Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
కోల్‌కత : భారత పరిమిత ఓవర్ల జట్టులో స్టార్ స్పిన్నర్. ఐపీఎల్లో అతడి ప్రదర్శనపై కోల్‌కత ఎన్నో ఆశలు పెట్టుకున్నది. కానీ 12 మ్యాచుల్లో అతడు పడగొట్టినది కేవలం 9 వికెట్లు మాత్రమే. ఎకానమీ విషయంలోనూ 8.5తో అంచనాలను అందుకోలేదు. కానీ రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో అతడు విజృంభించాడు. టాప్ ఆర్డర్‌ను టపటపా కూల్చేసి ఔరా అనిపించాడు. అతడే యువ స్పిన్ సంచలనం కుల్దీప్ యాదవ్. మంగళవారం ఈడెన్‌గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కుల్దీప్ యాదవ్ (4/20)తో అదరగొట్టాడు. పవర్ ప్లే ముగిసిన తర్వాత బంతి అందుకున్న కుల్దీప్ యాదవ్.. రాయల్స్ పవర్ఫుల్ బ్యాట్స్‌మెన్‌ను సాగనంపాడు. వరుసగా 12 మ్యాచుల్లో నిరుత్సాహకర ప్రదర్శనకు తోడు ముంబయి వంటి భారీ హిట్టర్లున్న జట్లు కుల్దీప్ లక్ష్యంగా విరుచుకుపడ్డాయి. ఈ తరుణంలో రాజస్థాన్ రాయల్స్‌పై అతడి ప్రదర్శనకు ప్రేరణ ఇచ్చింది ప్రత్యర్థి శిబిరంలోనే రోల్ మోడలే అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ను చూసి ప్రేరణ పొందా, ఈ ప్రదర్శనకు ఆయనే కారణమని కుల్దీప్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. ' షేన్ వార్న్‌కు నేను ఎప్పుడూ పెద్ద అభిమానిని. అతడు నా రోల్ మోడల్. షేన్ వార్న్ చూస్తుండగా ఆడుతున్నప్పుడు నేనెప్పుడూ భిన్నమైన ప్రేరణ పొందుతాను. అతడి ముందు మంచి ప్రదర్శన చేయాలని తహతహలాడుతాను' అని కుల్దీప్ యాదవ్ అన్నాడు. కుల్దీప్ నాలుగు వికెట్ల ప్రదర్శనతో రాయల్స్ 142 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
రాజస్థాన్ కెప్టెన్ అజింక్య రహానెను తొలిసారి అవుట్ చేసిన కుల్దీప్.. స్టార్ బ్యాట్స్‌మన్ జోశ్ బట్లర్ వికెట్ సంతృప్తినిచ్చిందని చెప్పాడు. తన నాలుగు ఓవర్లలో ఒక్కో ఓవర్‌కు ఓ వికెట్ కూల్చిన కుల్దీప్ కోల్‌కత విజయానికి బాటలు వేశాడు. రానున్న ఇంగ్లాండ్ పర్యటనలో బంతులేయటంపై వార్న్ నుంచి సలహాలు అందుకున్నట్టు కుల్దీప్ చెప్పాడు. ' మ్యాచ్ అనంతరం షేన్ వార్న్‌తో మాట్లాడాను. ఇంగ్లాండ్ సిరీస్ గురించి అప్పుడే వ్యూహం మొదలెట్టాను. సంభాషణ సమయం కొంచమే ఐనా..కొన్ని చిట్కాలు చెప్పాడు. బహుశా ఐపీఎల్ ముగిసిన తర్వాత అతడితో మాట్లాడతాను. ఇంగ్లాండ్ పర్యటన కోసం ఆయన సూచనలు తీసుకుంటాను' అని కుల్దీప్ అన్నాడు.