Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొలంబియాపై 2-1తో మెరుపు విజయం
- ఓ దక్షిణ అమెరికా జట్టుపై ఆసియా జట్టుకు ప్రపంచ కప్‌లో ఇదే తొలి గెలుపు
- ఆఖరి నిమిషాల్లో ఒసాకా అద్భుత గోల్
- ఫిఫా ప్రపంచకప్ 2018
జపాన్ చరిత్ర సృష్టించింది. మరే ఆసియా జట్టు సాధించలేని అరుదైన ఘనత సొంతం చేసుకున్నది. ఫుట్‌బాల్‌లో ఆసియా సింహనాదంగా కొనసాగుతున్న జపాన్.. మునుపెన్నడూ ప్రపంచకప్‌లో ఓ దక్షిణ అమెరికా జట్టును ఓడించలేదు. జపాన్ మాత్రమే కాదు మరే జట్టుకూ ఇది సాధ్యపడలేదు. 2014లో కొలంబియా చేతిలో దారుణ ఓటమి చవిచూసిన జపాన్... రష్యాలో ప్రతీకారం తీర్చుకున్నది. 2-1తో కొలంబియాను చిత్తు చేసి కొత్త చరిత్ర సృష్టించింది.
నవతెలంగాణ-మాస్కో
2014 ఫిఫా ప్రపంచకప్. గ్రూప్-సిలో లీగ్ మ్యాచ్. ఆసియా ఆశలు మోస్తున్న జపాన్‌తో దక్షిణ అమెరికా జట్టు కొలంబియా పోరు. ఎప్పట్లాగే ప్రపంచకప్‌లో చెలరేగిన కొలంబియా 4-1తో జపాన్ను చిత్తు చేసింది. ప్రథమార్థంలోనే గోల్ కొట్టి సమవుజ్జీగా నిలిచినా.. ద్వితీయార్థంలో ఏకంగా మూడు గోల్స్ కోల్పోయి జపాన్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నది. నాలుగేండ్లు గడిచాయి, ఫిఫా ప్రపంచకప్ సమరం రష్యాకు చేరింది. మళ్లీ గ్రూప్ దశలో ఆరంభ సమరం. అవే జట్లు జపాన్, కొలంబియా. ఇప్పుడు సైతం కొలంబియా బలంగానే ఉంది, జపాన్ ఎప్పట్లాగే ఆశావహ దృక్పథంతోనే బరిలోకి దిగింది. కానీ 90 నిమిషాల ఆట ముగిసే సరికి ఫలితం ఊహించనట్టుగా రాలేదు. ఫిఫా ప్రపంచకప్‌లో జపాన్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఫుట్‌బాల్ ఖండంగా పేరొందిన దక్షిణ అమెరికా జట్లు చరిత్రలో ఎన్నడూ ఆసియా జట్ల చేతిలో పరాజయం చవిచూడలేదు. కానీ రష్యాలో జపాన్ చరిత్రకు చెరమగీతం పాడింది. ఆసియా జట్లూ అదరగొట్టగలవని గోల్స్‌తో నిరూపించింది. గ్రూప్-హెచ్లో కొలంబితో మ్యాచ్‌ను 2-1తో గెలుపొందిన జపాన్ ప్రపంచకప్‌లో అదిరే ఆరంభం సాధించింది. ప్రథమార్థంలో సమవుజ్జీలుగా నిలిచిన తరుణంలో ఆఖరి నిమిషాల్లో అద్భుత గోల్ కొట్టిన ఒసాక జపాన్ను సంబురాల్లో ముంచెత్తాడు. నాలుగేండ్ల క్రితం సెకండ్ హాఫ్ తడబాటుతో కొలంబియాకు చేతిలో మట్టికరిచిన జపాన్.. తాజాగా అదే కొలంబియాను మళ్లీ సెకండ్ హాఫ్‌లోనే చిత్తు చేసి మరుపురాని విజయాన్ని అందుకున్నది. గ్రూప్-హెచ్లో ముందంజ వేసింది. జపాన్ తన తర్వాతి మ్యాచ్‌లో సెనెగల్‌తో తలపడనున్నది.
ఔరా.. ఒసాకా : కొలంబియా, జపాన్ మ్యాచ్‌లో దక్షిణ అమెరికా జట్టు ఫేవరేటే కానీ, జపాన్ ఎన్నడూ బలహీనంగా లేదు!. ఐతే తాజా పోరులో ఆరంభంలోనే కొలంబియాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. హ్యాండ్‌బాల్ కారణంతో ఆట ఆరంభమైన మూడు నిమిషాల్లోనే ఆ జట్టుకు రిఫరీ రెడ్ కార్డ్ అందించాడు. రెడ్ కార్డ్‌తో మెరుపు మిడ్‌ఫీల్డర్ కార్లోస్ సాంచెజ్ మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో కొలంబియా మిగతా ఆట 10 మంది ఆటగాళ్లతోనే నెట్టుకొచ్చింది. జపాన్ దూకుడుగా, కొలంబియా రక్షణాత్మకంగా ఆడేందుకు ఇదీ ఓ కారణం. కొలంబియా రెడ్ కార్డ్ అందుకున్న మరో మూడు నిమిషాల్లోనే జపాన్ వారికి మరో షాకిచ్చింది. ఆరో నిమిషంలో లభించిన పెనాల్టీ అవకాశాన్ని ఆసియా సింహనాదం రెండు చేతులా ఒడిసిపట్టుకున్నది. షింజి కగవా పెనాల్టీని నేర్పుగా గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. జపాన్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ 39వ నిమిషంలో జాన్ క్వింటారో సూపర్ గోల్‌తో కొలంబియా ఖాతా తెరిచాడు. దీంతో ప్రథమార్థం ముగిసే సరికి 1-1తో సమవుజ్జీలుగా నిలిచారు. ఓ మిడ్‌ఫీల్డర్ కొరతతో కొలంబియా ఎటాకింగ్ మాత్రమే కాదు డిఫెన్స్ వ్యూహం సైతం మారిపోయింది. మరో గోల్ కోసం ఇరు జట్లూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వేళ జపాన్ ఈలేసింది. 73వ నిమిషంలో యుయ ఒసాకా గోల్‌తో జపాన్ను 2-1తో ఆధిక్యంతో పాటు అద్భుత విజయాన్ని అందించాడు.
ఆటలో ఎవరెలా..
కొలంబియా జపాన్
01 గోల్స్ 02
08 గోల్ ప్రయత్నాలు 14
03 కార్నర్లు 06
41 బంతి నియంత్రణ 59
82 పాస్ కచ్చితత్వం 86
02 ఎల్లో కార్డులు 01
01 రెడ్ కార్డులు 00