Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రెజిల్‌ను నిలువరించిన స్విట్జర్లాండ్
- 1-1తో సాంబా జట్టుతో పోరు డ్రా
- కౌటిన్హో కండ్లుచెదిరే గోల్
రష్యాలో ఫేవరేట్లకు ఆరంభం అచ్చొచ్చినట్టు లేదు!. మొన్న అర్జెంటీనా, నిన్న జర్మనీ, నేడు బ్రెజిల్. డిఫెండింగ్ చాంపియన్ ఏకంగా పరాజయం పాలవగా.. అర్జెంటీనా డ్రాతో సరిపెట్టింది. తాజాగా దిగ్గజ జట్టు బ్రెజిల్ పరిస్థితీ అంతే. ఫిఫా ప్రపంచకప్‌లో పునరాగమనం చేసిన స్విస్ జట్టు సాంబా స్టార్స్‌కు షాకిచ్చింది. బలమైన ఎటాకింగ్ బృందాన్ని నిలువరించి.. బ్రెజిల్‌ను డ్రా తోనే సరిపెట్టింది. ఆసక్తికరంగా సాగిన స్విస్, బ్రెజిల్ పోరు 1-1తో ముగిసింది.
నవతెలంగాణ-మాస్కో
ఆల్‌టైమ్ ఫేవరేట్, టైటిల్ రేసులో ఎప్పుడూ ముందుండే బ్రెజిల్‌కు ముందే తెలుసు. ఆరంభ మ్యాచ్‌లో ఎదుర్కొబోయే ప్రత్యర్థి అంత తేలిక కాదు అని!. ఎంతో క్రమశిక్షణతో కదిలే స్విస్ ఫుట్‌బాలర్లు.. అదే అలవాటును రష్యాలోనూ కొనసాగించారు. భీకర ఎటాకర్లను నిలువరించి, ఆనందంతో డ్రా కొట్టేశారు. ప్రపంచ టాప్-10 ఫుట్‌బాలర్లలో నిలిచే నెరుమార్, మార్సెలో, కౌటిన్హోలు బ్రెజిల్ సొంతం. ఈ ముగ్గురు బరిలో నిలిచిన వేళ ఎంతటి ప్రత్యర్థికైనా చెమటలు పట్టాల్సిందే. కానీ స్విస్ సూపర్ ప్రదర్శన చేసింది. ఆ జట్టుకు ఒకే ఒక్క గోల్‌కు పరిమితం చేయట మే కాదు మెరుపు హెడర్‌తో గోల్ కొట్టి ఔరా అనిపించింది. బ్రెజిల్ తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించటంతో గ్రూప్-ఈలో సెర్బియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
కండ్లుచెదిరే కిక్ : మ్యాచ్ ఎంత కఠినంగా సాగుతున్నా, అవకాశాలు ఏమాత్రం లభించకపోయినా.. గోల్ కొట్టడం ఇక అసాద్యమేమో అనిపించే పరిస్థితి నెలకొన్నా.. అత్యుత్తమ ఆటగాళ్లు అవకాశాలు సృష్టించుకోవటంలో ఎల్లప్పుడూ ముందుంటారు. స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో బ్రెజిల్ స్టార్ ఫిలిఫ్ కౌటిన్హో సైతం ఇదే చేశాడు. ఆట 20వ నిమిషంలోనే గోల్ పోస్ట్‌కు సుమారు దూరం నుంచి కండ్లుచెదిరే కిక్‌తో గోల్ కొట్టాడు. డిఫెండర్ నుంచి పాస్ అందుకున్న కౌటిన్హోకు నిజానికి అక్కడ గోల్ కొట్టే అవకాశం లేదు. కానీ ఎంతో దూరం నుంచే షాట్ కొట్టేందుకు సిద్ధమైపోయిన ఫిలిఫ్.. బంతిని వంకర్లు తిప్పుతూ గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. బంతి స్పిన్ అవుతూ గోల్ పోస్ట్‌లోకి వెళ్లటం ఫ్రీ కిక్‌లతో ఎన్నో సార్లు చూసి ఉంటాం, కానీ ఇది ప్రత్యేకం. స్విస్ డిఫెండర్లను ముందుగా ఉంచుకుని, కనీసం పాస్‌కు సైతం చోటు లేని వేళ అతడు ఏకంగా గోల్ కొట్టేశాడు. 1-0 ఆధిక్యంతో ప్రథమార్థంలో బ్రెజిల్ జోరు కనిపించింది. ఐతే ద్వితీయార్థం ఆరంభంలోనే స్విస్ ఖాతా తెరిచింది. లెఫ్ట్ కార్నర్ నుంచి వచ్చిన కిక్‌ను హెడర్‌తో జుబెర్ గోల్ కొట్టాడు. దీంతో స్విస్ సంబురాలు అంబరాన్ని అంటాయి. 1-1తో స్కోరు సమమైనా.. బ్రెజిల్ ఇంకా గెలుపు రేసులోనే కొనసాగింది. బలమైన ఎటాకింగ్ కల్గిన బ్రెజిల్ ఆఖరి క్షణాల్లో సైతం భీకర దాడులతో గోల్ కొట్టగలదు. ఇంజూరీ సమయంలో సరిగ్గా ఇదే జరిగింది. మెరుపు వేగంతో బ్రెజిలియన్స్ ముందుకు కదిలి గోల్ పోస్ట్‌పైకి దూసుకెళ్లినా.. గోల్ సాధించటంలో విఫలమ య్యారు. బ్రెజిల్ సూపర్ స్టార్ నెరుమార్ స్వేచ్చగా ఆడేందుకు వీలు లేకుండా స్విస్ డిఫెండర్లు అతడిని వెంబడిం చారు. అతడి కాలుని బంధించటంలో విజయవంతమయ్యారు.
ఎవరెలా ఆడారు..!
బ్రెజిల్ స్విట్జర్లాండ్
01 గోల్స్ 01
20 గోల్ ప్రయత్నాలు 06
07 కార్నర్లు 02
52 బంతి నియంత్రణ 48
88 పాస్ కచ్చితత్వం 83
01 ఎల్లో కార్డులు 03