Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జకోవిచ్, మోన్ఫీల్స్ మ్యాచ్‌లో 69 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
సహజంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతేనే వామ్మో అనేస్తాం. ఇంట్లోంచి బయటికి వచ్చే సాహసం సైతం చేయలేం. ఇక అలాంటిది ఏకంగా 69 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత వద్ద టెన్నిస్ ఆడాలంటే ఇంకేమైనా ఉందా?. కానీ ఆడాల్సి వచ్చింది. అందుకు ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదిక అయ్యింది. మాజీ వరల్డ్ నెం.1, ఇక్కడ ఆరుసార్లు టైటిల్ నెగ్గిన నొవాక్ జకోవిచ్, ఫ్రాన్స్ ఆటగాడు మోన్ఫీల్స్ ఇంతటి దారుణమైన ఉష్ణ పరిస్థితుల్లో ఆట ఆడేశారు. బహుశా టెన్నిస్ చరిత్రలోనే ఈ స్థాయి ఉష్ణోగ్రత వద్ద ఆడిన తొలి మ్యాచ్ ఇదే కాబోలు. ఆటగాళ్లు కోర్టులో నిలబడేందుకు అల్లాడిపోతూ ఎప్పుడెప్పుడు చల్లని నీటిలో తడుద్దామా అని ఎదురుచూశారు. ఇక జరుగుతున్న గ్రాండ్‌స్లామ్ మ్యాచులు అయినా.. నీడ ఉన్న చోటే అభిమానులు నిల్చుకున్నారు. దీంతో ఎండకాచిన చోట కుర్చీలన్నీ ఖాళీగా దర్శనిమిచ్చాయి. ప్రధాన కోర్టులో సగటు ప్రేక్షకుల హాజరు 28 వేలు కాగా, గత నాల్గు రోజులుగా ఇది పది వేలకు మించటం లేదు. దీన్ని బట్టే మెల్బోర్న్ ఎంతలా మండిపోతుందో అర్థం చేసుకొవచ్చు.
ఆటపై తీవ్ర ప్రభావం : అధిక ఉష్ణోగ్రతల్లో ఆడేందుకు అనువు కాదు. దీంతో పాటు ఆటపై, ఫలితంపై ఇది ప్రభావం చూపిస్తుంది. క్రికెట్లో శీతల పరిస్థితుల పేసర్లకు, అధిక ఉష్ణోగ్రతలు స్పిన్నర్లకు అనుకూలించినట్లు టెన్నిస్కూ ఇది వర్తిస్తుంది. వేడి, తేమ, గాలి బంతి గమనాన్ని నిర్దేశిస్తాయి. ఇక అధిక ఉష్ణోగ్రతలు దూకుడుగా ఆడే ఆటగాళ్లకు అనుకూలం. రోజర్ ఫెడరర్, నిక్ కిర్గియోస్ వంటి ఆటగాళ్ల శైలి ఆటకు ఇది అనుకూలం. కానీ రక్షణాత్మక ఆట ఆడే నడాల్ వంటి ఆటగాళ్లకు ఇది ప్రతికూలం. అయితే ఇవి సాధారణ శీతల, ఉష్ణ పరిస్థితుల్లో అయితే బాగుంటుంది. కానీ మరీ 50-60 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఎటువంటి ఆటగాడు సైతం ఆడేందుకు అనువుగా ఉండదు. పైగా ఆటగాళ్ల ఫిట్నెస్, ఆరోగ్యానికి సవాల్ విసురుతుంది. అభిమానులు సైతం ఈ పరిస్థితుల్లో మ్యాచులు చూసేందుకు రావటం లేదు. మెల్బోర్న్లో ఈ పరిస్థితి ఇప్పుడు సుస్పష్టం.
వేదిక మార్చాలా? : జవనరి మాసంలో మెల్బోర్న్లో అధిక ఉష్ణోగ్రతలు సహజం. కానీ ఈ మధ్య కాలంలో ఇది మరింత అధికమైంది. వాతావరణ మార్పులు ఇందుకు కారణమైనా.. శీతల దేశ ఆటగాళ్లు ఇలాంటి పరిస్థితుల్లో ఆడేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. గ్రాండ్‌స్లామ్ టోర్నీ కావటంతో తప్పని పరిస్థితుల్లో బరిలోకి దిగుతున్నారు. రానున్న సీజన్లలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను మెల్బోర్న్ నుంచి సిడ్నీ వంటి నగరానికి తరలించాలనే డిమాండ్ సైతం వినిపిస్తోంది. లేదంటే మెల్‌బోర్న్‌లోనే అత్యవసరంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. ఇందుకు నిర్మాణ శైలిలో మార్పులతో పచ్చదనంతో పాటు ప్రేక్షకుల గ్యాలరీలోనూ పలు మార్పులు సూచిస్తున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆరంభమై నాల్గు రోజులే అయినా అధిక ఉష్ణోగ్రతలు ఆటాడుకుంటున్నాయి. రానున్న వారం రోజులు మరింత ఎక్కువగా ఎండకాస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉండబోతుందో ఊహకందటం లేదు!.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను
మెల్‌బోర్న్‌లోనే నిర్వహించాలని అనుకుంటే నిర్వాహకులు సౌకర్యాల విషయంలో కొన్ని మార్పులు చేయాలి. అప్పుడే ప్రేక్షకులు క్షేమంగా భావిస్తారు, చూసేందుకు వస్తారు. ఆటగాళ్ల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఇలాంటి అధిక ఉష్ణ పరిస్థితుల్లో ఆడటం ఆరోగ్యానికి అత్యంత హానికరం'
- డా. ఎలిజబెత్ హనా,
ప్రముఖ ఆరోగ్య నిపుణురాలు