Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెక్సికో చేతిలో 0-1తో ఓటమి
- హిర్వింగ్ లజానో మెరుపు గోల్
డిఫెండింగ్ చాంపియన్స్‌కు గర్వ భంగం. నాలుగేండ్ల క్రితం జగజ్జేతగా నిలిచిన జర్మనీకి రష్యాలో చేదు అనుభవం. టైటిల్ నిలుపుకునేందుకు మాస్కోలో కాలుమోపిన జర్మనీకి.. తొలి మ్యాచ్‌లోనే చుక్కెదురు. మెక్సికో చేతిలో డిఫెండింగ్ చాంపియన్ 0-1తో ఓటమిపాలైంది. యువ ఆటగాడు హిర్వింగ్ లజనో హీరోయిక్స్‌తో మెక్సికో ప్రపంచకప్‌లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.
నవతెలంగాణ-మాస్కో
ఎన్నో అంచనాలు, మరెన్నో ఆశలు. దిగ్గజాలతో కూడిన జట్లు సైతం తలపడేందుకు ఓ నిమిషం ఆలోచన చేసేంత ప్రమాదకర జట్టు జర్మనీ. 2014లో వరుసగా బ్రెజిల్, అర్జెంటీనాలను మట్టికరిపించి జగజ్జేతగా నిలిచిన జర్మనీకి.. మాస్కోలో ఆరంభంలోనే చుక్కెదురైంది. గ్రూప్-ఎఫ్‌లో జర్మనీ తన తొలి మ్యాచ్‌లో దారుణ ఓటమి మూటగట్టుకున్నది. మెక్సికోకు ప్రథమార్థంలోనే సూపర్ గోల్ కొట్టిన 22 ఏండ్ల కుర్రాడు హిర్వింగ్ లజనో ప్రపంచకప్‌లో ఆ జట్టుకు ఎదురులేని విజయాన్ని సాధించిపెట్టాడు. 1986 తర్వాత ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ను నెగ్గకపోవటం జర్మనీకి ఇదే తొలిసారి. అప్పుడు ఉరుగ్వేతో జర్మనీ 1-1తో డ్రా చేసుకున్నది. మిగతా సందర్భాల్లో జర్మనీ ఎప్పుడూ భారీ విజయాలతోనే ప్రపంచకప్‌ను ఆరంభించింది, కానీ మెక్సికో ఈసారి జర్మనీకి ఆరంభ ఆనందాన్ని మిగలనివ్వలేదు.
హిర్వింగ్ హీరోయిక్స్ : జర్మనీతో మ్యాచ్ అనగానే సహజంగానే మెక్సికోపై అంచనాలు తక్కువనే చెప్పాలి. మైదానంలోనూ నిజానికి మెక్సికో ఆటగాళ్లు గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. కానీ వారి వ్యూహం ప్రకారం పక్కా ప్రణాళికతో జర్మనీకి ఝలక్ ఇవ్వటంలో సక్సెస్ సాధించారు. ఆట ఆరంభమైన మొదటి మూడు నిమిషాల్లోనే రెండు జట్లకూ గోల్ అవకాశాలు లభించాయి. జర్మనీ, మెక్సికో లు ఎటాకింగ్తోనే ఆరంభించటంతో మ్యాచ్ హోరాహోరీకి దారితీసింది. ఐతే గోల్ కొట్టింది మెక్సికో మాత్రమే. ఆ జట్టు 35వ నిమిషంలో స్విఫ్ట్ కౌంటర్ ఎటాక్‌ను అమలు చేసింది. దీని ప్రకారం కార్లోస్ వెలా నుంచి పాస్ అందుకున్న జేవియర్ హెర్నాండేజ్ దానిని హిర్వింగ్కు అందించాడు. గోల్ పోస్ట్ ముందు పాస్ అందుకున్న హిర్వింగ్ మెరుపు కిక్‌తో గోల్ కొట్టేశాడు. అంతే, మెక్సికో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అదే విధంగా 45వ నిమిషంలోనూ కార్లోస్ వెలాస్ గోల్ ప్రయత్నం చేసినా.. ఈసారి జర్మనీ గోల్‌కీపర్ అడ్డుకున్నాడు. ప్రథమార్థం ముగిసే సరికి 1-0 ఆధిక్యంతో మెక్సికో ముందంజలో నిలిచింది. కానీ ఆడుతున్నది జర్మనీతో కావటంతో మెక్సికో విజయంపై అప్పటికే ఓ అంచనాకు రాలేని పరిస్థితి. అందుకు అనుగుణంగానే ద్వితీయార్థంలో మెక్సికో ఆటగాళ్లు నీరసించారు. ప్రథమార్థంలో చూపిన చురుకుదనం సెకండ్ హాఫ్‌లో లోపించింది. ఇదే సమయంలో జర్మనీ తన ఎటాకింగ్‌కు మరింత పదును పెట్టింది. ఈ క్రమంలో జర్మనీ ఎన్నో అవకాశాలను సృష్టించుకున్నప్పటికీ.. సమన్వయ లోపంతో గోల్స్ సాధించలేదు. 89వ నిమిషంలో జర్మనీ గోల్ కొట్టినంత పని చేసింది కానీ, జులియన్ ప్రయత్నం క్రాస్ బార్‌కు తగిలి వృథా అయిపోయింది.