Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3-0తో పనామాపై ఘన విజయం
- ఆరంగేట్ర మ్యాచ్‌లో పనామా చిత్తు
నవతెలంగాణ-మాస్కో
ఫిఫా ప్రపంచకప్ వేటను మిగతా ఫేవరేట్లతో పోల్చితే బెల్జియం ఎంతో భిన్నంగా ఆరంభించింది. అరంగేట్ర ఐస్‌లాండ్‌తో అర్జెంటీనా డ్రా చేసుకోగా.. చిన్న జట్టు స్విస్‌తో బ్రెజిల్ డ్రా చేసుకోగా, మెక్సికో చేతిలో జర్మనీ ఓడిపోగా.. బెల్జియం మాత్రం బూమ్ బూమ్ ఆరంభాన్ని అందుపుచ్చుకున్నది. తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌లో ఆడుతున్న పనామాపై బెల్జియం గోల్స్ వర్షంతో విరుచుకుపడింది. మార్టెన్స్ తొలుత సూపర్ వ్యాలీ గోల్‌తో బెల్జియం ఖాతా తెరువగా.. రొమెలు లుకాకు ఆధిక్యాన్ని మరింత పెంచాడు. ఆరు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ కొట్టేసి బెల్జియంకు 3-0తో ఘన విజయాన్ని అందించాడు.
బలమైన బెల్జియంతో పోరు ఐనా.. పనామా తొలి అర్థ భాగంలో అదరగొట్టింది. బెల్జియం దూకుడుకు అడ్డుకట్ట వేసింది!. దీంతో బెల్జియం ఎంత ప్రయత్నించినా తొలి 45 నిమిషాల్లో గోల్ కొట్టలేకపోయింది. కానీ ద్వితీయార్థం ఆరంభంలోనే బెల్జియం గోల్ ఖాతా తెరిచాడు మార్టెన్స్. బెల్జియంకు రెగ్యులర్‌గా ఆడుతున్నా.. స్టార్‌గా ఎదగని మార్టెన్స్ సూపర్ వ్యాలీ కిక్‌తో గోల్ కొట్టాడు. ఈ గోల్ అతడి పాపులారిటీ విశేషంగా పెంచబోతున్నది!. సెకండ్ హాఫ్‌లో మరింత రెచ్చిపోయిన రుమెలు లుకాకు ఆరు నిమిషాల వ్యవధిలోనే రెండు మెరుపు గోల్స్ సాధించాడు. 69వ నిమిషంలో గోల్ కొట్టిన లుకాకు.. మళ్లీ 75వ నిమిషంలో గోల్ సాధించేశాడు. దీంతో 3-0తో బెల్జియం ఘన విజయం నమోదు చేసింది.