Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రోయేషియా చేతిలో అనూహ్య షాక్
- 0-3తో దారుణ పరాభవం
- డోలాయమానంలో నాకౌట్ ఆశలు
ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలనం!. ఫుట్‌బాల్ దిగ్గజం అర్జెంటీనాకు అనూహ్య పరాభవం. ఫిఫా ప్రపంచకప్‌లో రెండోసారి ఆడుతున్న క్రోయేషియా.. టైటిల్ ఫేవరేట్‌కు దిమ్మదిరిగే షాకిచ్చింది. మెస్సీ జట్టును 0-3తో ఓడించిన క్రోయేషియా దక్షిణ అమెరికా జట్టు నాకౌట్ ఆశలను సంక్లిష్టం చేసేసింది. మైదానంలో మెస్సీ చురుగ్గా కనిపించని రోజు.. ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు పీడకలలా మిగిలిపోయింది!. ఆఖరి మ్యాచ్‌లో భారీ విజయం సాధిస్తే తప్ప అర్జెంటీనా గ్రూప్ దశ దాటే అవకాశాలు కనిపించటం లేదు. 3-0 విజయంతో క్రోయేషియా నాకౌట్లో ప్రవేశించింది.
నవతెలంగాణ-మాస్కో
1998 ఫిఫా ప్రపంచకప్. కీలక క్వార్టర్‌ఫైనల్స్ పోరు. యూరోపియన్ దిగ్గజం జర్మనీతో అరంగేట్ర జట్టు క్రోయేషియా పోరు. జర్మనీ విజయంపై ఎవ్వరికీ సందేహం లేదు. కానీ ఫలితం మరోలా వచ్చింది. క్రోయేషియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సీన్ కట్ చేస్తే, 2018 ఫిఫా ప్రపంచకప్ సమరం. నాలుగేండ్ల క్రితం ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచిన అర్జెంటీనాకు క్రోయేషియా అదే రీతిలో సత్కారం చేసింది. దక్షిణ అమెరికా జట్టు మైదానంలో తీవ్రంగా తడబాటుకు గురైన వేళ.. క్రోయేషియా నాకౌట్ స్థానాన్ని కొల్లగొట్టింది. ముచ్చటగా మూడు గోల్స్ కొట్టి అర్జెంటీనాకు కోలుకోలేని షాకిచ్చింది. ప్రథమార్థం గోల్స్ లేకుండానే ముగియగా.. క్రోయేషియా మూడు గోల్స్ ద్వితీయార్థంలోనే కొట్టేసింది. రెబెక్, లుకా మాడ్రిక్, ఇవాన్ రాకిటిక్లు గోల్స్‌తో క్రోయేషియాకు మరుపురాని విజయాన్ని అందించారు. అర్జెంటీనా నాకౌట్ ఆశలు మంగళవారం నైజీరియాతో పోరుపై ఆధారపడి ఉన్నాయి. ఆ మ్యాచ్‌లో భారీ విజయం సాధిస్తే అర్జెంటీనా గ్రూప్ దశ దాటే అవకాశాలు ఉంటాయి!.
క్రోయేషియా కోలాటం: ఎటాక్, డిఫెన్స్‌లలో బలమైన అర్జెంటీనాకు ఊహించని పరాజయం ఎదురైంది. క్రోయేషియాతో గ్రూప్ మ్యాచ్‌లో ఆ జట్టు ఆరంభంలోనే మెరుగ్గానే కనిపించింది. తొలి మూడు నిమిషాల్లోనే లియోనల్ మెస్సీ గోల్‌కు దగ్గరయ్యాడు. క్రోయేషియా గోల్ పోస్ట్ ముందే తిష్ట వేసిన అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్లు.. ఎప్పుడెప్పుడు గోల్ కొడదామా అన్నట్టు పొంచి ఉన్నారు. కానీ ఫలితం మరోలా వచ్చింది. బంతిని అధిక భాగం నియంత్రణలో ఉంచుకున్న అర్జెంటీనా.. స్పష్టమైన అవకాశాలు కల్పించుకోవటంలో విఫలమైంది. ప్రత్యేకించి లియోనల్ మెస్సీ ఇంకా ఫిఫా ప్రపంచకప్‌లో గోల్ కొట్టనేలేదు. అర్జెంటీనా ఆధిపత్యం కనిపించిన తొలి అర్థ భాగం 0-0తో ముగిసింది. కానీ విరామం తర్వాత క్రోయేషియా కొత్త ఉత్సాహంతో అడుగుపెట్టింది. 53వ నిమిషంలోనే రెబిక్ గోల్‌తో క్రోయేషియా 1-0తో ముందంజ వేసింది. 80వ నిమిషంలో అర్జెంటీనాకు గోల్ కీపర్‌ను మభ్యపెట్టి క్రోయేషియా మరో గోల్ కొట్టింది. లుకా మెడ్రిక్ మెరుపు గోల్‌తో ఆ జట్టుకు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ సమయంలో అర్జెంటీనా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంజూరీ సమయంలో ఇవాన్ రాక్టిక్ మరో గోల్‌తో మెరిశాడు. దీంతో హాట్రిక్ గోల్స్ సాధించిన క్రోయేషియా.. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజానికి దిమ్మదిరిగే షాకిచ్చింది. తిరుగులేని విజయంతో గ్రూప్-డి నుంచి తొలి నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకున్నది.
ఫిఫా ప్రపంచకప్ ఆరంభానికి ముందే రష్యా టోర్నీ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు దూరం అవుతానని మెస్సీ సంకేతిలిచ్చాడు. ప్రపంచకప్ నెగ్గాలనే ఈ దిగ్గజం కల.. నెమ్మదిగా పీడకలగా మారుతోంది!. 2014 ఫైనల్లో జర్మనీ చేతిలో 0-1తో ఓడిన అర్జెంటీనా.. 2015, 2016 కోపా అమెరికా ఫైనల్స్‌లో వరుసగా చిలీ చేతిలో పెనాల్టీ షూటౌట్లో ఓడింది. ఇప్పుడు తాజా రష్యాలో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించే ప్రమాదంలో పడింది. అర్జెంటీనా ఫామ్ పట్ల అభిమానులు ఆందోళనగా ఉంటే.. మరోవైపు మెస్సీ ఫామ్‌పై మార్కెట్ బెంగ పెట్టుకున్నది. ఐస్‌లాండ్‌తో పెనాల్టీ మిస్ చేసిన మెస్సీ.. అదే పశ్చాత్తాపంతో క్రోయేషియాతో మ్యాచ్‌లో కనిపించాడు. మెస్సీ సహజసిద్ధమైన జోరు కనిపించలేదు. మరోవైపు చిరకాల ప్రత్యర్థి క్రిస్టియానో రొనాల్డో గోల్స్ వర్షం కురిపిస్తున్నాడు. దీంతో మెస్సీ మార్కెట్, బ్రాండ్ విలువ తగ్గుతుందేమోనని అంచనాలు నెలకొన్నాయి. ఒక్క టోర్నీ మెస్సీ కెరీర్‌ను, మార్కెట్ విలువను నిర్ణయించలేకున్నా.. ప్రపంచకప్ సాధించని దిగ్గజంగా మెస్సీ మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది.