Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నైని ఒంటిచేత్తో ఫైనల్స్‌కు చేర్చిన డుప్లెసిస్
- సన్‌రైజర్స్ బౌలర్ల సమష్టి శ్రమ వృథా
- ఉత్కంఠ పోరులో హైదరాబాద్‌కు చుక్కెదురు
వాంఖడేలో సన్‌రైజర్స్ 139 పరుగులకే పరిమితం.. దీంతో చెన్నై విజయం నల్లేరు మీద నడకే అనిపించింది. కానీ సన్‌రైజర్స్ బంతితో మళ్లీ మ్యాజిక్ చేసింది. ఛేదనలో సూపర్ కింగ్స్ 62/6తో ఓటమి అంచుల్లో నిలిచింది. రాయుడు, ధోని, రైనా, వాట్సన్, బ్రావో, జడేజాలు అప్పటికే పెవిలియన్‌కు చేరుకున్నారు. సన్‌రైజర్స్ ఫైనల్లోకి చేరటం లాంఛనమే అనిపించింది!.
కానీ ఓ వైపు వికెట్లు కూలుతున్నా.. మరో ఎండ్‌లో నిలిచిన డుప్లెసిస్ (67 నాటౌట్, 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సన్‌రైజర్స్‌కు షాకిచ్చాడు. ఆఖర్లో షార్దుల్ ఠాకూర్ (15 నాటౌట్) తోడుగా డుప్లెసిస్ అదరగొట్టాడు. 18 బంతుల్లో 43 పరుగులు చేయాల్సి ఉండగా.. వీరోచిత ఇన్నింగ్స్‌తో మరో 5 బంతులుండగానే లాంఛనం ముగించాడు. సన్‌రైజర్స్‌పై విజయంతో సూపర్ కింగ్స్ ఐపీఎల్లో రికార్డు స్థాయిలో ఏడోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. మరే జట్లూ ఇన్ని సార్లు టైటిల్ పోరుకు చేరలేదు. ఆఖరు వరకూ పోరాడిన సన్‌రైజర్స్.. క్వాలిఫయర్-2లో మరోమారు అదృష్టం పరీక్షించుకోనున్నది.
నవతెలంగాణ-ముంబయి
ఆఖరి 3 ఓవర్లు. చెన్నైకి మరో 43 పరుగుల దూరంలో ఫైనల్స్ బెర్త్. డుప్లెసిస్ (67 నాటౌట్) క్రీజులో ఉన్నా సన్‌రైజర్స్‌కే అవకాశాలు!. బ్రాత్‌వైట్ బౌలింగ్.. సరైన సమయంలో చెలరేగిన డుప్లెసిస్ మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో ఆ ఓవర్లో 20 పరుగులు పిండుకున్నాడు. తర్వాత ఓవర్ సిద్దార్థ్ కౌల్ వంతు. స్ట్రయికర్ షార్దుల్ ఠాకూర్ (15 నాటౌట్, 5 బంతుల్లో 3 ఫోర్లు) కావటంతో మళ్లీ హైదరాబాద్ వైపే మొగ్గు. కానీ ఠాకూర్ తొలి రెండు బంతుల్నీ బౌండరీ తరలించాడు. ఆఖరి బంతినీ బౌండరీ లైన్ దగ్గరికి పంపించాడు. దీంతో ఆఖరి ఓవర్ సమీకరణం 6 పరుగులకే చేరుకున్నది. ఆఖరి ఓవర్లో భువనేశ్వర్ వచ్చినా.. సిక్సర్ సంధించిన డుప్లెసిస్ చెన్నైకి ఫైనల్లోకి చేర్చాడు. రషీద్ ఖాన్ (2/11) రాణించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 139 పరుగులు చేసింది. టెయిలెండర్ బ్రాత్‌వైట్ (43 నాటౌట్) మెరుపులతో సన్‌రైజర్స్ ఆ మాత్రం పరుగులైనా చేయగల్గింది. ధావన్ (0), మనీశ్ పాండే(8), షకిబ్ (12), గోస్వామి (8) విఫలమయ్యారు.
డుప్లెసిస్ ఒంటిచేత్తో.. : లక్ష్యం 140 పరుగులే. పైగా బౌలర్లపై మంచు ప్రభావం. ఛేదనలో మొగ్గు చెన్నై వైపే. కానీ బంతి బలానికి పెట్టింది పేరైన సన్‌రైజర్స్ మరోమారు మ్యాజిక్ చేసేలా కనిపించింది. ఉత్కంఠ మ్కాచ్లో స్వల్ప స్కోరును నిలుపుకోవటంలో సక్సెస్ అంచున నిలిచింది. ఈ క్రమంలో టాప్ బ్యాట్స్‌మెన్‌ను వెనక్కి పంపినా.. డుప్లెసిస్ ఒక్కడే హైదరాబాద్‌కు ఎదురొడ్డాడు. ఒంటిచేత్తో చెన్నైకి ఫైనల్లోకి తీసుకెళ్లాడు. ఇక తొలి ఓవర్లోనే ఓపెనర్ షేన్ వాట్సన్ (0) వికెట్ పడగొట్టిన భువనేశ్వర్.. సూపర్ కింగ్స్ పతనానికి తొలి అడుగు వేశాడు. ఐదు బంతులాడిన వాట్సన్.. పరుగులేమీ చేయకుండానే వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. సురేశ్ రైనా (22, 13 బంతుల్లో 4 ఫోర్లు) సహజశైలిలో ఆడాడు. నాలుగు బౌండరీలతో ఇన్నింగ్స్‌కు ఊపుతీసుకొచ్చాడు. కానీ అతడి కథకు సిద్దార్థ్ కౌల్ ముగింపు పలికాడు. వరుస బంతుల్లో రైనా, అంబటి రాయుడు (0)లను అవుట్ చేసి చెన్నైని కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఛేదనలో మొనగాడు ఎం.ఎస్ ధోని (9) స్పిన్ వలలో చిక్కుకున్నాడు. రషీద్ ఖాన్ గూగ్లీతో చెన్నై సారథి వికెట్లను గిరాటేశాడు. విధ్వంసకర డ్వేన్ బ్రావో (7)నూ రషీద్ వెనక్కి పంపాడు. రవీంద్ర జడేజా (7)ను సందీప్ శర్మ వెనక్కి పంపాడు. దీంతో 62/6తో చెన్నై పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కానీ ఓపెనర్ డుప్లెసిస్ (67) క్రీజులోనే ఉండటంతో చెన్నై ఆశలు సజీవంగానే ఉన్నాయి. దీపక్ చాహర్ (10, 6 బంతుల్లో 1 సిక్స్)తో కలిసి ఏడు వికెట్‌కు 20 పరుగులు జోడించిన డుప్లెసిస్.. చెన్నైని రేసులోనే నిలిపాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో ఓ సిక్సర్ కొట్టిన చాహర్ అతడి బంతికే వికెట్ కోల్పోయాడు. అప్పటికీ చెన్నై స్కోరు 92/7. హర్బజన్ సింగ్ (2) సైతం అవుటైనా.. ఆఖర్లో షార్దుల్ ఠాకూర్ (15) తోడుగా డుప్లెసిస్ మరుపు రాని విజయాన్ని అందించాడు. బ్రాత్‌వైట్, సిద్దార్థ్ కౌల్ల వరుస ఓవర్లలో 36 పరుగులు పిండుకుని.. ఆఖరు ఓవర్‌కు ముందే విజయాన్ని ఖరారు చేసేశారు. భువి బంతిని సిక్సర్‌గా మలిచిన డుప్లెసిస్.. లాంఛనం ముగించాడు.
బ్రాత్‌వైట్ ధనాధన్ : టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ధోని తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే దీపక్ చాహర్ సన్‌రైజర్స్ షాకిచ్చాడు. ఫామ్‌లోఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ (0) తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కానీ ఓవర్లో ఆఖరి మూడు బంతుల్ని బౌండరీకి తరలించిన కేన్ విలియమ్సన్ (24, 15 బంతుల్లో 4 ఫోర్లు) వెంటనే దూకుడు చూపించాడు. కానీ చెన్నై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు కూల్చటంతో సన్‌రైజర్స్ కుదేలైంది. ఓపెనర్ గోస్వామి (12)ని లుంగి అవుట్ చేయగా.. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కేన్‌ను తర్వాతి ఓవర్లోనే షార్దుల్ ఠాకూర్ బలిగొన్నాడు. మనీశ్ పాండే (8), షకిబ్ అల్ హసన్ (12)లు ఎంతోసేపు వికెట్ కాపాడుకోలేదు. దీంతో 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మరో వైపు రన్‌రేట్ 6కు సమీపంలో కూడా లేని పరిస్థితి. షకిబ్ అల్ హసన్ (12), యూసుఫ్ పఠాన్ (24)లు బౌండరీలతో కాసేపు నిలిచినా.. కొద్దిసేపటికే వారిద్దరూ చేతులెత్తేశారు. 15 ఓవర్లలో 88/6తో హైదరాబాద్ వంద పరుగులైనా చేయగలదా? అనిపించింది.
కానీ టెయిలెండర్ల జోడీ హైదరాబాద్‌కు గౌరవప్రద స్కోరు అందించింది. విండీస్ మెరుపు కార్లోస్ బ్రాత్‌వైట్ (43 నాటౌట్, 29 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు), భువనేశ్వర్ కుమార్ (7) ఏడో వికెట్‌కు ఫిఫ్టీ ప్లస్ పరుగులు జోడించింది. 18వ ఓవర్లో దాడి మొదలెట్టిన బ్రాత్‌వైట్.. షార్దుల్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు సంధించాడు. అతడే వేసిన ఆఖరి ఓవర్లోనూ బ్రాత్‌వైట్ మరో రెండు భారీ సిక్సర్లతో చెలరేగాడు. బ్రాత్‌వైట్ మెరుపులతో హైదరాబాద్ 139 పరుగులు సాధించింది. చెన్నై బౌలర్లలో బ్రావో (2/25) రెండు వికెట్లు కూల్చగా.. చాహర్, ఎంగిడి, ఠాకూర్, జడేజాలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : శిఖర్ ధావన్ (బి) దీపక్ చాహర్ 0, శ్రీవాత్సవ గోస్వామి (సి,బి) లుంగి ఎంగిడి 12, కేన్ విలియమ్సన్ (సి) ధోని (బి) షార్దుల్ ఠాకూర్ 24, మనీశ్ పాండే (సి,బి) జడేజా 8, షకిబ్ అల్ హసన్ (సి) ధోని (బి) బ్రావో 12, యూసుఫ్ పఠాన్ (సి,బి) బ్రావో 24, కార్లోస్ బ్రాత్‌వైట్ నాటౌట్ 43, భువనేశ్వర్ కుమార్ రనౌట్ (ధోని) 7, ఎక్స్‌ట్రాలు : 09, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 139.
వికెట్ల పతనం : 1-0, 2-34, 3-36, 4-50, 5-69, 6-88, 7-139.
బౌలింగ్ : దీపక్ చాహర్ 4-0-31-1, లుంగి ఎంగిడి 4-0-20-1, షార్దుల్ ఠాకూర్ 4-0-50-1, డ్వేన్ బ్రావో 4-0-25-2, రవీంద్ర జడేజా 4-0-13-1.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : షేన్ వాట్సన్ (సి) గోస్వామి (బి) భువనేశ్వర్ 0, డుప్లెసిస్ నాటౌట్ 67, సురేశ్ రైనా (బి) సిద్దార్థ్ కౌల్ 22, అంబటి రాయుడు (బి) సిద్దార్థ్ కౌల్ 0, ఎం.ఎస్ ధోని (బి) రషీద్ ఖాన్ 9, డ్వేన్ బ్రావో (సి) ధావన్ (బి) రషీద్ ఖాన్ 7, రవీంద్ర జడేజా (సి,బి) సందీప్ శర్మ 3, దీపక్ చాహర్ (సి) బ్రాత్‌వైట్ (బి) సందీప్ శర్మ 10, హర్బజన్ సింగ్ రనౌట్ (బ్రాత్‌వైట్) 2, షార్దుల్ ఠాకూర్ నాటౌట్ 15, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : (19.1 ఓవర్లలో 8 వికెట్లకు) 140.
వికెట్ల పతనం : 1-0, 2-24, 3-24, 4-39, 5-57, 6-62, 7-92, 8-113.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 3.1-0-14-1, సందీప్ శర్మ 3-0-30-2, సిద్దార్థ్ కౌల్ 4-0-32-2, కార్లోస్ బ్రాత్‌వైట్ 3-0-31-0, రషీద్ ఖాన్ 4-0-11-2, షకిబ్ అల్ హసన్ 2-0-20-0.