Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాదేశ్‌తో ముక్కోణపు ఫైనల్ నేడే
- జోరుమీదున్న రోహిత్‌సేన
- భావోద్వేగ జోరులో బంగ్లా ఆటగాళ్లు
- సాయంత్రం 7 నుంచి డి స్పోర్ట్స్‌లో..
శ్రీలంక 70 ఏండ్ల స్వాతంత్య్ర వేడుకల ముక్కోణపు టీ20 టోర్నీ కప్పు కోసం భారత్, బంగ్లాదేశ్ నేడు అమీతుమీకి సిద్ధమయ్యాయి. లంకతో భావోద్వేగ విజయం సాధించిన ఊపుమీదున్న బంగ్లాదేశ్ సీనియర్ల అండతో కప్పుపై కన్నేసింది. రోహిత్ సారథ్యంలో కుర్రాళ్లు కప్పు కొట్టాలనే కసితో కనిపిస్తున్న వేళ.. ముక్కోణపు టైటిల్ పోరులో టీమ్ ఇండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
నవతెలంగాణ-కొలంబో
బంగ్లాదేశ్‌తో పోరు అంటే ఏకపక్షమే అనుకునే స్థితి నుంచి ఉత్కంఠ సమరమనే స్థాయికి చేరుకున్నది. ఇటీవల బంగ్లాదేశ్ వరుసగా పెద్ద జట్లపై విజయాలు సాధిస్తుండటం, ప్రత్యేకించి పొరుగు దేశాలతో తలపడుతున్న సందర్భంలో విపరీత భావోద్వేగాలతో బరిలోకి దిగుతుండటం.. కొత్తగా కనిపిస్తోన్న మార్పులు. సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ కోహ్లి, మాజీ సారథి ధోని గైర్హాజరీలో కుర్రాళ్లు లీగ్ దశలో మూడు విజయాలు సాధించారు. బంగ్లాదేశ్‌ను రెండుసార్లు ఓడించారు. అయినా, ఆతిథ్య శ్రీలంకపై ఛేదనలో రెండుసార్లు పైచేయి సాధించిన షకిబ్ సేన అంతిమ పోరుకు చేరుకున్నది. టీ20 మ్యాచుల్లో ఒత్తిడిని జయించే జట్టునే విజయం వరిస్తుంది. బంగ్లాదేశ్ ఈ విషయంలో ఎంతో మెరుగైంది. కానీ టీమ్ ఇండియాను దాటి కప్పును అందుకునేనా? భారత కుర్రాళ్లు ద్వీపదేశం నుంచి ట్రోఫీతో తిరిగొస్తారా? ఆసక్తికరం.
పటిష్టంగా టీమ్ ఇండియా : సీనియర్లు లేకపోయినా భారత శిబిరం బలోపేతంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అందుకోవటం, డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ సూపర్ ఫామ్ కొనసాగించటం భారత్‌కు బలం. మిడిల్ ఆర్డర్లో సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండేలు జోరుమీదున్నారు. కానీ లోయర్ ఆర్డర్లో యువ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, విజరు శంకర్లు ఒత్తిడిలో ఏ మేరకు రాణిస్తారనేది ప్రశ్నార్థకం. యుజ్వెంద్ర చాహల్ మంచి అనుభవమే గడించినా.. ఇటీవల ఒత్తిడికి లోనవుతూ ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్నాడు. బంతితో విశేషంగా ఆకట్టుకుంటున్న వాషింగ్టన్ సుందర్ నేటి మ్యాచ్‌లోనూ కీలకం కానున్నాడు. అవకాశం వస్తే ఆల్‌రౌండర్‌గా నిరూపించుకునేందుకు సుందర్ ఎదురుచూస్తున్నాడు.
భావోద్వేగ బంగ్లాదేశ్ : ముష్ఫీకర్ రహీం, మహ్మదుల్లా మెరుపులతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్ బలంగా తయారైంది. శ్రీలంకపై తొలుత 200 పైచిలుకు ఛేదనలో, తాజాగా ఆఖరి లీగ్ మ్యాచ్ ఛేదనలోనూ వీరిద్దరు బంగ్లా ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలబడ్డారు. తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్‌లు ఫర్వాలేదనిపిస్తున్నారు. కానీ సౌమ్య సర్కార్, షబ్బీర్ రెహమాన్లపై పరుగులు చేయాల్సిన ఒత్తిడి పెరుగుతోంది. కెప్టెన్ షకిబ్ అల్ హసన్ ఎప్పుడూ ప్రమాదకర ఆటగాడే. బంతితో ముస్తాఫిజుర్ రెహమాన్ ప్రధాన పేసరే కానీ రూబెల్ హొసెన్ ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. ఆఫ్‌స్పిన్నర్ మెహది హసన్ నుంచి బంగ్లా మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది.
వర్షం ముప్పు : తుది పోరుకు కొలంబోలో బ్యాటింగ్ పిచ్ సిద్ధమైంది. వికెట్ స్వభావం దృష్ట్యా బౌలర్లకు సైతం సహకరించనున్నది. అయినా, భారీ స్కోరుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు. సాయంత్రం చిరు జల్లులు కురిసే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్‌కు వచ్చిన ప్రమాదమేమీ లేకపోయినా.. వర్షం తీవ్రత పెరిగితే ఆటకు ఆటంకం కలిగే ప్రమాదం లేకపోలేదు.