Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రోయేషియా, డెన్మార్క్ శుభారంభం
- పెరూ, నైజీరియా పరాభవం
- ఫిఫా ప్రపంచకప్ 2018
నవతెలంగాణ-మాస్కో
సాకర్ సమరం గ్రూప్ దశలోనే హోరెత్తిస్తోంది. చిన్న జట్టు, అగ్ర జట్టు అనే తేడా మెల్లగా చెరిగిపోతుంది. పసికూన ఐస్లాండ్ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాను నిలువరించగా.. అదే రీతిలో మిగతా మ్యాచులూ సాగుతున్నాయి. గ్రూప్-సిలో పెరు, డెన్మార్క్ పోరులో యూరోప్ జట్టు 1-0 తేడాతో గెలుపొందింది. గ్రూప్-డిలో క్రోయేషియాతో మ్యాచ్‌ను నైజీరియా 0-2తో కోల్పోయింది. తొలి విజయం సాధించిన క్రోయేషియా గ్రూప్‌లో ఫ్రాన్స్‌తో పాటు మూడు పాయింట్లతో ముందంజలో నిలిచింది.
క్రోయేషియా 2-0 : నైజీరియాతో మ్యాచ్‌లో క్రోయేషియా నెగ్గినా.. నిజానికి ఆ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. గోల్ ప్రయత్నాలు చేసినా.. ఆన్ టార్గెట్ షాట్లు ప్రథమార్థంలో అసలే లేవు. ఐనా, డిఫెండర్లు గొప్ప ప్రదర్శనతో ఆ జట్టును ముందంజలో నిలిపారు. క్రోయేషియా కెప్టెనర్ లూకా మాడ్రిక్ ద్వితీయార్థంలో కొట్టిన పెనాల్టీ గోల్ క్రోయేషియాను నిర్ణయాత్మక స్థానంలో నిలిపింది. 32వ నిమిషంలో నైజీరియా ఆటగాడు ఎటెన్బో సెల్ఫ్ గోల్‌తో ప్రథమార్థంలోనే క్రోయేషియాకు 1-0 ఆధిక్యాన్ని కట్టబెట్టాడు. ద్వితీయార్థంలో కెప్టెన్ మాడ్రిక్ పెనాల్టీ కిక్ క్రోయేషియాను విజేతగా నిలిపింది. క్రోయేషియా తన తర్వాతి మ్యాచ్‌లో టైటిల్ ఫేవరేట్ అర్జెంటీనాతో తలపడనున్నది.
పెరూ 0-1 : మరో యూరోప్ జట్టు లీగ్ దశలో మెరుపు విజయం సాధించింది!. గ్రూప్-సి పోరులో డెన్మార్క్ చేతిలో పెరూ ఓటమిపాలైంది. అత్యంత ఉత్కంఠకు దారితీసిన ఈ మ్యాచ్‌లో డెన్మార్క్ 60వ నిమిషంలో గోల్‌తో గట్టెక్కింది. ద్వితీయార్థంలో యూసుఫ్ పౌల్సెన్ గోల్ కొట్టడంతో డెన్మార్క్ ఊపీరి పీల్చుకున్నది. అభిమానుల అండతో పెరూ ప్రథమార్థంలో విశేషంగా ఆకట్టుకున్నది. కానీ గోల్ ప్రయత్నంలో సఫలం కాలేదు. బంతి నియంత్రణలో సమవుజ్జీలుగా నిలిచిన పెరూ, డెన్కార్క్.. ఫలితాన్ని మాత్రం పంచుకోలేదు. ఓ మెరుపు గోల్‌తో డెన్మార్క్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నది. డెన్మార్క్ తన తర్వాతి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుండగా.. పెరూ మరో పరీక్షను ఫ్రాన్స్ రూపంలో ఎదుర్కొవాల్సి ఉంది.