Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్లిన్చిట్ లభిస్తే కాంట్రాక్టు పునరుద్దరణ
- మహ్మద్ షమిపై రాజీవ్ శుక్లా
ముంబయి : భారత క్రికెటర్ మహ్మద్ షమిపై అతడి భార్య మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఐపీఎల్ 11వ సీజన్లో పేస్ బౌలర్ ప్రాతినిథ్యంపై బీసీసీఐ నుంచి కాస్త ఊరటనిచ్చే పరిణామాలు చోటుచేసుకున్నట్టు కనిపిస్తోంది!. ఐపీఎల్లో షమి ప్రాతినిథ్యంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అవినీతి నిరోధక విభాగం నివేదిక వచ్చిన తర్వాతే ఏ నిర్ణయమైనా ఉంటుందని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నా తెలిపారు. బ్రిటన్ వ్యాపారవేత్త ఇచ్చిన డబ్బులు పాకిస్థాన్ అమ్మాయి ద్వారా షమి దుబారులో తీసుకున్నాడని అతడి భార్య హసిన్ జహాన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి షమితో జరిపిన సంభాషణ ఆడియో ఆధారాలను పాలకుల కమిటీ చైర్మెన్ వినోద్ రారుకు ఆమె అందజేసింది. ఇదే ఆడియో టేపు ఆమె సోషల్ మీడియాలోనూ ఉంచింది. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ నీరజ్ కుమార్ దర్యాప్తు నివేదికను వారంలోపు సీవోఏ ముందుంచనున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన రాష్ట్ర జట్ల కెప్టెన్లు, కోచ్ల సమావేశంలో పలువురు బోర్డు (పాలకుల కమిటీ) వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కుటుంబ వ్యవహారంలో మహ్మద్ షమి కేంద్ర కాంట్రాక్టును పక్కనపెట్టడంపై మాజీ క్రికెటర్ అయిన ఓ ఆఫీస్ బేరర్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీనిపై ఐపీఎల్ చైర్మెన్ రాజీవ్ శుక్లా స్పందించారు. ' మహ్మద్ షమి విషయంలో స్పష్టతతో ఉన్నాం. అతడి భార్య చేసిన ఇతర ఆరోపణలపై కోల్కత పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అది పూర్తిగా వారి పరిధిలోని అంశం. బీసీసీఐ నుంచి కేవలం దుబారులో పాక్ అమ్మాయి నుంచి డబ్బులు తీసుకున్న విషయమై విచారణ చేస్తున్నాం. ఈ అంశంలో నీరజ్ కుమార్ కమిటీ షమికి క్లీన్చిట్ ఇస్తే తక్షణమే అతడి కేంద్ర కాంట్రాక్టును పునరుద్దరిస్తాం. న్యాయస్థానంలో జరిగే అతడి ఇతర అంశాలు బీసీసీఐ పరిధిలోకి రావు. బీసీసీఐ ఆటగాళ్ల ప్రవర్తనా నిమయావళి ప్రకారమే చర్యలు తీసుకోగలం. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి క్లిన్చిట్ లభిస్తే షమి తిరిగి కాంట్రాక్టు జాబితాలో చోటుచేసుకుంటాడు' అని శుక్లా తెలిపారు.
న్యాయస్థానంలోనే తేల్చుకుంటా! : భార్య జహన్ హసిన్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని మహ్మద్ షమి తెలిపాడు. 'నా నిర్దోషిత్వం నిరూపించుకునేందుకు నా వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి. నా భార్యతో రాజీపడే ప్రసక్తే లేదు. ఆమెతో నా బంధం ముగిసిన అధ్యాయం. కోర్టు వెలుపల సమస్యను పరిష్కరించుకోవాలని భావించటం లేదు. నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను' అని మహ్మద్ షమి తెలిపాడు.