Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో టీ20లో అమ్మాయిల ఓటమి
- సిరీస్‌పై సఫారీ ఆశలు సజీవం
నవతెలంగాణ-జొహనెస్‌బర్గ్
దక్షిణాఫ్రికా గడ్డపై ఒకే పర్యటనలో రెండు (వన్డే, టీ20) సిరీస్ విజయాలు సాధించిన తొలి జట్టుగా నిలిచేందుకు టీమ్ ఇండియా అమ్మాయిలు మరో మ్యాచ్ వరకూ నిరీక్షించాల్సిందే!. మూడో మ్యాచ్‌లోనే సిరీస్‌పై కన్నేసిన హర్మన్‌ప్రీత్ సేన వాండరర్స్ వార్‌లో ఓటమిపాలైంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో 134 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మరో ఓవర్ ఉండగానే ఛేదించింది. ఐదు వికెట్ల విజయంతో పొట్టి సిరీస్‌పై సఫారీ అమ్మాయిల ఆశలు సజీవంగా నిలుపుకున్నారు. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ తొలి రెండు పోరుల్లో గెలుపొందింది. అయినా సిరీస్‌లో మనోళ్లు 2-1తో ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు.
మిథాలీ విఫలం :
తొలి రెండు మ్యాచుల్లో భారత్‌ను విజయపథాన నడిపిన దిగ్గజ బ్యాట్స్‌వుమన్ మిథాలీరాజ్ (0) వాండరర్స్‌లో నిరాశపరిచింది. ఖాతా తెరవకుండానే నిష్క్రమించిన మిథాలీ వరుస అర్ధ సెంచరీల పరంపర కొనసాగించలేదు. మరో ఓపెనర్ స్మృతి మంధాన (37) ఆకట్టుకున్నది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (48, 30 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేసింది. కౌర్ తనదైన శైలిలో రెండు భారీ సిక్సర్లు కొట్టగా, మంధాన ఐదు బౌండరీలు బాదింది. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగింది. మంధాన, కౌర్‌లు స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోగా.. యువ క్రీడాకారిణి జెమీమా రొడ్రిగ్స్ (6) రాణించలేదు. ఈ తరుణంలో వేద కృష్ణమూర్తి (23) నాల్గు ఫోర్లతో అలరించింది. 124/5తో ఫర్వాలేదనిపించిన అమ్మాయిలు.. ఒక్కసారిగా కుప్పకూలారు. కేవలం తొమ్మిది పరుగుల వ్యవధిలోనే ఆఖరి ఐదు వికెట్లు చేజార్చుకున్నారు. సఫారీ పేసర్ షబ్నిం ఇస్మయిల్ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నది. మహిళల క్రికెట్లో ప్రపంచంలోనే వేగవంతమైన బౌలర్‌గా పేరున్న షబ్నిం భారత్ లోయర్ ఆర్డర్ పనిపట్టింది.
సూపర్ సునె :
స్వల్ప ఛేదనలో దక్షిణాఫ్రికా ఆరంభంలోనే ఓపెనర్ లీ (5)ని కోల్పోయింది. కానీ కెప్టెన్ నికెర్క్ (26), సునె లుస్ (41, 34 బంతుల్లో 5 ఫోర్లు)లు గెలుపు ఇన్నింగ్స్ ఆడారు. లక్ష్యం చిన్నదే కావటంతో ఒత్తిడి లేకుండా ఆడేసిన ఈ జోడీ రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించింది. నికెర్క్ నిష్క్రమించినా డు ప్రీజ్ (20)తో కలిసి సునె మెరిసింది. ఆఖర్లో ట్రయాన్ (34) ఇన్నింగ్స్‌తో సఫారీలు లాంఛనం ముగించారు.
సంక్షిప్త స్కోర్లు : భారత్ ఇన్నింగ్స్ : 133/10 (హర్మన్‌ప్రీత్ కౌర్ 48, స్మృతి మంధాన 37, వేద కృష్ణమూర్తి 23, షబ్నిం ఇస్మయిల్ 5/30)
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : 134/5 (సునె లుస్ 41, ట్రయాన్ 34, నికెర్క్ 26, పూజ 2/21)