Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో రౌండ్లో జుముర్‌పై అలవోక విజయం
- సిలిచ్, దిమిత్రోవ్, వోజ్నియాకి ముందంజ
- ప్రీ క్వార్టర్స్‌లో బోపన్న, దివిజ్ శరణ్ జోడీలు
- రూబ్లేవ్, జో విల్ఫ్రైడ్, ఓస్టాపెంకో నిష్క్రమణ
మెల్బోర్న్్ : స్పెయిన్ దిగ్గజం రఫెల్ నడాల్ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ దిశగా దూసుకుపోతున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే బరిలో దిగినా.. తొలి రౌండ్నుంచే వరుస సెట్లలో గెలుస్తూ సత్తా చాటుతున్నాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో బోస్నియా ఆటగాడు డామిర్ జుముర్‌ను 6-1, 6-3, 6-1తో ఓడించి, ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. నడాల్‌తో పాటు మూడో సీడ్ గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా), ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా), పదో సీడ్ కారెనో బుస్టా (స్పెయిన్)లు ప్రీ క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. మహిళల సింగిల్స్ సర్క్యూట్లో లాట్వియా భామ, ఏడో సీడ్ జెలెనా ఓస్టాపెంకోకు నిరాశ ఎదురైంది. డెన్మార్క్ స్టార్ క్రీడాకారిణి కరోలినె వోజ్నియాకి, ఉక్రెయిన్ చిన్నది ఎలీనా స్విటోలినాలు ప్రీ క్వార్టర్స్ చేరుకున్నారు.
నడాల్ దూకుడుగా : గతేడాది మెల్బోర్న్ ఫైనల్లో ఫెడరర్ చేతిలో ఓడిన ప్రపంచ నెంబర్ వన్ నడాల్, ఈ ఏడాది దూకుడు పెంచాడు. కెరీర్ రెండో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌పై కన్నేశాడు. ఇప్పటిదాకా జరిగిన మూడు రౌండ్లలో వరుస సెట్లలోనే విజయాలు సాధించాడు. శుక్రవారం జరిగిన పోరులో కేవలం ఐదు గేములే కోల్పోయిన నడాల్ 28వ సీడ్ జుముర్‌పై ఏకపక్షంగా గెలుపొందాడు. మూడు సెట్ల మ్యాచును రెండు గంటలలోపే ముగించాడు. తొలి సెట్లో 2-0తో శుభారంభం చేసిన నడాల్ ప్రత్యర్థి సర్వ్‌ను రెండు సార్లు బ్రేక్ చేశాడు. వరుస విన్నర్లతో చెలరేగి 6-1తో తొలి సెట్ సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లోనూ 2-0తో ఆరంభించినా, జుముర్ 2-2, 3-4తో పోటీలో నిలిచాడు. అయినా మరో గేమ్ కోల్పోని స్పెయిన్ బుల్ 6-3తో రెండో సెట్‌నూ గెల్చుకున్నాడు. మూడో సెట్లోనూ నడాల్ హవా కొనసాగించాడు. 6-1తో సెట్ సొంతం చేసుకుని ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మొత్తం మ్యాచులో నాల్గు ఏస్‌లు సంధించిన నడాల్, ఒక్క డబుల్ తప్పిదం చేయకపోవటం విశేషం. క్వార్టర్స్‌లో స్థానం కోసం ఆదివారం 24వ సీడ్, డీగో ష్వార్జ్‌మాన్ (అర్జెంటీనా)తో తలపడనున్నాడు. బల్గేరియా స్టార్ గ్రిగర్ దిమిత్రోవ్.. 30వ సీడ్ రష్యా కుర్రాడు ఆండ్రే రూబ్లేవ్పై 6-3, 4-6, 6-4, 6-4తో గెలుపొందాడు. ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)కు అన్‌సీడెడ్ రేన్ హారిసన్ (అమెరికా) గట్టి పోటీనిచ్చాడు. తొలి, తుది సెట్లను సూపర్ టైబ్రేకర్‌లో గెల్చుకున్న సిలిచ్ 7(7)-6(4), 6-3, 7(7)-6(4)తో నెగ్గాడు. పాబ్లో కారెనో బుస్టా (స్పెయిన్) 7(7)-6(4), 4-6, 7-5, 7-5తో గిల్లెస్ ముల్లర్ (లక్సెంబర్గ్)పె గెలిచాడు. నిక్ కిర్గియోస్ (ఆస్ట్రేలియా) 7(7)-6(5), 4-6, 7(8)-6(6), 7(7)-6(5)తో జో విల్ఫ్రైడ్ టుసొంగా (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు.
ఓస్టాపెంకో ఔట్ : గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ బరిలో మూడో రౌండ్లో వెనుదిరిగిన లాట్వియా ప్లేయర్ జెలెనా ఓస్టాపెంకో.. ఈ ఏడాది అదే పునరావృతం చేసింది. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ విజయంతో తొలి గ్రాండ్‌స్లామ్ అందుకున్న ఓస్టాపెంకోకు మెల్బోర్న్లో 32వ సీడ్ ఆనెట్ కొంటావెయిట్ (ఎస్టోనియా) షాకిచ్చింది. శుక్రవారం జరిగిన పోరులో 3-6, 6-1, 3-6తో ఓస్టాపెంకో పరాజయం పాలైంది. ఇక ఆల్ ఉక్రెయిన్ పోరులో నాల్గో సీడ్ ఎలీనా స్విటోలినా
క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్నది. గంటలో ముగిసిన రెండో సెట్ల మ్యాచులో 6-2, 6-2తో మార్తా కోస్ట్యుక్‌ను ఓడించింది. డెన్మార్క్ తార, రెండో సీడ్ కరొలినె వోజ్నియాకి 6-4, 6-3తో కీకి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)ను ఓడించి ప్రీ క్వార్టర్స్‌లో కాలు మోపింది.
బోపన్న, దివిజ్ జోడీలు ముందంజ : పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు రోహన్ బోపన్న, దివిజ్ శరణ్‌ల జోడీలు ప్రీ క్వార్టర్స్‌లో కాలుమోపాయి. రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్), బోపన్నల పదో సీడ్ జోడీ 6-2, 7(7)-6(3)తో జో సౌసా (పోర్చుగల్), లియోనార్డో మేయర్ (అర్జెంటీనా) జంటపై గెలుపొందింది. దివిజ్ శరణ్, రాజీవ్ రామ్ (అమెరికా)ల పదహారో సీడ్ జంట 4-6, 7(7)-6(4), 6-2తో గ్రానోల్లర్స్ (స్పెయిన్), ఫోగినిని (ఇటలీ)లపై గెలుపొందారు.
ఎక్కడైనా ఆడగలగాలి
అగ్రస్థానానికి చేరాలంటే.. ఎలాంటి వాతావారణ పరిస్థితుల్లో అయినా ఆడేందుకు క్రీడాకారులు సిద్ధంగా ఉండాలిని స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ అన్నాడు. మెల్బోర్న్ పార్క్‌లో గురువారం 50 డిగ్రీ సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిని 'క్రూరమైన వాతావరణం' గా సెర్బియా యోధుడు జకోవిచ్ అభివర్ణించాడు. అయితే మెల్బోర్న్లో శీతోష్ణ పాలసీని అనుసరి స్తున్నామని, 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రత నమోదయితే ఆటను ఆపడం కానీ, స్టేడియం పైకప్పును మూసివే యటం గానీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన ఫెడరర్ తాజా వ్యాఖ్యలు చేశాడు. 'గతంలో మెల్బోర్న్ వేడి వాతావరణంలో ఆడాను. ఆటగాళ్లకు ఇది కచ్చితంగా సవాలే. అయినప్పటికీ, అన్ని మ్యాచులు ఆపలేం. షెడ్యూలు పొడిగించలేం. ఎలాంటి వాతావరణంలో అయినా ఆడగ లిగేలా క్రీడాకారులు ఫిట్నెస్ సంపాదిం చుకోవాలి' అని ఫెడరర్ తెలిపాడు.