Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు నేటి నుంచే
- ఇక్కడ ఓడితే సిరీస్‌పై ఆశలు గల్లంతే
- కెప్టెన్‌గా కోహ్లి సామర్థ్యానికీ పరీక్ష
- మధ్యాహ్నం 1.30 నుంచి సోనీటెన్లో...
ఎన్నో ఆశలతో, మరెన్నో అంచనాలతో సఫారీ గడ్డపై కాలుమోపిన కోహ్లిసేన.. అక్కడ ఆడింది నాల్గు రోజులే అయినా సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది. కీలక కేప్‌టౌన్‌లో ఓడిన టీమ్ ఇండియా ఇప్పుడు సెంచూరియన్ సమరానికి సిద్ధమవుతోంది. కానీ కేప్‌టౌన్‌లో చేసిన వ్యూహాత్మక తప్పిదాలను సరిదిద్దుకోకుండా, మొండిగా ముందుకెళ్లేందుకే కోహ్లి మొగ్గు చూపుతుండటంతో రెండో టెస్టుపై విపరీతమైన ఆసక్తి ఏర్పడుతోంది.
సెంచూరియన్‌లో సఫారీ సేనకు తిరుగులేని రికార్డు సొంతం. కానీ మనకు ఎప్పట్లాగే ఇక్కడా మెరుగైన రికార్డు లేదు. విదేశీ పిచ్‌లపై బ్యాట్స్‌మన్‌గానూ నిరూపించుకునే అవసరం కోహ్లి ముందుంది. కెప్టెన్‌గా అతడి వ్యూహ చతురత, నాయకత్వ పటిమలపైనా విమర్శలు వెల్లువెత్తకముందే అతడో విజయాన్ని అందించటం ఆవశ్యం.
తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోన్న టీమ్ ఇండియా బలమైన దక్షిణాఫ్రికాను ఎదురించి పుంజుకోగలదేమో చూడాలి. ఫ్రీడం సిరీస్‌లో రెండో టెస్టు నేటి నుంచే ఆరంభం.
నవతెలంగాణ-సెంచూరియన్
పేస్, బౌన్స్... సఫారీ పర్యటనకు ముందు భారత్‌ను ఆందోళనకు గురిచేసిన అంశాలు. అదే పేస్, బౌన్స్‌తో మన పేసర్లు ప్రత్యర్థిని కట్టడి చేయగా.. ప్రత్యర్థి పేసర్లు మనోళ్లను అంతకంటే తక్కువకే పరిమితం చేశారు. కేప్‌టౌన్‌లో తొలి టెస్టు ముగిసే సమయానికి సఫారీ పేస్ బృందంతో మనోళ్లు సరితూగారు. కానీ వారి బ్యాటింగ్ లైనప్ స్థాయికి తగ్గ ప్రదర్శన మనోళ్లు చేయలేకపోయారు. అదే కేప్‌టౌన్ ఫలితాన్ని శాసించింది. ఇప్పుడు సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలువాలంటే బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టం చేసుకునే పని కోహ్లిసేన చేయాలి. లేదంటే కేప్‌టౌన్ ఫలితం పునరావృతం కావటం పెద్ద విషయం కాదు!.
అజింక్య ఆడతాడా? : కేప్‌టౌన్ ఓటమి తర్వాత చర్చంతా అజింక్య రహానెను తుది జట్టులోకి తీసుకోకపోవటంపైనే నడిచింది. ఇక్కడి పిచ్‌లపై మెరుగైన టెక్నిక్‌తో ఆడగల సత్తా ఉన్న బ్యాట్స్‌మన్ అతడు. మరి, సెంచూరియన్లోనైనా వైస్ కెప్టెన్‌ను ఆడిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క ఓటమితో వ్యూహం మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఉన్న బ్యాట్స్‌మెనే మెరుగ్గా ఆడితే సరిపోతుందనే భావన కోహ్లిలో వ్యక్తమవుతోంది. దీంతో ఓపెనింగ్‌లో ధావన్ స్థానంలో రాహుల్‌ను సైతం ఊహించటం కష్టతరమే కానున్నది. ఇక బ్యాటింగ్ లైనప్‌లో మురళీ విజరు, విరాట్ కోహ్లి, చటేశ్వర్ పుజారాలు బాధ్యత తీసుకోవాల్సి ఉన్నది. విదేశీ పిచ్‌లపై ప్రధాన బ్యాట్స్‌మెన్ పరుగులు చేయకుండా సానుకూల ఫలితం ఆశించలేం. అదనపు బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ తనెంటో నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక బౌలింగ్ బృందంలోనూ మార్పులు చేయాలని అంటున్నా.. కేప్‌టౌన్ ప్రదర్శనతో సెంచూరియన్‌లోనూ అదే బృందం బరిలోకి దిగబోతున్నది. బుమ్రా, షమి, భువనేశ్వర్‌లకు తోడుగా పాండ్య పేస్ బాధ్యత తీసుకోనున్నాడు. అశ్విన్‌కు గాయమైనా ఫిట్నెస్ సాధించాడని తేలటంతో అతడు ఆడటం ఖాయం.
ఇక్కడే కొట్టాలని.. : వరల్డ్ నెం.1 టీమ్ ఇండియాను నాల్గు రోజుల్లోనే (నిజానికి మూడు రోజుల ఆటలోనే) ఓడించిన దక్షిణాఫ్రికా ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. సీనియర్ పేసర్
డెల్ స్టెయిన్ దూరమైనా కేప్‌టౌన్‌లో మెరిసిన సఫారీ.. సెంచూరియన్‌లోనే సిరీస్ సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఏడీ డివిలియర్స్, డుప్లెసిస్‌లు ఫామ్‌లో ఉన్నారు. హషీమ్ ఆమ్లా తనదైన ఇన్నింగ్స్ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడు. ఎల్గార్, మర్క్రం, డికాక్‌లు సైతం ప్రభావశీల బ్యాట్స్‌మెనే. దీంతో దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ సమస్య లేదు. బంతితోనూ ప్రత్యర్థి మెరుగ్గానే ఉంది. క్రిస్ మోరీస్ ఇక్కడ తనదైన ముద్ర వేసే అవకాశం లేకపోలేదు. ఫిలాండర్, రబాడా, మోర్నీ మోర్కెల్‌లతో కూడిన పేస్ బృందాన్ని ఎదుర్కొవటం కోహ్లిసేనకు కత్తిమీద సామే.
బ్యాటింగ్ లైనప్ కుప్పకూలినంత మాత్రాన మేము తెగ బాధపడిపోవాల్సిన పని లేదు. మా ప్రణాళికలను మరింత మెరుగ్గా అమలు చేయాలి అంతే. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌తో ఆడుతున్నామా? ఆరుగురితో ఆడుతున్నామా అనేది పెద్ద విషయం కాదు. చెత్త షాట్లు ఆడకుండా ఉండటమే ప్రధానం'
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
తుది జట్లు (అంచనా) :
భారత్ : మురళీ విజరు, శిఖర్ ధావన్/కెఎల్ రాహుల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ /అజింక్య రహానె, అశ్విన్, హార్దిక్ పాండ్య, వృద్దిమాన్ సాహా, భువనేశ్వర్ కుమార్, షమి, జశ్‌ప్రీత్ బుమ్రా.
దక్షిణాఫ్రికా : డీన్ ఎల్గార్, మార్క్రం, హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్, డుప్లెసిస్, క్వింటన్ డికాక్, వెర్నన్ ఫిలాండర్, క్రిస్ మోరీస్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, మోర్నీ మోర్కెల్.
పిచ్ రిపోర్టు
న్యూలాండ్స్తో పోల్చితే సూపర్ స్పోర్ట్ పార్క్‌లో పచ్చిక తక్కువే. కానీ పిచ్ నుంచి లభించే అదనపు బౌన్స్, ఎక్స్ట్రా పేస్ విషయంలో మాత్రం న్యూలాండ్స్కు తీసిపోదు. మోరీస్ వంటి పేసర్లు ఇక్కడ మరింత ప్రభావం చూపగలరు. ఎలాంటి వర్షం ముప్పు లేకపోయినా, మధ్యాహ్నం సమయంలో చిరు జల్లులు కురిసే ప్రమాదం లేకపోలేదు. పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు చేరువగా ఉండనున్నది. దీంతో చివరి రెండు సెషన్లో బ్యాటింగ్‌కు కాస్త అనుకూలమనే చెప్పాలి.
77
సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికా గెలుపు శాతం 77. ఇక్కడ ఆడిన 22 టెస్టుల్లో 17 నెగ్గింది. కేవలం రెండు సందర్భాల్లోనే సఫారీ ఇక్కడ ఓటమిపాలైంది.
99
టెస్టుల్లో వంద వికెట్ల క్లబ్లో చేరేందుకు మహ్మద్ షమి ఇంకొక్క వికెట్ దూరంలోనే ఉన్నాడు. షమి ఇప్పటివరకూ 99 వికెట్లు కూల్చాడు.
1
భారత్ ఇక్కడ ఒకే ఒక్క టెస్టు ఆడింది. సచిన్ రికార్డు 50వ శతకం సాధించిన ఆ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 25 పరుగులతో ఓడింది.