Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏం చేసినా రెండో టెస్టులోనే..
- అతి పెద్ద సవాల్‌గా తుది జట్టు కూర్పు
తుది జట్టులో వైస్ కెప్టెన్‌కు చోటు దక్కకపోవటం ఎంతో అరుదు. విదేశీ గడ్డపై జట్టులోని అందరికంటే మెరుగైన రికార్డు ఉన్న ఆటగాడు బెంచ్‌కు పరిమితవటం అత్యంత అరుదైన విషయం. కేప్‌టౌన్‌లో కోహ్లిసేన ఈ రెండు తప్పిదాలను చేసేసింది. ఒక్క మ్యాచ్ ఓటమితో నాయకుడి వ్యూహ చతురతపై సందేహం వ్యక్తం చేయాల్సిన అవసరమైతే లేదు. కానీ ఆ పొరపాట్లను ఎంత త్వరగానే దిద్దుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. మూడు టెస్టుల ఫ్రీడం సిరీస్‌లో తొలి టెస్టు చేజారింది. రెండో టెస్టులో నెగ్గితేనే భారత్‌కు అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కాకుండా మూడో టెస్టుకు మార్పులు చేస్తామంటే ప్రయోజనం ఉండదు. అందుకే కోహ్లిసేన ముందు ఉన్నది ఒక్కటే చాన్స్. మరి, దాన్ని ఎంతమేరకు సద్వినియోగం చేసుకుంటారో..!
నవతెలంగాణ క్రీడావిభాగం
ఏ పర్యటనలోనైనా ఆరంభం ముఖ్యం. అలాంటిది ప్రతికూల పరిస్థితులు, చేదు రికార్డులు స్వాగతం పలికిన చోట మెరుగైన ఆరంభానికి విలువ ఎక్కువ. ఏది ఏమైనా, దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ ఇండియాకు అది దక్కలేదు. అవకాశాలు ఉన్నా.. కేప్‌టౌన్‌లో వెనకడుగు వేయక తప్పలేదు. ఇందుకు బాధ్యత ఎవరిది అనే కోణంలో కాకుండా కారణాలు ఏమిటీ అనే దృక్కోణంలో కోహ్లిసేన ఆలోచించాలి. సిరీస్‌పై ఆశలు ఆవిరి కాకముందే, రేసులోకి ఏ విధంగా రావాలనే వ్యూహం సిద్ధం చేసుకోవాలి. ఇందుకు తొలి అడుగు, తుది జట్టు కూర్పు అని చెప్పకతప్పదు. ఫ్రీడం సిరీస్‌లో రెండో టెస్టు శనివారం నుంచి సెంచూరియన్‌లో ఆరంభం కానున్నది. దీంతో కేప్‌టౌన్‌లో చేసిన తప్పిదాలను సెంచూరియన్‌లో కోహ్లి దిద్దుకుంటాడా లేదా అనేది ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఒక వేళ సెంచూరియన్‌లో మెరుగైన విధానంతో వెళ్లకుండా, ఆఖర్లో జోహ్నస్బర్గ్లో ఎంత చేసినా ప్రయోజనం సిద్ధించదు.
రహానె వస్తాడా? : తొలి టెస్టులో కోహ్లి చేసిన అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం తుది జట్టు నుంచి అజింక్య రహానెను తప్పించటం. విదేశీ పిచ్‌లపై రహానె బ్యాటింగ్ సగటు 53.44. ప్రస్తుత జట్టులోని మరే ఆటగాడు రహానె దరిదాపుల్లో లేరు. వెల్టింగ్టన్, మెల్బోర్న్, జమైకా, లండన్, కొలంబో వంటి విదేశీ పిచ్‌లపై శతకాలు సాధించిన ఘనుడు రహానె.
టెక్నిక్, టెస్టు బ్యాటింగ్ నైపుణ్యం పరంగానూ రహానె బలమైన బ్యాట్స్‌మన్. కానీ ప్రస్తుత ఫామ్ ప్రకారం తుది జట్టు కూర్పు చేశామని, అందుకే రోహిత్ శర్మను ఎంపిక చేశామని కోహ్లి చెప్పుకొచ్చాడు. రహానె వంటి ఆటగాళ్లకు నిజానికి ఫామ్‌లో సంబంధం లేదు. ప్రతికూల పరిస్థితులు ఎదురుచూస్తే చాలు, వారి బ్యాట్ నుంచి ప్రత్యేక ఇన్నింగ్స్‌లో వాటంతట అవే వచ్చేస్తాయి. రహానె కెరీర్ గ్రాఫ్ చూస్తే ఈ విషయం తెలుస్తుంది. ఆఫ్ స్టంప్‌ను కాచుకుని ఆడే రహానె శైలి... ఇక్కడి పిచ్‌లకు అతికినట్టు సరిపోతాయి. రహానెను తప్పించటంపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో సెంచూరియన్‌లో అతడికి కచ్చితంగా చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది.
ఇతర చిక్కులూ.. : భారత బ్యాటింగ్ లోపాలు ఓపెనింగ్ జోడీ నుంచే మొదలయ్యాయి. శిఖర్ ధావన్ దూకుడుగా ఆడటంలో దిట్ట. కానీ బౌన్సీ పిచ్‌లపై షార్ట్ బంతుల్ని ఆడటంలో అతడి బలహీనత బహిరంగ విషయం. కానీ కుడి-ఎడమల కాంబినేషన్ కోసం మురళీ విజరుకి తోడుగా ధావన్‌ను తీసుకున్నారు. కానీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ షార్ట్ బంతులకే ధావన్ అవుటయ్యాడు. దీంతో కెఎల్ రాహుల్‌ను తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో పాటు పార్థీవ్ పటేల్‌ను ఓపెనర్‌గా పంపితే బాగుంటుందనే వాదన వినిపిస్తోంది. ఇలా చేస్తే రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఓపెనర్‌గా పార్దీవ్ ఆడతాడు, వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకుంటాడు. సాహా స్థానంలో మిడిల్ ఆర్డర్లో రహానెను ఆడించొచ్చు. దీంతో అదనపు బ్యాట్స్‌మన్‌గా ప్రయోజనకారి అని కెప్టెన్ నమ్మకాన్ని పొందిన రోహిత్ శర్మ తుది జట్టులో కొనసాగతాడు.
ఇక రెండో టెస్టు వేదిక సెంచూరియన్‌లోనూ కేప్‌టౌన్ పిచ్ పరిస్థితులే ఉన్నాయని తెలుస్తోంది. తొలి టెస్టులో స్పిన్నర్ల పాత్ర నామమాత్రం. అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కూల్చినా, బ్యాట్స్‌మన్‌గానే జట్టుకు ఉపయోగపడ్డాడు. సెంచూరియ న్‌లోనూ స్పిన్ సేవల అవసరం నామమాత్రమైతే అతడి స్థానంలో మరో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌ను తీసుకోవటమో, స్పెషలిస్ట్ పేసర్‌ను ఎంచుకోవటమో మేలని విశ్లేషకులు చెబుతున్నారు.
' ఒక్క ఓటమితో జట్టు ఆత్మవిశ్వాసంలో ఏమాత్రం మార్పు రాదు. ఓడినంత మాత్రాన ఆడే అర్హత కోల్పోతామా?. తప్పులు జరుగుతాయి, సరిదిద్దుకుంటాం. మళ్లీ ప్రయత్నిస్తాం. తొలి ఇన్నింగ్స్‌లో భారత పిచ్‌లపై మాదిరి బంతులేసి తప్పుచేశాం. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఆ తప్పు పునరావృతం చేయలేదు. సెంచూరియన్‌లో లెంగ్త్‌పై ముందే అవగాహన రావాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో లెంగ్త్ సరిగా ఉంటే కేప్‌టౌన్ కథ మరోలా ఉండేది'
- జశ్‌ప్రీత్ బుమ్రా
దక్షిణాఫ్రికా పరిస్థితులు భిన్నం. ఇక్కడ అదనపు పేస్, అదనపు బౌన్స్ లభిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ స్టంప్ ఎక్కడుందో చూసుకుని ఆడే బ్యాట్స్‌మన్ అవసరం. అజింక్య రహానె, కెఎల్ రాహుల్‌లు సఫారీ పరిస్థితులకు సరిగ్గా సరిపోయే బ్యాట్స్‌మెన్. భారత బ్యాటింగ్ లైనప్ వైఫల్యం ఓపెనింగ్‌లో ధావన్ నుంచే కన్పిస్తోంది'
- గ్రేమ్ స్మిత్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్