Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లా, శ్రీలంక మధ్య ఆఖరు టీ20 మ్యాచ్ నేడు
- ముక్కోణపు టీ20 సిరీస్
- సాయంత్రం 7 గంటలనుంచి డీ స్పోర్ట్స్‌లో..
ముక్కోణపు టీ20 సిరీస్, నిదాస్ ట్రోఫీలో తొలి పోరులో పరాజయం చవిచూసినా హ్యాట్రిక్ విజయాలతో ఇదివరకే భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. నేడు బంగ్లాదేశ్, శ్రీలంకల మధ్య ఆఖరు పొట్టి సమరం జరుగనున్నది. ఈ మ్యాచ్ విజేత ఆదివారం భారత్‌తో ఫైనల్లో తలపడేందుకు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం ఇరు జట్లు ఆడిన మూడేసి మ్యాచుల్లో ఒక్కో విజయంతో పాయింట్ల పట్టికలో రెండేసి పాయింట్లతో సమంగా ఉన్నాయి. శ్రీలంక నెట్ రన్‌రేట్‌లో బంగ్లా కన్నా కాస్త మెరుగ్గా ఉన్నా ఇరు జట్లకూ ఫైనల్ అవకాశాలు సమానంగా ఉన్నాయి. దీంతో నేటి పోరు రసవత్తరం కానున్నది.
చావోరేవో : ఆఖరు మ్యాచ్.. అందునా ఫైనల్ బెర్త్ నిర్ణాయక పోరు కావటంతో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లకు ఈ మ్యాచ్‌లోనే చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఇక బంగ్లా జట్టు విషయానికొస్తే కెప్టెన్ షకిబ్ జట్టులోకి రానుండటం వారికి కలిసొచ్చే అంశం. చేతి వేలికి గాయం కారణంగా నిదాస్ ట్రోఫీకి దూరమైన షకిబ్ అల్ హసన్ నేటి కీలక పోరుకు జట్టులోకి తిరిగి రానున్నాడు. ఆల్‌రౌండర్ షకిబ్ వస్తే జట్టుకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో.. కోలుకున్న అతడిని శుక్రవారం మ్యాచ్‌లోకి తీసుకోనున్నట్టు బంగ్లా క్రికెట్‌బోర్డు తెలిపింది. జట్టులో షకిబ్ లేని తరుణంలోనూ బంగ్లా ఆటగాళ్లు బ్యాట్ ఝుళిపిస్తోన్నా, బౌలింగ్ ఆ జట్టుకు తీవ్ర సమస్యగా పరిణమిస్తోంది. బ్యాట్స్‌మెన్‌లో సౌమ్య సర్కార్, లిటన్ దాస్‌లు సహా వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ ఫామ్‌లో ఉన్నారు. పొట్టి ఫార్మాట్లో బంగ్లా ఓ మోస్తరు స్కోరు చేయాలంటే వీరు రాణిస్తే చాలు. అసలు చిక్కంతా బౌలింగ్‌తోనే. ముస్తాఫిజుర్ రహమాన్, రూబెల్ హోస్సేన్‌లు నిలకడగా బంతులేయటం అలవర్చుకోవాలి. తాస్కిన్ అహ్మద్, మహ్మదుల్లా మినహా మిగిలన బౌలర్లు సిరీస్‌లో సింగిల్ వికెట్ సైతం తీసుకోలేదు. బౌలింగ్ పొరపాట్లను సరిదిద్దుకుంటే బంగ్లాకు ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
శ్రీలంక విషయానికొస్తే ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కుశాల్ మెండిస్ కండరాల గాయం నుంచి కోలుకుని బంగ్లాతో సమరానికి సిద్ధమయ్యాడు. బంగ్లాదేశ్ పర్యటనలో ప్రదర్శనతో బ్యాటింగ్ ఆర్డర్లో పైకొచ్చిన మెండిస్ మరోసారి బంగ్లాపై చెలరేగాలని చూస్తున్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కుశాల్ పెరీరా సైతం లంకకు కీలకం. ఇద్దరు కుశాల్లు ఇప్పటిదాకా విఫలం కాకపోవటంతో బంగ్లా మిడిలార్డర్‌పై పెద్దగా భారం పడలేదు. నేడు సైతం వీరు అదే జోరు కొనసాగించాలని లంక కోరుకుంటుంది. లంక బౌలర్లందరూ మెరుగ్గానే ఉన్నా. కీలక సమయాల్లో బౌలింగ్ భారాన్ని మోయడానికి ఒకరి మీద ఆధార పడే అవకాశం లేదు. అవకాశం చిక్కినపుడు ఒక్కో బౌలర్ రాణిస్తున్నాడు. దీంతో లంక బౌలింగ్ బలంపై ఖచ్చితంగా ఏం చెప్పలేం. ఇరు జట్లు బౌలింగ్ కన్నా బ్యాటింగ్‌లోనే పటిష్టంగా ఉండటంతో ఎవరు చక్కగా బౌలింగ్ చేస్తారో ఆ జట్టుకే విజయావకాశాలు ఉండనున్నాయి.
తుది జట్లు (అంచనా) : శ్రీలంక : దనుష్క గుణతిలక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, దశున్ శనక, దినేశ్ చండిమాల్, ఉపుల్ తరంగ, తిసారా పెరీరా, జీవన్ మెండిస్, అఖిల ధనంజయ, దుశ్మంత చమీరా, నువాన్ ప్రదీప్.
బంగ్లాదేశ్ : తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, షబ్బీర్ రహమాన్, మెహదీ హసన్/తాస్కిన్ అహ్మద్, రూబెల్ హుసేన్, ముస్తాఫిజుర్ రహమాన్, నురుల్ హసన్.