Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ ఇంగ్లాండ్ ప్రదర్శన సంతృప్తికరం
నవతెలంగాణ క్రీడా విభాగం
ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్స్. బ్యాడ్మింటన్‌లో గ్రాండ్‌స్లామ్ అనదగిన ప్రతిష్టాత్మక టోర్నీ. ఒలింపిక్ స్వర్ణానికి ఉన్న వన్నె, ప్రాముఖ్యత ఈ టైటిల్‌కు ఉంటుంది. ప్రతి బ్యాడ్మింటన్ ప్లేయర్ సాధించాలని స్వప్నించే ట్రోఫీ ఇది. భారత షట్లర్ల బృందం ఇటీవల వరుసగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంది. అనితర సాధ్యం కాని విజయాలతో దూసుకెళ్తోంది. కానీ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ మాత్రం ఈ తరానికి ఇంకా అందని ద్రాక్షలాగే మిగిలింది!. ఈ ఏడాది ఆల్ ఇంగ్లాండ్‌లో మన షట్లర్ల పోరు సెమీఫైనల్లోనే ముగిసినా.. ఓవరాల్ ప్రదర్శన సంతృప్తికరమే. మరో 15 రోజుల్లో ఆరంభం కానున్న కామన్వెల్త్ క్రీడల్లో పతకం భరోసా ఇచ్చే ప్రదర్శన మనోళ్లు చేసేశారు!.
గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడలు ఏప్రిల్ 4 నుంచి ఆరంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో మనకు పతకం రాకపోయినా.. రానున్న టోర్నీలో పతక ప్రదర్శన ఖాయమేనని అనిపిస్తోంది. పి.వి సింధు బర్మింగ్‌హామ్‌లో ఆరుసార్లుగా క్వార్టర్‌ఫైనల్స్ అడ్డంకి దాటలేదు. కానీ ఈసారి సెమీఫైనల్లోకి చేరుకున్నది. క్వార్టర్స్‌లో వరల్డ్ చాంపియన్ నొజొమి ఒకుహరతో మరో సూపర్ ఫైట్‌లో పైచేయి సాధించిన సింధు.. సెమీస్‌లోనూ సూపర్ ప్రదర్శన చేసింది. వరల్డ్ నెం.2 యమగూచిని దాటేసినట్టే అనిపించినా.. ఆఖర్లో ఫలితం మరోలా వచ్చింది. అయినా, భారత బ్యాడ్మింటన్ అభిమానులు నిరాశపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓడినా, సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న పి.వి సింధు గోల్డ్‌కోస్ట్‌లో స్వర్ణం రేసులో హాట్‌ఫేవరేట్. గ్లాస్గో కామన్వెల్త్ మహిళల సింగిల్స్‌లో సింధు కాంస్యం సాధించింది. ఈసారి స్వర్ణ రేసులో సహచర షట్లర్ సైనా నెహ్వాలే ఆమెకు ప్రధాన ప్రత్యర్థి. రియో ఒలింపిక్స్ నుంచి ఫామ్ లయ కోల్పోయిన సైనా నెహ్వాల్.. ఆల్ ఇంగ్లాండ్‌లోనూ పుంజుకోలేదు. తొలి రౌండ్లోనే వరల్డ్ నం.1 థారు జు యింగ్ చేతిలో కంగుతిన్నది. ప్రస్తుతం సైనా నెహ్వాల్ టాప్-10లో భాగం కాని షట్లర్. సైనా ఆట ఆందోళకరంగానే ఉన్నా.. సింధు ఫామ్ అభిమానులకు గోల్డ్ గ్యారెంటీ అందిస్తోంది!.
ఇక పురుషుల విభాగంలో గాయంతో రెండు నెలల విరామం తర్వాత కోర్టులోకి అడుగుపెట్టిన హెచ్.ఎస్ ప్రణరు ఆల్ ఇంగ్లాండ్‌లో క్వార్టర్‌ఫైనల్స్ వరకూ చేరుకున్నాడు. మూడు గేముల పోరాటంలో తృటిలో సెమీస్ బెర్త్ చేజార్చుకున్నా.. ప్రణరు ప్రదర్శన అద్భుతం. గతంలో గాయంతో మూడు నెలలు ఆటకు దూరమైన ప్రణరు పునరాగమనంలో వరుసగా లీగ్ చో వీ, లిన్ డాన్లపై మెరుపు విజయలు నమోదు చేశాడు. ఇండోనేషియాలో నిరుడు ప్రణరు ప్రదర్శన అమోఘం. ఇప్పుడు ఆల్ ఇంగ్లాండ్‌లోనూ ప్రణరు అదే జోరు చూపించే ప్రయత్నం చేశాడు. ఫలితం అనుకూలంగా లేకపోయినా.. ప్రణరు ప్రదర్శన సానుకూలాంశం. కామన్వెల్త్ గోల్డ్ రేసులో శ్రీకాంత్‌తో పాటు లీగ్ చోంగ్ వీలు ప్రణరుకు ప్రధాన ప్రత్యర్థులు. ఇక నిరుడు నాల్గు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించిన కిదాంబి శ్రీకాంత్.. మెగా టోర్నీల్లో వైఫల్య యాత్ర కొనసాగించాడు. నిరుడు వరల్డ్ చాంపియన్‌షిప్స్, ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో అలవోక డ్రాలు ఎదురైనా శ్రీకాంత్ తడబడ్డాడు. తాజాగా ఆల్ ఇంగ్లాండ్‌లోనూ శ్రీకాంత్ సులభమైనా డ్రా ఎదురైనా క్వార్టర్స్‌కు చేరుకోలేదు. అనామక షట్లర్ చేతిలో ఓటమిపాలయ్యాడు. సింధు, ప్రణరు, శ్రీకాంత్‌ల మ్యాచ్ ఫలితాలు చేదుగా ఉన్నా.. టోర్నీలో వారి దూకుడైన ప్రదర్శన అభిమానులకు సంతృప్తినిచ్చింది. వచ్చే నెలలో ఆరంభం కానున్న కామన్వెల్త్ క్రీడల్లో మూడు పతకాలకు ఈ ముగ్గురు షట్లర్లు భరోసా ఇచ్చినట్టే భావించవచ్చు!
'మూడు గేముల మ్యాచ్ ఆడటం అంత సులభమైన విషయం కాదు. ఆఖర్లో 2-3 పాయింట్లే ఎంతో వ్యత్యాసం చూపిస్తాయి. ఆఖరున ఎవరైనా గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఆల్ ఇంగ్లాండ్‌లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఓడినా, గెలిచినా.. బర్మింగ్‌హామ్ ప్రదర్శన సంతృప్తికరం. రానున్న టోర్నీల్లో మరింత ధృడంగా సిద్ధమైన రావాల్సిన అవసరం ఉంది'
- పి.వి సింధు