Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచే ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రౌండ్ మ్యాచులు
- హాట్ ఫెవరెట్‌గా రోజర్ ఫెడరర్
- భారత్ తరఫున బరిలో యుకీ టెన్నిస్ అభిమానులకు
పక్షం రోజుల పండుగ వచ్చేసింది. నేటి నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ ప్రధాన టోర్నీ మొదలవ్వనున్నది. సంక్రాంతి రోజు ఆరంభం కానున్న పోరులో.. దిగ్గజాలు సహా కుర్ర ఆటగాళ్లు గ్రాండ్‌స్లామ్ ఆశలతో మెల్బోర్న్ హార్డ్ కోర్టులో అడుగుపెడుతున్నారు. గాయాల కారణంగా పలువురు సీనియర్ ఆటగాళ్లు టోర్నీకి దూరమైన వేళ.. ఢిఫెండింగ్ చాంప్ ఫెడెక్స్ టైటిల్ నిలుపుకోవాలని చూస్తున్నాడు. మరో పక్క గాయాలతోనే ప్రపంచ నెంబర్ వన్ నడాల్, మాజీ నెంబర్ వన్ జకోవిచ్‌లు సమరానికి సై అంటున్నారు. మరి పాతిక కోట్ల ప్రైజ్ మనీ నెగ్గేదెవరో, వేచి చూడాల్సిందే!.
నవతెలంగాణ-మెల్బోర్న్
గాయాలు, ఆరోగ్య సమస్యలతోనే దిగ్గజ టెన్నిస్ ఆటగాళ్లందరూ కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టారు. చూస్తుండగానే తొలి గ్రాండ్‌స్లామ్ సంగ్రామానికి వేళయింది. డిఫెండింగ్ చాంపియన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరెర్ ఈ సారి కూడా టైటిల్ ఫేవరెట్‌గా ఉన్నాడు. గతేడాది రన్నరప్, ప్రస్తుత ప్రపంచ నెంబర్ వన్ రఫెల్ నడాల్ మోకాలి సమస్యతోనే మెల్బోర్న్లో పోరుకు సై అంటున్నాడు. మాజీ నెంబర్ వన్, 12 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత నొవాక్ జకోవిచ్ మోచేతి గాయంతో టోర్నీలో అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రే, ఏషియా నెంబర్ వన్ కీ నిషికొరిలు సైతం గాయాల కారణంగా టోర్నీలో లేరు. దీంతో అద్భుత ఫామ్‌లో ఉన్న ఫెడరర్ ఈ ఏడాది టైటిల్‌పై కన్నేశాడు. మహిళలల్లో డిఫెండింగ్ చాంపియన్, అమెరికన్ స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్ బరిలో లేకపోవటంతో టైటిల్ ఎవరిని వరిస్తుందో చెప్పటం కష్టమే.అయితే, 15 నెలల డోప్ నిషేధం అనంతరం గతేడాది పునరాగమనం చేసిన మరియా షరపోవా ప్రదర్శనపైనే అందరి చూపు.
ఫెడరర్‌పై భారీ అంచనాలు
వరుసగా ఐదేండ్లు మేజర్ టైటిల్ విజయం కోసం పరితపించిన స్విస్ దిగ్గజం.. గతేడాది ఏకంగా రెండు గ్రాండ్‌స్లామ్స్ టైటిళ్లు నెగ్గాడు. వయసు మీద పడుతోన్నా అదే ఫామ్‌ను కొనసాగిస్తూ మెల్బోర్న్ హార్డ్్కోర్ట్లో హాట్ ఫెవరెట్‌గా అభిమానుల హార్ట్ దోచుకునేందుకు సిద్ధమ య్యాడు. ఐదు సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గిన 36 ఏండ్ల స్విస్ ఘనుడు, ఆరో టైటిల్ ఖాతాలో వేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. గతేడాది ఇదే వేదికన ప్రపంచ నెంబర్ వన్, రఫెల్ నడాల్‌ను ఫైనల్లో ఓడించి టైటిల్ కొల్లగొట్టిన ఫెడరర్.. ఈసారి అదే ఉత్సాహంతో ఉన్నాడు. 'వయసు కారణంగా నేను పూర్తిస్థాయిలో రాణించలేకపోవచ్చు. రఫా (నడాల్), ఆరుసార్లు ఇక్కడ విజేతగా నిలిచిన నొవాక్లు అసలైన ఫెవరెట్లు. అయితే, ఫెవరెటా, కాదా అనేవి మాటలవరకే పరిమితం. అంతిమంగా డ్రాలు కష్టంగా ఉన్నాయి. మేలైన ప్రతిభగల ఆటగాళ్లెందరో పోటీలో ఉన్నారు.' అంటోన్న ఫెడరర్.. గతేడాది రెండు మేజర్ టైటిళ్లు సహా ఐదు ఏటీపీ టూర్ ఈవెంట్లలో గెలుపొందాడు. కొత్త ఏడాదిలో ఆడిన నాల్గు సింగిల్స్ మ్యాచుల్లోనూ విజయం సాధించాడు. ఇక ఈసారి ఫెడరర్‌కు నడాల్ నుంచి ఏమంత గట్టి పోటీ ఎదురుకాకపోవచ్చనేది క్రీడా పండితుల అభిప్రాయం. తొలి రౌండ్లో అల్జాజ్ బెడెన్‌తో తలపడనున్నాడు ఫెడరర్. తదుపరి రౌండ్లలో మాజీ చాంపియన్ డెల్ పోట్రో, డెవిడ్ గోఫిన్లు ఎదురయ్యే అవకాశమున్నది.
గాయాలతోనే నడాల్, నొవాక్
గతేడాది రెండు మేజర్ టైటిళ్లు ఫెడరర్ వశం కాగా, రెండు గ్రాండ్‌స్లామ్‌లను తన పేరిట రాసుకున్నాడు రఫెల్ నడాల్. మోకాలి గాయానికి శస్త్ర చికిత్స అనంతరం పలు టోర్నీలో ్ల తడబడిన స్పెయిన్ దిగ్గజం. ఫెడెక్స్‌కు మళ్లే గతేడాది మెరిశాడు. బరిలో దూకుడుగా ఆడే నడాల్ ఈసారి అదే స్థాయి ప్రదర్శన చేయాలని ఆశిస్తోన్నా.. గాయం ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలీదు. అయితే ఫైనల్ అవకాశాలకు గాయం గండికొట్టే ఛాన్సుంది. తొలి రౌండ్లో నడాల్.. విక్టర్ బర్గర్‌ను ఢకొీట్టనున్నాడు. ఫైనల్ దారిలో నడాల్‌కు అమెరికన్ స్టార్ జాన్ ఇస్నర్ ఎదురుపడే అవకాశమున్నది. గాయంతో సతమతమవుతున్న మరో స్టార్ ప్లేయర్, ఆస్ట్రేలియా ఓపెన్‌లో అదరిపోయే రికార్డున్న సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్. గతేడాది వింబుల్డన్‌లో గాయంతో క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన జకోవిచ్.. పలు కీలక టోర్నీలకు దూరమయ్యాడు. తాజా ఈవెంట్లో 14వ సీడ్‌గా బరిలో దిగనున్నాడు. తొలి రౌండ్లో డొనాల్డ్ యంగ్‌తో పోరు సల్పనున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకుండానే మెల్బోర్న్లో అదృష్టం పరీక్షించుకోనున్నాడు 30 ఏండ్ల జకోవిచ్. నడాల్, జకోవిచ్‌లతో పాటు 2014 చాంపియన్, స్టాన్ వావ్రింకా సైతం టైటిల్‌పై కన్నేశాడు. గతేడాది వింబుల్డన్‌లో గాయం బారిన పడిన 32 ఏండ్ల వావ్రింకా.. మెల్బోర్న్ ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. వీరితో పాటు గ్రిగర్ దిమిత్రోవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్, డొమినిక్ థీమ్, మారిన్ సిలిచ్లు టైటిల్ బరిలో ఉన్నారు. భారత్ తరఫున ఆస్ట్రేలియా ఓపెన్‌లో నిలిచిన ఏకైక ఆటగాడు యుకీ బాంబ్రీ. ఆదివారం జరిగిన మూడో ఆర్హత పోరులో యుకీ 1-6, 6-3, 6-3తో పొలాన్స్కీపై గెలుపొంది ప్రధాన టోర్నీలో అడుగుపెట్టాడు. మరో భారత ఆటగాడు రామ్‌కుమార్ రామ్‌నాథన్ 4-6, 6-4, 4-6తో పోస్పిసిల్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టాడు.
మహిళల్లో నెగ్గేదెవరో
డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ పోటీలో లేకపోవటంతో మహిళల సింగిల్స్ టైటిల్ విజయం ఎవరిని వరిస్తుందనే విషయం ఆసక్తి రేకెత్తిస్తున్నది. అగ్ర క్రీడాకారిణీలందరూ టైటిల్‌పై ఆశలు పెట్టుకున్నారు. సిమోన హాలెప్, కరోలినా వోజ్నియాకి, గార్బినే ముగురుజాల మధ్య బలమైన పోటీ ఉండనున్నది. ఇక ఎలీనా స్విటోలినా, మరియా షరపోవా, వీనస్ విలియమ్స్కూ అవకాశాలున్నాయి. వీరిలో ఇటీవలే ముగిసిన బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ విజయంతో స్విటోలినా జోరుమీదున్నది. జెలెనా ఒస్టాపెంకో, స్లోనే స్టీఫెన్స్లు మెల్బోర్న్ బరిలో అదృష్టం పరీక్షించుకోనున్నారు. మాజీ చాంపియన్ రష్యా సుందరి మరియా షరపోవా 47వ సీడ్‌గా ఆడనున్నది. తొలి రౌండ్లో తజానా మరియాతో తలపడనున్నది.