Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఏబీ డివిలియర్స్
- వరల్డ్‌కప్‌కు ముందే 'మిస్టర్ 360' వీడ్కోలు
140 కిమి వేగంతో బంతి దూసుకొస్తున్నా... శరీరాన్ని విల్లులా వంచి కండ్లుచెదిరే రీతిలో సిక్సర్లు సంధించటం ఇక చూడలేమేమో!. మైదానం నలుమూలలా బ్యాట్‌తో కర్రసాము చేసే 'మిస్టర్ 360' అద్భుత విన్యాసాలకు ఇక సెలవ్!. ఆధునిక క్రికెట్ మేటీ ఆటగాడు, దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. అలసిపోయాను, ఇక నాలో శక్తి లేదంటూ 34 ఏండ్ల వయసులో వీడ్కోలు పలికాడు. 2019 ప్రపంచకప్ విజయంతో ఏబీ వీడ్కోలు పలుకుతాడని క్రికెట్ ప్రపంచం ఆసక్తితో ఎదురుచూసినా, మిస్టర్ 360 మరోలా ఆలోచించాడు. ప్రపంచకప్ విజయం నా కెరీర్‌ను నిర్దేశించలేదంటూ ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్లో బెంగళూర్ కథ ముగిసిన నాల్గు రోజుల్లోనే డివిలియర్స్ నుంచి వీడ్కోలు ప్రకటన వెలువడటం కాస్త ఆశ్చర్యం!.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
'నేను అలసిపోయాను'.. ఆధునిక క్రికెట్ దిగ్గజం, అత్యుత్తమ బ్యాట్స్‌మన్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికిన మాటలవి. 14 ఏండ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో దుమ్మురేపుతోన్న అబ్రహం బెంజమిన్ డివిలియర్స్ క్రికెట్ సెలవు చెప్పాడు. ఐపీఎల్ సీజన్ ముగించుకున్న డివిలియర్స్ (34) తన అధికారిక యాప్‌లో వీడియో సందేశంతో వీడ్కోలు ప్రకటన చేశాడు. ' అన్ని ఫార్మాట్లలోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తక్షణమే వైదొలగాలని నిర్ణయించుకున్నాను. 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు.. ఇప్పుడు ఇతరుల అవకాశం. నా శకం ముగిసింది, నిజాయితీగా చెప్పాలంటే నేను అలసిపోయాను' అని ఏబీ డివిలియర్స్ వీడ్కోలు ప్రకటన చేశాడు. ఇదెంతో కఠినమైన నిర్ణయం, దీని గురించి సుదీర్ఘంగా ఆలోచించాను. మంచిగా ఆడుతున్నప్పుడే వీడ్కోలు చెప్పేందుకు ఇష్టపడతాను. భారత్, ఆస్ట్రేలియాలపై అమోఘమైన సిరీస్ విజయాల తర్వాత ఇక తప్పుకునే తరుణం ఆసన్నమైందని అనిపించింది. జాతీయ జట్టుకు ఈ ఫార్మాట్లోనే, ఈ సమయంలోనే, ఇక్కడై తేనే ఆడతానని ఎంచుకోవటం భావ్యం కాదనిపిం చింది. సుదీర్ఘ కెరీర్లో మద్దతుగా నిలిచిన దక్షిణాఫ్రికా సహాయక సిబ్బంది, కోచ్‌లకు ఎల్లప్పుడూ కృతజ్ఞడినే. నా కెరీర్లో కలిసి ఆడిన జట్టు సహచరులకు అతిపెద్ద పెద్ద థ్యాంక్స్. ఈ నిర్ణయం మరో చోట ఎక్కువ సంపాదించవచ్చు అని కాదు. నాలో సత్తా తగ్గిపోతుం దని, తప్పుకోవడానికి ఇదే సరైన సమయం. ప్రతీ దానికి ఓ ముగింపు ఉంటుంది. దక్షిణాఫ్రికా సహా ప్రపంచ వ్యాప్త క్రికెట్ అభిమానులకు ధన్యవాదాలు అని డివిలియర్స్ వీడియో సందేశంలో తెలిపాడు. ఐతే విదేశాల్లో (టీ20 లీగ్‌లు) ఆడాలనే ఆలోచన లేదు. కానీ దేశవాళీ క్రికెట్లో టైటాన్స్‌కు అందుబాటులో ఉంటాననే ఆశిస్తున్నాను. సఫారీ సారథి డుప్లెసిస్, దక్షిణాఫ్రికా క్రికెట్‌కు అతి పెద్ద మద్దతుదారుగా కొనసాగుతూనే ఉంటానని ఏబీ అన్నాడు.
వరల్డ్‌కప్ ఆడకుండానే.. : ప్రపంచ క్రికెట్ ప్రస్తుత తరంలో మేటి ఆటగాడైనా ఏబీ డివిలియర్స్ కెరీర్‌పై మూడేండ్ల కిందటే ఊహాగానాలు, చర్చోపచర్చలు సాగాయి. 2015 భారత పర్యటనలో విఫలయాత్ర తరువాత ఏబీ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. 0-3 ఓటమి సహా వరల్డ్ నం.1 ర్యాంక్ కోల్పోయింది దక్షిణాఫ్రికా. స్వదేశానికి తిరిగి వెళ్లిన తర్వాత ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఏబీకి అదనంగా వికెట్ కీపింగ్ బాధ్యతలూ అప్పగించారు. కానీ తొలి మ్యాచ్ సందర్భంగా డివిలియర్స్ రిటైర్మెంట్పై ఆఫ్రికన్స్ పత్రికలో ఓ కథనం వెలువడింది. కొన్ని విషయాలపై ఏబీ అసంతృప్తిగా ఉన్నాడని, అందుకే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు దూరమయ్యే ఆలోచనలో ఉన్నాడని 'రాపోర్ట్' పత్రిక కథనం. ఆ సిరీస్‌లోనూ సఫారీలు ఓడినా.. జాతీయ జట్టు ప్రయోజనాల రీత్యా క్రికెట్‌కు పునరంకితం అవుతానని ఏబీ ఉద్ఘాటించాడు. ఇక 2014లో గ్రేమ్ స్మిత్ తప్పుకున్న వేళ అప్పటికే వన్డే సారథిగా ఉన్న ఏబీని టెస్టులకు కెప్టెన్‌గా ఎంచుకోలేదు. దీనిపై డివిలియర్స్ బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కాడు. 2016లో డివిలియర్స్ దక్షిణాఫ్రికాకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఎంపికైనా.. గాయాలతో అతడు జట్టుకు దూరమయ్యాడు. నిరుడు చాలా సిరీస్‌లకు డివిలియర్స్ దూరమయ్యాడు. భారత్‌తో సిరీస్‌కు ముందు కోలుకున్న డివిలియర్స్, తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ కొనసాగాడు.
గతేడాది గాయాలు, డివిలియర్స్ ప్రాధాన్యతలు గమనంలో ఉంచుకుని ఏబీ మళ్లీ టెస్టుల్లో ఆడితే ఆశ్చర్యమే అనే భావన నెలకొన్నది. కానీ డివిలియర్స్ ఫిట్నెస్ సాధించి తిరిగి టెస్టులు ఆడాడు. దీంతో 2019 ప్రపంచకప్ మిషన్‌ను డివిలియర్స్ ముందుండి నడిపిస్తాడనే అనిపించింది. కానీ ప్రపంచకప్ విజయంపై తనకు విపరీతమైన ఆశల్లేవని ఏబీ ఇటీవల వెల్లడించాడు. ' నేను ఒక్కో మ్యాచ్‌నే తీసుకుంటున్నాను. నా అంతిమ లక్ష్యం ప్రపంచకప్ నెగ్గటం ఏమాత్రం కాదు. నా ఆలోచన తీరును మార్చుకున్నాను. వరల్డ్‌కప్ సాధిస్తే సంతోషం, కెరీర్లో అదో బోనస్. కానీ సాధించకపోయినా అది నా కెరీర్‌ను ఏమీ నిర్దేశించదు' అని డివిలియర్స్ అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అపరిమిత వినూత్న ఆవిష్కరణలతో షాట్లు కొట్టిన డివిలియర్స్.. ఇక అంతర్జాతీయ క్రికెట్లో కనిపించడు. 2019 ప్రపంచకప్‌లో డివిలియర్స్ లేకుండా దక్షిణాఫ్రికా జీవత కాల స్వప్ప సాకారానికి ఇంగ్లాండ్ వెళ్లనున్నది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా... మిస్టర్ 360 వినూత్న విన్యాసాలు ఐపీఎల్లో చూడవచ్చు.
అంకెల్లో ఏబీ డివిలియర్స్..
మ్యా ఇ ప అ.సో సగటు 50 100
టెస్టులు 114 91 8765 278 50.66 46 22
వన్డేలు 228 218 9577 176 53.50 53 25
టీ20 78 75 1672 79 26.12 10 00
నోట్ : మ్యా : మ్యాచులు, ఇ : ఇన్నింగ్స్‌లు, ప : పరుగులు, అ.సో : అత్యధిక స్కోరు