Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్ చేతిలో అనూహ్య ఓటమి
- 2018 సీజన్ నుంచి నిష్క్రమణ
- రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
తొలుత పేలవ ప్రదర్శన. ఆశలు అడుగంటిన సమయంలో కండ్లుచెదిరే విజయాలు. ఇంత చేసి ఆఖరి ఆటలో చెత్త ప్రదర్శన, అనూహ్య ఓటమి. ఇదీ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కథ. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్‌కు తలొంచిన కోహ్లిసేన కథ ముగిసింది. ఐపీఎల్ 11 సీజన్ నుంచి బెంగళూర్ నిష్క్రమించింది. కీలక మ్యాచ్‌లో నెగ్గిన రాజస్థాన్.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం కానీ ఇతర సమీకరణాలు కలిసొస్తేనే ప్లే ఆఫ్స్ ప్రవేశం!.
నవతెలంగాణ-జైపూర్
బెంగళూర్ కుర్రాళ్లు ఐపీఎల్లో బెంగళూర్ ఆశలను ఆవిరి చేశారు. ప్లే ఆఫ్స్ రేసులో అమీతుమీ తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కండ్లుచెదిరే ప్రదర్శన చేసిన శ్రేయాష్ గోపాల్ (4/16), కె. గౌతం (1/6) రాజస్థాన్‌ను కీలక విజయాన్ని అందించారు. బెంగళూర్‌పై 30 పరుగుల తేడాతో గెలుపొందిన రాజస్థాన్ ప్రస్తుతం 14 పాయింట్లతో నిలిచింది. 165 పరుగుల ఛేదనలో బెంగళూర్ చేతులెత్తేసింది. స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ (53, 35 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించినా బెంగళూర్ 134 పరుగులకే కుప్పకూలింది. రాజస్థాన్ తరఫున మెరుపు ప్రదర్శన చేసిన శ్రేయాష్ గోపాల్, కృష్ణప్ప గౌతం బెంగళూర్‌ను సమర్థవంతంగా నిలువరించారు. కెప్టెన్ విరాట్ కోహ్లి (4) విఫలమయ్యాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (80 నాటౌట్, 58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీతో కదంతొక్కాడు. అజింక్య రహానె (33), హెన్రిచ్ క్లాసెన్ (32) రాణించారు. బెంగళూర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ (3/25) ఆకట్టుకున్నాడు. శ్రేయాష్ గోపాల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు.
ఏబీ పోరాడినా.. : లక్ష్యం 165 పరుగులు. బిగ్ హిట్టర్లున్న బెంగళూర్‌కు ఇది పెద్ద కష్టం కాదు!. కానీ ఛేదన బెంగళూర్‌కు అనుకూలంగా సాగలేదు. ఆరంభంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లి (4) వికెట్ కోల్పోయాడు. కృష్ణప్ప గౌతం మెరుపు బంతితో కోహ్లి వికెట్ గిరాటేశాడు. కానీ మరో ఓపెనర్ పార్దీవ్ పటేల్ (33, 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి ఏబీ డివిలియర్స్ (53, 35 బంతుల్లో 7 ఫోర్లు) కీలక భాగస్వామ్యం నిర్మించాడు. రాయల్స్ బౌలర్లు మెరుగ్గా బంతులేసినా ఈ జోడీ పరుగులు రాబట్టింది. డివిలియర్స్ ఏడు ఫోర్లు బాదగా.. పార్దీవ్ మూడు ఫోర్లు, 2 సిక్సర్లతో రాణించాడు. కానీ శ్రేయాష్ గోపాల్ ఓవర్లో క్రీజు విడిచి ఆడబోయిన ఈ జోడీ స్వల్ప విరామంలోనే డగౌట్‌కు చేరుకున్నది. వికెట్ కీపర్ క్లాసెన్ మెరుపు స్టంపింగ్స్‌తో ఏబీ, పార్దీవ్లను సాగనంపాడు. 75/1తో లక్ష్యం దిశగా సాగిన బెంగళూర్ ఒక్కసారిగా 85/4తో ఒత్తిడిలో పడింది. మోయిన్ అలీ (1), మన్దీప్ సింగ్ (3)లు అలా వచ్చి ఇలా వెళ్లారు. లోయర్ ఆర్డర్లో గ్రాండ్‌హౌమె (2), సర్ఫరాజ్ ఖాన్ (7)లు నిరాశపరిచారు. సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరగటంతో ముందే బెంగళూర్ ఓటమి ఖరారైంది. సౌథి (14), మహ్మద్ సిరాజ్ (14)లు ఓటమి అంతరాన్ని తగ్గించారు. 19.2 ఓవర్లలోనే బెంగళూర్ కుప్పకూలగా.. రాజస్థాన్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
త్రిపాఠి మెరిసెన్ : టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 164 పరుగులు సాధించింది. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (80 నాటౌట్, 58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీతో రాయల్స్ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. జోఫ్రా ఆర్చర్ (0), సంజూ శాంసన్ (0) విఫలమైనా.... కెప్టెన్ అజింక్య రహానె (33), హెన్రిచ్ క్లాసెన్ (32)లు ఆఖర్లో రాణించారు. 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన రాహుల్.. తర్వాత సైతం జోరు కొనసాగించాడు. భారీ షాట్లతో విరుచుకుపడకపోయినా.. పరిస్థితికి అనుగుణంగా ఉపయుక్తమైన పరుగులు చేశాడు. బెంగళూర్ బౌలర్ ఉమేశ్ యాదవ్ (3/25) మూడు వికెట్లతో మెరిశాడు.
స్కోరు వివరాలు : రాజస్థాన్ ఇన్నింగ్స్ : రాహుల్ త్రిపాఠి నాటౌట్ 80, ఆర్చర్ (సి) పార్దీవ్ (బి) ఉమేశ్ 0, రహానె (ఎల్బీ) ఉమేశ్ 33, శాంసన్ (సి) అలీ (బి) ఉమేశ్ 0, క్లాసెన్ (సి) అలీ (బి) గ్రాండ్‌హౌమె 32, గౌతం రనౌట్ 14, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : ( 20 ఓవర్లలో 5 వికెట్లకు) 164.
వికెట్ల పతనం : 1-2, 2-101, 3-101, 4-149, 5-164.
బౌలింగ్ : చాహల్ 4-0-26-0, ఉమేశ్ యాదవ్ 4-1-25-3, మోయిన్ అలీ 2-0-19-0, టిమ్ సౌథి 4-0-37-0, మహ్మద్ సిరాజ్ 4-0-33-1, గ్రాండ్‌హౌమె 2-0-23-0.
బెంగళూర్ ఇన్నింగ్స్ : విరాట్ కోహ్లి (బి) గౌతంం 4, పార్దీవ్ పటేల్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) గోపాల్ 53, డివిలియర్స్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) గోపాల్ 53, మోయిన్ అలీ (సి,బి) గోపాల్ 1, మన్దీప్ సింగ్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) గోపాల్ 3, గ్రాండ్‌హౌమె (సి) రహానె (బి) లాంగ్లిన్ 2, సర్ఫరాజ్ ఖాన్ (సి) క్లాసెన్ (బి) లాంగ్లిన్ 7, సౌథి (సి) గౌతం (బి) ఉనద్కత్ 14, ఉమేశ్ యాదవ్ (బి) లాంగ్లిన్ 0, మహ్మద్ సిరాజ్ (సి) గౌతం (బి) ఉనద్కత్ 14, చాహల్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 03, మొత్తం : (19.2 ఓవర్లలో ఆలౌట్) 134.
వికెట్ల పతనం : 1-20, 2-75, 3-77, 4-85, 5-96, 6-98, 7-108, 8-108, 9-128, 10-134.
బౌలింగ్ : గౌతం 2-0-6-1, ఆర్చర్ 4-0-37-0, లాంగ్లిన్ 2-0-15-2, ఉనద్కత్ 3.2-0-27-2, గోపాల్ 4-0-16-4, సోధి 4-0-31-1.