకైక మహిళా షట్లర్‌గా నిలిచింది. 36 నిమిషాల్లోనే పోరు ముగించిన సింధు గ్రూప్ ఏ టాప్ పొజిషన్లో ఉన్నది.
తెలుగుతేజం, పి.వి సింధు చేతిలో ఘోర పరాభవం చవి చూసిన యమగూచి.. సెమీస్‌లో స్థానానికి ఢోకా లేకపోయినా.. గ్రూప్ దశ తుది పోరులో ఈ తరహా పరాజయాన్ని జపాన్ కుర్రది ఊహించి ఉండదు. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌కు మరోసారి భంగపాటు. షి యుకీ (చైనా) చేతిలో 17-21, 21-19, 21-14తో పోరాడి ఓడాడు.
36 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింధు ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. తొలి సెట్లో యమగూచి సింధుకు కనీస పోటీనివ్వలేకపోయింది. 5-0తో గేమ్ ఆరంభించిన సింధు బ్రేక్ వద్ద 11-1తో భారీ ఆదిపత్యం సాధించింది. యమగూచి వరుస తప్పిదాలు చేసింది. ఈ సమయంలో యమగూచి స్కోరు ముందుకు కదిలినా.. కనీసం 10 పాయింట్ల వ్యత్యాసాన్ని కొనసాగించింది సింధు. జపాన్ అమ్మాయికి దిమ్మతిరిగేలా గేమ్ వ్యూహం అమలు పరచటంలో సఫలమైంది. 3 గేమ్ పాయింట్లు నెగ్గి, తొలి సెట్ వశపర్చుకున్నది. రెండో సెట్లో కాస్త పుంజుకున్న యమగూచి తొలి ఎనిమిది పాయింట్ల వరకు సమాన స్థాయి ఆటతీరు కనబరచింది. 4-4తో ఉన్న స్కోరును 6-4గా మార్చిన సింధు మరోసారి ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు. 8-9తో యమగూచి పోటీలోకొచ్చే ప్రయత్నం చేసినా, సింధు సంధించిన స్మాష్‌కు బదులివ్వలేక వెనుకంజ వేసింది. 13-18తో ఆధిపత్యంలో ఉన్న సింధు యమగూచిని అక్కడే కట్టడి చేసి నాల్గు వరుస పాయింట్లు కొల్లగొట్టింది. 21-13తో రెండో సెట్‌నూ గెలిచింది. నేడు జరుగనున్న సెమీస్ సమరంలో చెన్ యుఫెరు (చైనా)ను ఢకొీట్టనున్నది.